రైతు ఖాతా నుంచి ధాన్యం అమ్మిన రూ.5 లక్షలు మాయం..!
నిజామాబాద్ జిల్లా ఆలూర్ మండల కేంద్రంలో సైబర్ కేటుగాళ్లు పన్నిన డిజిటల్ వలకు ఓ అమాయక రైతు నిలువునా మోసపోయాడు.

రైతు ఖాతా నుంచి ధాన్యం అమ్మిన రూ.5 లక్షలు మాయం..!
–ఆర్టీఏ ఈ-ఛలాన్ పేరుతో రైతుకు రూ. 5.10 లక్షల మోసం
ఆర్మూర్ – చిరంజీవి, మన సాక్షి
నిజామాబాద్ జిల్లా ఆలూర్ మండల కేంద్రంలో సైబర్ కేటుగాళ్లు పన్నిన డిజిటల్ వలకు ఓ అమాయక రైతు నిలువునా మోసపోయాడు. కష్టపడి పండించి, మొన్ననే మార్కెట్లో వడ్లు అమ్మగా వచ్చిన రూ. 5,10,000 నగదును క్షణాల వ్యవధిలో కోల్పోయి రోడ్డున పడ్డాడు.
కళ్లముందే బ్యాంకు ఖాతా ఖాళీ కావడంతో ఆ రైతు గుండెలు పగిలేలా రోదించాడు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. ఇటీవల తన పంట ధాన్యాన్ని విక్రయించగా వచ్చిన రూ. 5,10,000/- నగదు అతని బ్యాంకు ఖాతాలో జమ అయ్యాయి.
సరిగ్గా అదే సమయంలో అతని సెల్‌ఫోన్‌కు ఆర్టీఏ ఈ-ఛలాన్ పెండింగ్‌లో ఉందంటూ ఓ మెసేజ్ వచ్చింది. ప్రభుత్వ బకాయే కదా అనుకుని ఆ మెసేజ్‌లో ఉన్న లింక్‌ను ఓపెన్ చేయడమే ఆ రైతు చేసిన పెద్ద తప్పయింది. లింక్‌ను టచ్ చేశాడో లేదో.. కేవలం కొన్ని సెకన్ల వ్యవధిలోనే వరుసగా ఐదుసార్లు ఆన్లైన్ లావాదేవీలు జరిగిపోయాయి.
“వడ్లు అమ్మి చేతికి అందివచ్చిన డబ్బులు అప్పటికప్పుడే చూసేలోగా మాయం కావడంతో” రైతు కంగుతిన్నాడు. బ్యాంకు ఖాతాలో రూపాయి కూడా లేకుండా సున్నా చుట్టడంతో లబోదిబోమన్నాడు.
వెంటనే హుటాహుటిన బ్యాంకుకు పరుగులు తీసినా ఎలాంటి ప్రయోజనం దక్కలేదు.
దీంతో దిక్కుతోచని స్థితిలో ఆర్మూర్ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించి బాధితుడు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.గుర్తుతెలియని నంబర్ల నుంచి వచ్చే ట్రాఫిక్ చలాన్లు, ఆర్టీఏ లింక్‌లను ఎట్టి పరిస్థితుల్లోనూ ఓపెన్ చేయవద్దని, ఇలాంటి మోసాల బారిన పడితే ఆలస్యం చేయకుండా వెంటనే 1930 సైబర్ హెల్ప్‌లైన్‌కు కాల్ చేయాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.









