Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుమహబూబ్‌నగర్

జిల్లా ఎస్పీ కీలక ఆదేశం.. కేసుల సత్వర పరిష్కారం, నేర నిరూపణే లక్ష్యంగా పనిచేయాలి..! 

మహబూబ్‌నగర్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో శనివారం జిల్లా ఎస్పీ డి.జానకి కోర్టు డ్యూటీ అధికారులు, కోర్టు లైజన్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

జిల్లా ఎస్పీ కీలక ఆదేశం.. కేసుల సత్వర పరిష్కారం, నేర నిరూపణే లక్ష్యంగా పనిచేయాలి..! 

(మహబూబ్ నగర్ టౌన్, శ్రీశైలం, మన సాక్షి)

మహబూబ్‌నగర్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో శనివారం జిల్లా ఎస్పీ డి.జానకి కోర్టు డ్యూటీ అధికారులు, కోర్టు లైజన్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లాలోని కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసులు, విచారణల పురోగతి, నేర నిరూపణకు తీసుకోవాల్సిన చర్యలు, పోలీస్ అధికారులు మరియు ప్రాసిక్యూషన్ మధ్య సమన్వయం తదితర అంశాలపై సమగ్రంగా సమీక్షించారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, ప్రతి కేసులో నేర నిరూపణకు అవసరమైన పటిష్టమైన సాక్ష్యాధారాలను సేకరించి, వాటిని కోర్టులో సమర్థవంతంగా ప్రవేశపెట్టేలా కోర్టు డ్యూటీ అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. కేసుల విచారణలో ఎలాంటి జాప్యం జరగకుండా, కోర్టు విధించిన గడువులు, ఆదేశాలను తప్పనిసరిగా పాటిస్తూ విధులు నిర్వహించాలని తెలిపారు.

పెండింగ్ కేసుల పరిష్కారానికి ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ, ప్రతి కేసు ప్రస్తుత స్థితి, తదుపరి విచారణ తేదీ, సాక్షుల హాజరు, సమన్లు, వారెంట్ల అమలు తదితర అంశాలను నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. కోర్టుకు హాజరుకావాల్సిన సాక్షులు, దర్యాప్తు అధికారులు సకాలంలో హాజరయ్యేలా సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు.

ముఖ్యంగా మహిళలు, చిన్నారులపై నేరాలు, పోక్సో కేసులు, తీవ్రమైన నేరాలకు సంబంధించిన కేసుల విచారణలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు.
దర్యాప్తు పూర్తయిన వెంటనే చట్టపరమైన నిబంధనల ప్రకారం చార్జిషీట్లు దాఖలు చేయడంతో పాటు, కోర్టు విచారణకు అవసరమైన ఆధారాలు, పత్రాలు సిద్ధంగా ఉంచుకోవాలని పేర్కొన్నారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్లతో నిరంతరం సమన్వయం కొనసాగిస్తూ కేసుల విచారణ సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

నేరం చేసిన వారికి చట్టప్రకారం శిక్ష పడేలా ప్రతి కేసులో నాణ్యమైన దర్యాప్తు, పటిష్టమైన సాక్ష్యాధారాల సేకరణ, సమర్థవంతమైన కోర్టు సమన్వయం ఎంతో కీలకమని ఎస్పీ స్పష్టం చేశారు. కోర్టు డ్యూటీ అధికారులు, కోర్టు లైజన్ అధికారులు తమకు కేటాయించిన బాధ్యతలను జవాబుదారీతనంతో నిర్వర్తిస్తూ, కేసుల పురోగతిపై నిరంతరం పర్యవేక్షణ కొనసాగించాలని ఆదేశించారు.

ప్రజలకు సత్వర న్యాయం అందించడంతో పాటు నేరస్తులకు శిక్ష పడేలా పోలీస్ శాఖలోని అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా ఎస్పీ డి.జానకి సూచించారు. ఈ సమావేశంలో డి సి ఆర్ బి డీఎస్పీ రమణ రెడ్డి, కోర్టు డ్యూటీ అధికారులు, కోర్టు లైజన్ అధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు