Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsకరీంనగర్జిల్లా వార్తలుతెలంగాణరాజకీయం

కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు.. వారంతా దేశద్రోహులే.!

ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌)ను అడ్డుకునే వారంతా దేశద్రోహులేనని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఘాటుగా వ్యాఖ్యానించారు.

కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు.. వారంతా దేశద్రోహులే.!

విదేశీ అక్రమ చొరబాటుదారులకు ఓట్లు కావాలనుకునే వారు మూర్ఖులే..

కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటే.. బీజేపీని ఎదుర్కొనే దమ్ము లేదు.

బీజేపీ అంటే సీఎం రేవంత్ రెడ్డికి భయం.

తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఖాయం..

సిక్కు సమాజాన్ని పాలకులు నిర్లక్ష్యం చేస్తున్నారు..

బీజేపీ అధికారంలోకి వస్తే సిక్కు సమాజాన్ని ఆదుకుంటాం..

రేపు కరీంనగర్‌లో నితిన్ నబిన్ మహా పాదయాత్ర..

గురుద్వార్‌లో ఎంపీ లాడ్స్ నిధులతో ఏర్పాటు చేసిన సోలార్ ప్యానెల్ ప్రారంభం

(కరీంనగర్ బ్యూరో, మనసాక్షి – నరేష్)

ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌)ను అడ్డుకునే వారంతా దేశద్రోహులేనని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఘాటుగా వ్యాఖ్యానించారు. విదేశీ అక్రమ చొరబాటుదారులకు ఓటు హక్కు కల్పించాలని కోరుకునే వారంతా తన దృష్టిలో మూర్ఖులేనన్నారు. భారతదేశంలో ప్రధాని, ముఖ్యమంత్రి మొదలుకొని సర్పంచ్, ఎంపీ, ఎమ్మెల్యే తదితర ప్రజాప్రతినిధులను ఎన్నుకునే అధికారం భారతీయ పౌరులకు మాత్రమే ఉందని స్పష్టం చేశారు. ఆదివారం కరీంనగర్‌లోని గురుద్వార్‌లో ఎంపీ లాడ్స్ నిధులతో ఏర్పాటు చేసిన సోలార్ ప్యానెల్‌ను ప్రారంభించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

గురుద్వార్‌కు గతంలో ప్రతి నెలా సుమారు రూ.25 వేల విద్యుత్ బిల్లు వచ్చేదని, ఆ భారాన్ని తగ్గించాలన్న గురుద్వార్ ప్రతినిధుల విజ్ఞప్తి మేరకు ఎంపీ లాడ్స్ నిధులతో సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గురుద్వార్‌కు సేవ చేయడం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు. గతంలోనూ పలు విధాలుగా సహకరించినట్లు పేర్కొన్నారు.

సిక్కుల త్యాగాలు చిరస్మరణీయం..

సిక్కు సమాజం కష్టపడి పనిచేసే, దైవభక్తి కలిగిన సమాజమని బండి సంజయ్ కొనియాడారు. గురునానక్, గురుగోవింద్ సింగ్ బోధించిన మార్గంలో నడుస్తూ సమాజానికి సేవ చేసే తత్వం వారిలో ఉందన్నారు. గురునానక్ బోధించిన కీరత్ కరో, నామ్ జపో, వండ్ చకో అనే మూడు సూత్రాలు ప్రతి ఒక్కరూ ఆచరిస్తే సమాజంలో ఆకలి, అసమానతలు, విద్వేషాలకు తావుండదని అభిప్రాయపడ్డారు. గురునానక్ జయంతి సందర్భంగా సిక్కు సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు.

భారత స్వాతంత్ర్య పోరాటంలో సిక్కుల పాత్ర చిరస్మరణీయమని, దేశ సరిహద్దుల్లో సిక్కు సైనికులు అందిస్తున్న సేవలు వెలకట్టలేనివని పేర్కొన్నారు. దేశం కోసం సిక్కులు చేసిన త్యాగాలను భారతదేశం ఎప్పటికీ మరువకూడదన్నారు. వారి చరిత్రలో ధైర్యం, త్యాగం, దేశభక్తి, మానవత్వం కనిపిస్తాయని వ్యాఖ్యానించారు.

సిక్కు సమాజాన్ని పాలకులు నిర్లక్ష్యం చేస్తున్నారు..

