Cheyutha : చేయూత కొత్త పింఛన్లకు నేటి నుంచి దరఖాస్తులు.. ఇలా దరఖాస్తు చేయాలి.. వీరు అర్హులు..!
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేయూత పింఛన్లను అమలు చేస్తోంది. కొత్త పింఛన్ల మంజూరుకు దరఖాస్తుల కోసం పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు శనివారం నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానున్నది.

Cheyutha : చేయూత కొత్త పింఛన్లకు నేటి నుంచి దరఖాస్తులు.. ఇలా దరఖాస్తు చేయాలి.. వీరు అర్హులు..!
మనసాక్షి, తెలంగాణ బ్యూరో :
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేయూత పింఛన్లను అమలు చేస్తోంది. కొత్త పింఛన్ల మంజూరుకు దరఖాస్తుల కోసం పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు శనివారం నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానున్నది. ఈనెల 15వ తేదీ నుంచి కొత్త పింఛన్ల మంజూరుకు ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో అధికారులు దరఖాస్తుల స్వీకరణకు మార్గదర్శకాలను వెల్లడించారు. అర్హులైన ప్రతి ఒక్కరి నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నారు.
కొత్త దరఖాస్తులలో ప్రాధాన్యత :
పింఛన్లలో మొదటి ప్రాధాన్యంగా ఒంటరి మహిళలు, వితంతువులను పరిగణించనున్నారు. వారితో పాటు గీత కార్మికులు, చేనేత కార్మికులు, ఫైలేరియా బాధితులు, డయాలసిస్ బాధితులకు పింఛన్లు మంజూరు చేయనున్నారు. అదేవిధంగా దివ్యాంగుల కేటగిరిలో తల సేమియా, సికిల్ సెల్, హిమోఫిలియా బాధితులను కూడా పింఛన్లకు అర్హులుగా గుర్తించి దరఖాస్తులు స్వీకరించనున్నారు.
దరఖాస్తులకు అర్హత :
చేయూత పింఛన్లకు అర్హత విషయంలో కుటుంబ వార్షికాదాయాన్ని ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామీణ ప్రాంతాలలో వార్షిక ఆదాయం 1.50 లక్షల కంటే తక్కువగా ఉండాలి. పట్టణ ప్రాంతాలలో 2 లక్షల రూపాయల కంటే వార్షికాదాయం తక్కువగా ఉండాలి. ప్రభుత్వం నిర్దేశించిన ఆదాయ పరిమితి కంటే ఎక్కువ ఆదాయం ఉన్నవారు పింఛన్లకు అనర్హులుగా పరిగణిస్తారు.
అదేవిధంగా వ్యవసాయ భూమి విషయంలోనూ కూడా పరిమితులను విధించింది. మూడు ఎకరాల కంటే ఎక్కువ మాగాని భూమి, లేదా 7.5 ఎకరాల కంటే ఎక్కువ మెట్ట భూమి ఉన్నవారు పింఛన్లకు అర్హులు కారు. ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేట్ సంస్థలు, ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు, ఉద్యోగులు కూడా అనర్హులుగా పేర్కొన్నది. డాక్టర్లు, కాంట్రాక్టర్లు ఇతర వృత్తిని కూడా పింఛన్ లకు అర్హులు కాదు. అదేవిధంగా ఆయిల్ మిల్లులు,రైస్ మిల్లులు, పెట్రోల్ బంకుల యజమానులు వారి తల్లిదండ్రులను కూడా అనర్హుల జాబితాలోకి చేర్చారు.
ప్రభుత్వ, స్వాతంత్ర సమరయోధుల పింఛన్ పొందుతున్న వారికి కొత్తగా చేయిత పించన్ మంజూరు చేయరు. అదే విధంగా నాలుగు చక్రాల వాహనాలు, భారీ వాహనాలు కలిగి ఉన్న వారిని కూడా అనర్హులుగా పరిగణించనున్నారు. గతంలో చేయూత పింఛన్ కోసం దరఖాస్తులు చేసుకున్న వారు మళ్ళీ కొత్తగా దరఖాస్తు చేయవలసిన అవసరం లేదని ప్రభుత్వం పేర్కొన్నది. అయితే వారి దరఖాస్తులు రికార్డుల్లో ఉన్నాయో..? లేదో సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి ధ్రువీకరించుకోవాలని సూచించింది. గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీ కార్యదర్శులు, పట్టణ ప్రాంతాల్లో వార్డు అధికారులు వివరాలను ధ్రువీకరిస్తారు.
దరఖాస్తు విధానం :
కొత్తగా పింఛన్ కోసం దరఖాస్తు చేసుకునేవారు చేయూత వెబ్సైట్ నుంచి దరఖాస్తు ఫారాన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ ఫారంలో అవసరమైన పూర్తి వివరాలను నమోదు చేయాలి. సంబంధిత అధికారులకు అందజేయాలి. గ్రామాల్లో దరఖాస్తులను పంచాయతీ కార్యదర్శులకు, మండల పరిషత్ కార్యాలయంలో అందజేయవచ్చును. అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో వార్డు అధికారులు, బిల్ కలెక్టర్లు, పురపాలక కమిషనర్లకు దరఖాస్తులు అందజేయవచ్చును. దరఖాస్తులకు చివరి తేదీ అంటూ ప్రకటించలేదు. దరఖాస్తుల అనంతరం ప్రాధాన్యత వర్గాలను గుర్తించి అర్హత నిబంధనల ప్రకారం కొత్త పింఛన్లను మంజూరు చేయనున్నారు.
MOST READ :
- Srisailam : శ్రీశైలం నిండకముందే ఏపీకి నీటి తరలింపు.. మరి సాగర్ పరిస్థితి..!
- Srisailam : కృష్ణమ్మ పరవళ్ళు.. శ్రీశైలంకు భారీ వరద.. ఎన్ని టిఎంసీ చేరిందంటే.. లేటెస్ట్ అప్డేట్..!
- Narayanpet : తీవ్ర విషాదం.. ప్రభుత్వ పాఠశాలలో పాము కాటుకు గురై విద్యార్థి మృతి..!
- నానో ఎరువుల వాడకం ఇలా.. వినిగించే విధానం రైతులకు వివరించిన శాస్త్రవేత్తలు..!









