పోలీసులమంటూ డిజిటల్ అరెస్ట్ బెదిరింపులు.. నల్గొండ జిల్లాకు చెందిన ఇద్దరు సైబర్ నేరగాళ్ల అరెస్ట్..!
వ్యవస్థీకృత నేర సమూహంగా ఏర్పడి, పోలీసులుగా నటిస్తూ బంగారు వ్యాపారులను ఫోన్ ద్వారా బెదిరించి, ‘డిజిటల్ అరెస్ట్’ పేరుతో అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్న ఇద్దరు సైబర్ నేరగాళ్లను కేసముద్రం పోలీసులు అరెస్ట్ చేశారు.

పోలీసులమంటూ డిజిటల్ అరెస్ట్ బెదిరింపులు.. నల్గొండ జిల్లాకు చెందిన ఇద్దరు సైబర్ నేరగాళ్ల అరెస్ట్..!
రూ.4.20 లక్షల వరకు అక్రమ వసూళ్లు..
వివరాలు వెల్లడించిన మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్
మన సాక్షి, మహబూబాబాద్ :
వ్యవస్థీకృత నేర సమూహంగా ఏర్పడి, పోలీసులుగా నటిస్తూ బంగారు వ్యాపారులను ఫోన్ ద్వారా బెదిరించి, ‘డిజిటల్ అరెస్ట్’ పేరుతో అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్న ఇద్దరు సైబర్ నేరగాళ్లను కేసముద్రం పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి మొబైల్ ఫోన్‌తో పాటు పోలీస్ యూనిఫాంను స్వాధీనం చేసుకున్నట్లు మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ తెలిపారు.
కేసు వివరాలు:
కేసముద్రం పోలీస్ స్టేషన్లో Cr.No.225/2026, U/s 111(2)(ii), 318(4), 319(2), 308(2) BNS, Sec.66-D IT Act కింద కేసు నమోదు చేశారు.
అరెస్టయిన నిందితులు:
1. షేక్ ఇర్ఫాన్, ( 29) , వృత్తి వ్యాపారం, నిడమనూరు గ్రామం మరియు మండలం, నల్గొండ జిల్లా.
2. చింతలచేరువు ప్రశాంత్, ( 26) వృత్తి ఆటో డ్రైవర్, నిడమనూరు గ్రామం మరియు మండలం, నల్గొండ జిల్లా.
పోలీస్ అధికారిగా నటిస్తూ బంగారు వ్యాపారికి ఫోన్ :
నిందితుడు షేక్ ఇర్ఫాన్ పోలీస్ యూనిఫాం ధరించి ఫొటో తీసుకుని, దానిని WhatsApp మరియు Truecallerలో DPగా ఉపయోగించాడు. అనంతరం కేసముద్రం మండలానికి చెందిన బంగారు వ్యాపారి బోగోజు వేణుగోపాల చారి ఫోన్ నంబర్‌ను Google ద్వారా సేకరించి, 10.09.2026న అతనికి ఫోన్ చేశాడు.
ALSO READ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదం.. కారు లాక్ కావడంతో నాలుగేళ్ల చిన్నారి మృతి..!
తాను వికారాబాద్ సమీపంలోని పార్వతీపురం పోలీస్ స్టేషన్ ఎస్ఐగా పరిచయం చేసుకుని, ఇద్దరు దొంగలను పట్టుకున్నామని, వారు దొంగిలించిన బంగారాన్ని బాధితుడు కొనుగోలు చేశాడని, అందుకు సంబంధించిన రసీదులు తమ వద్ద ఉన్నాయని చెప్పి బెదిరించాడు.
తాను కొనుగోలు చేసిన బంగారాన్ని రికవరీగా ఇవ్వకపోతే వచ్చి అరెస్ట్ చేస్తామని, అరెస్ట్ చేస్తే పరువు, మర్యాదలకు భంగం కలుగుతుందని భయపెట్టాడు. అనంతరం డబ్బులు పంపించాలని WhatsApp ద్వారా QR కోడ్ పంపించి, బాధితుడి నుంచి రూ.88,026/- అక్రమంగా వసూలు చేశాడు.