తెలంగాణలో సిక్కు సమాజం ఇళ్లు, ఉపాధి అవకాశాలు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటోందని బండి సంజయ్ అన్నారు. పిల్లలకు విద్య అందించలేని పరిస్థితుల్లో కొందరు ఉన్నారని, అటువంటి సమాజాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత పాలకులపై ఉందన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే సిక్కు సమాజానికి అన్ని విధాలా అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. పంజాబ్‌లో సిక్కు యువతను డ్రగ్స్ బారిన పడేలా చేసి సమాజాన్ని దెబ్బతీసేందుకు పాకిస్థాన్ కుట్రలు చేస్తోందని ఆరోపించారు. యువత మత్తు పదార్థాలకు బానిస కాకుండా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ చేపడుతున్న నషా ముక్త్ భారత్ కార్యక్రమానికి అందరూ మద్దతివ్వాలని కోరారు.

కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటే.. బీజేపీ అంటే భయం

కాంగ్రెస్, బీజేపీ మధ్య పోటీ లేదని, బీఆర్ఎస్‌తోనే పోటీ అంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బండి సంజయ్ స్పందించారు. బీజేపీ అంటే సీఎం రేవంత్ రెడ్డి భయపడుతున్నారని, బీజేపీని ఎదుర్కొనే సత్తా కాంగ్రెస్‌కు లేదని విమర్శించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఒక్కటేనని, బీజేపీని అడ్డుకునేందుకు ఆ రెండు పార్టీలు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. తెలంగాణ అభివృద్ధి, కేంద్ర నిధుల సాధన బీజేపీతోనే సాధ్యమని ప్రజలు గుర్తించారని పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ విజయం సాధిస్తుందని, డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పడటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

కరీంనగర్‌లో నితిన్ నబిన్ మహా పాదయాత్ర..

ఎస్‌ఐఆర్‌కు మద్దతుగా దేశవ్యాప్తంగా 40 ప్రాంతాల్లో బీజేపీ మహా పాదయాత్రలు నిర్వహిస్తోందని బండి సంజయ్ తెలిపారు. తెలంగాణలో హైదరాబాద్, కరీంనగర్‌లలో ఈ కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించిన మహా పాదయాత్రకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరయ్యారని గుర్తు చేశారు. ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ కరీంనగర్‌కు రానున్నారని, ఆయన పాల్గొనే మహా పాదయాత్ర చరిత్ర సృష్టించేలా నిర్వహిస్తామని అన్నారు.

భారీ సంఖ్యలో ప్రజలు, కార్యకర్తలు, నాయకులు, వివిధ సంఘాల ప్రతినిధులు పాల్గొని ఎస్‌ఐఆర్‌కు మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు. ఈ యాత్రలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచంద్రరావు, రాష్ట్ర ఇన్‌ఛార్జి సునీల్ బన్సల్, సహ ఇన్‌ఛార్జీలు అభయ్ పాటిల్, రేఖా శర్మ తదితరులు పాల్గొంటారని తెలిపారు. కరీంనగర్ గాంధీ విగ్రహం నుంచి వైశ్య భవన్, రాజీవ్ చౌక్, టవర్ సర్కిల్, శాస్త్రీ రోడ్ మీదుగా కమాన్ చౌరస్తా వరకు మహా పాదయాత్ర సాగుతుందని వెల్లడించారు.

అర్హుల ఓట్ల పరిరక్షణే ఎస్‌ఐఆర్ లక్ష్యం..

18 ఏళ్లు నిండిన వారికి ఓటు హక్కు కల్పించడం, ఒక వ్యక్తికి రెండు ఓట్లు ఉంటే అదనపు ఓటును తొలగించడం, మరణించిన వారి ఓట్లను జాబితా నుంచి తొలగించడం, విదేశాల నుంచి అక్రమంగా వచ్చి ఓటు హక్కు పొందిన వారిని గుర్తించడం ఎస్‌ఐఆర్ లక్ష్యాలని బండి సంజయ్ పేర్కొన్నారు. దొంగ ఓట్లను తొలగించి అర్హులైన భారతీయులకు ఓటు హక్కు కల్పించడమే ఈ ప్రక్రియ ఉద్దేశమన్నారు. ఈ కార్యక్రమానికి మద్దతుగా నిర్వహిస్తున్న మహా పాదయాత్రలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు.

మరిన్ని వార్తలు