మూసీ రివర్ ఫ్రంట్ పనులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన..!
మూసీ రివర్ ఫ్రంట్ పనులు త్వరలోనే ప్రారంభం కాబోతున్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. మూసీ రివర్ ఫ్రంట్ పరిసరాల్లో నైట్ ఎకానమీని అభివృద్ధి చేయడం ద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు.

మూసీ రివర్ ఫ్రంట్ పనులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన..!
హైదరాబాద్, మన సాక్షి :
మూసీ రివర్ ఫ్రంట్ పనులు త్వరలోనే ప్రారంభం కాబోతున్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. మూసీ రివర్ ఫ్రంట్ పరిసరాల్లో నైట్ ఎకానమీని అభివృద్ధి చేయడం ద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు.
మూసీని అత్యంత సుందరమైన రివర్ ఫ్రంట్‌గా అభివృద్ధి చేయడమే కాకుండా నైట్ ఎకానమీ కార్యకలాపాలను విస్తరించడం ద్వారా రాష్ట్ర ఆర్థిక పురోభివృద్ధికి, తద్వారా దేశ ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతుందని వివరించారు. హైదరాబాద్ నగర గత వైభవాన్ని ముఖ్యమంత్రి వివరిస్తూ ఓల్డ్ సిటీ కాదు… ఒరిజినల్ సిటీని తిరిగి పునరుద్ధరించడం కోసం అడుగులు వేశామని చెప్పారు. దేశ విదేశాల నుంచి సందర్శకులు వచ్చేలా రివర్ ఫ్రంట్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దుతామని చెప్పారు.
భారతదేశ తొలి విద్యా శాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని పురస్కరించుకుని రాష్ట్ర మైనారిటీ శాఖ హైదరాబాద్ బంజారా భవన్లో నిర్వహించిన జాతీయ విద్యా దినోత్సవం, మైనారిటీ సంక్షేమ దినోత్సవంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు.
Also Read : అమెరికాలో నల్గొండ యువతి అదృశ్యం.. ఫోన్లో పరామర్శించిన కేటీఆర్..!
ఈ సందర్భంగా జరిగిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, స్వాతంత్య్రం వచ్చిన తర్వాత పండిత్ నెహ్రూ విద్యకు అత్యంత ప్రాధాన్యతనిచ్చారని గుర్తుచేశారు. విద్యా మంత్రిగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ కాలంలోనే దేశంలో ఐఐటీల స్థాపనకు శ్రీకారం చుట్టబడిందని గుర్తుచేశారు.
మౌలానా అబుల్ కలాం ఆజాద్ హయాంలోనే దేశంలో విద్యా విధానానికి రూపకల్పన చేసి, ప్రముఖ విద్యా సంస్థల స్థాపనకు పునాదులు వేశారని, తద్వారా దేశ కీర్తి ప్రతిష్ఠలను పెంపొందించారని తెలిపారు. మారుతున్న పరిస్థితుల్లో విద్య ఒక్కటే సరిపోదని, ప్రపంచ వ్యాప్తంగా స్కిల్స్ ఉన్నవారికే ప్రాధాన్యత దక్కుతోందని వివరిస్తూ మారుతున్న కాలానికి అనుగుణంగా యువత స్కిల్స్‌ను అందిపుచ్చుకోవాలన్న లక్ష్యంతో ఐటీఐలను ప్రభుత్వం ఏటీసీలుగా తీర్చిదిద్దినట్టు తెలిపారు.
నర్సరీ నుంచి 12వ తరగతి వరకు విద్యకు, ఆ తర్వాత స్కిల్స్ అనంతరం ఆవిష్కరణలకు ప్రాధాన్యతనిచ్చేలా విద్యా రంగంలో సంస్కరణలు చేపట్టామని తెలిపారు. మైనారిటీ యువకుల్లో స్కిల్స్ ఉన్నవారు చాలా మంది ఉన్నారని చెప్పారు. పిల్లలను బాగా చదివించాలని, చదువుల పట్ల మక్కువ లేని వారికి స్కిల్స్ నేర్పించాలని లేదా వారిని క్రీడల్లో ప్రోత్సహించాలని సూచించారు. బ్లూకాలర్ జాబ్స్‌కు పెరుగుతున్న ప్రాధాన్యతను గుర్తించే రాష్ట్రంలో స్కిల్స్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ స్థాపించామని ముఖ్యమంత్రి తెలిపారు.
దేశ జనాభాలో 15 శాతం ఉన్న మైనారిటీ వర్గాలు కూడా ప్రగతి సాధించినప్పుడే దేశం ముందడుగు వేస్తుందని వివరించారు. మైనారిటీల్లో పేదరికం తొలగించాలన్న ఉద్దేశంతో సచార్ కమిటీ సిఫారసులకు అనుగుణంగా 4 శాతం రిజర్వేషన్లు కల్పించినట్టు చెప్పారు.
Also Read : సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల లో ఘోర ప్రమాదం.. భర్త కళ్ళ ఎదుటే భార్య మృతి..!
చదువు విషయంలో ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుంది. నిరుపేదల కోసం హైదరాబాద్‌లో ఒక లక్ష ఇందిరమ్మ ఇండ్లు నిర్మించబోతున్నాం. శాంతి భద్రతలు, అభివృద్ధి, విద్య, ఆరోగ్యం వంటి రంగాలకు ప్రాధాన్యత ఇస్తున్నామని అన్నారు. గౌలిగూడ నుంచి చాంద్రాయణగుట్ట వరకు మెట్రో విస్తరణ పనులు వచ్చే రెండు నెలల్లో ప్రారంభం కానున్నాయని తెలిపారు. మీరాలం ట్యాంక్ మరో ఏడాది కాలంలో అత్యంత సుందరమైన ప్రదేశంగా రూపుదిద్దుకోబోతోందని చెప్పారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు మహమ్మద్ అజారుద్దీన్ , పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి , ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ అలీ షబ్బీర్ , వి హనుమంతరావు , ఎంపీలు వేం నరేందర్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, TGMREIS వైస్ చైర్మన్ & ప్రెసిడెంట్ ఫహీం ఖురేషీ తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, మైనారిటీ నేతలు పాల్గొన్నారు.