సాంకేతిక ఆధారాలతో నిందితుల గుర్తింపు :
ఈ..ఘటనపై కేసముద్రం ఎస్ఐ కేసు నమోదు చేయగా, కేసముద్రం సీఐ వై సత్యనారాయణ దర్యాప్తు చేపట్టారు. సాంకేతిక ఆధారాలు, సైబర్ క్రైమ్ పోర్టల్ వివరాలు, బ్యాంక్ స్టేట్మెంట్లను విశ్లేషించి నిందితులను గుర్తించారు. కేసముద్రం సీఐ వై సత్యనారాయణ, కేసముద్రం ఎస్ఐ కె క్రాంతి కిరణ్ ఆధ్వర్యంలో.. పోలీసులు 20.09.2026 సాయంత్రం ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో బంగారు వ్యాపారులే లక్ష్యం :
విచారణలో నిందితులిద్దరూ ఇదే తరహాలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని బంగారు వ్యాపారులను పోలీసులమని బెదిరిస్తూ, ‘డిజిటల్ అరెస్ట్’ పేరుతో ఆన్లైన్ ద్వారా డబ్బులు వసూలు చేసినట్లు గుర్తించారు. 15.08.2026 నుంచి 15.09.2026 వరకు సుమారు రూ.4,20,000/- మేరకు బలవంతపు వసూళ్లకు పాల్పడినట్లు దర్యాప్తులో వెల్లడైంది.
గతంలోనూ పలు కేసులు :
2024–25 సంవత్సరాల్లో నిందితులు తమ గ్రామానికి చెందిన చింతలచేరువు రవి, షేక్ వాజిద్, చింతలచేరువు అక్షిత్ తదితరులతో కలిసి వ్యవస్థీకృత నేర సమూహంగా ఏర్పడి, పోలీసులుగా నటిస్తూ రెండు తెలుగు రాష్ట్రాల్లోని బంగారు వ్యాపారులను బెదిరించి అక్రమ వసూళ్లకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. నిందితులపై నల్గొండ I-Town, ఆదిలాబాద్ I-Town, ఎచ్చోడ, కట్టంగూర్, తిరుమలగిరి, రామగూడెం, బిక్కవోలు పోలీస్ స్టేషన్లలో గతంలో పలు కేసులు నమోదయ్యాయి. ఆయా కేసుల్లో అరెస్ట్ అయి జైలు నుంచి విడుదలైన అనంతరం కూడా నేరాలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.
ALSO READ : ఆలూర్ లో విషాదం.. కరెంట్ షాక్ తగిలి యువకుడు దుర్మరణం..!
పోలీస్ యూనిఫాం, మొబైల్ ఫోన్ స్వాధీనం :
అరెస్టయిన నిందితుల నుంచి నేరానికి ఉపయోగించిన మొబైల్ ఫోన్, పోలీస్ యూనిఫాంను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ..సందర్బంగా *ఎస్పీ డాక్టర్ శబరీష్ మాట్లాడుతూ..* పోలీసుల పేరుతో వచ్చే ఫోన్ కాల్స్, డిజిటల్ అరెస్ట్ బెదిరింపులు, అనుమానాస్పద QR కోడ్లు, ఆన్లైన్ డబ్బు డిమాండ్లకు ప్రజలు స్పందించవద్దని సూచించారు. ఎవరైనా సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930కు కాల్ చేసి, సంబంధిత సైబర్ క్రైమ్ పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయాలని సూచించారు. ఈ.. విలేకరుల సమావేశంలో మహబూబాబాద్ డిఎస్పీ తిరుపతిరావు పాల్గొన్నారు..









