కరీంనగర్ గడ్డపై కాషాయ ప్రభంజనం.. మహా పాదయాత్రకు భారీ జన స్పందన..!
కరీంనగర్ గడ్డపై ‘జై శ్రీరాం’ నినాదాలు మార్మోగాయి. కాషాయ జెండాలు రెపరెపలాడాయి. డప్పు చప్పుళ్లు, ఆటపాటలు, నినాదాలతో నగరం హోరెత్తింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ ముఖ్య అతిథిగా పాల్గొన్న మహా పాదయాత్రకు భారీ స్పందన లభించిందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

కరీంనగర్ గడ్డపై కాషాయ ప్రభంజనం.. మహా పాదయాత్రకు భారీ జన స్పందన..!
లక్ష మందికిపైగా తరలివచ్చారన్న బీజేపీ.. ‘జై శ్రీరాం’ నినాదాలతో హోరెత్తిన కరీంనగర్
నితిన్ నబిన్, బండి సంజయ్ ప్రసంగాలతో కార్యకర్తల్లో ఉత్సాహం
గాంధీ చౌక్ నుంచి కమాన్ వరకు జన సందోహం.. అడుగడుగునా పూల వర్షం
‘వారు అరాచకత్వాన్ని నమ్ముకున్నారు.. మేం ప్రజాస్వామ్యాన్ని నమ్ముకున్నాం’
కాంగ్రెస్, బీఆర్ఎస్లను రాజకీయంగా ఎదుర్కొంటామని బీజేపీ నేతల వ్యాఖ్యలు
2028, 2029లో తెలంగాణలో బీజేపీకి ప్రజల ఆశీర్వాదం లభిస్తుందని నేతల ధీమా
(కరీంనగర్ బ్యూరో – నరేష్)
కరీంనగర్ గడ్డపై ‘జై శ్రీరాం’ నినాదాలు మార్మోగాయి. కాషాయ జెండాలు రెపరెపలాడాయి. డప్పు చప్పుళ్లు, ఆటపాటలు, నినాదాలతో నగరం హోరెత్తింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ ముఖ్య అతిథిగా పాల్గొన్న మహా పాదయాత్రకు భారీ స్పందన లభించిందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. లక్ష మందికిపైగా తరలివచ్చినట్లు బీజేపీ నాయకులు పేర్కొనగా.. నగర ప్రధాన వీధుల్లో జనసందోహం కనిపించింది. కరీంనగర్ గాంధీ చౌక్ నుంచి వైశ్యా భవన్, రాజీవ్ చౌక్, టవర్ సర్కిల్, శాస్త్రీరోడ్ మీదుగా కమాన్ చౌరస్తా వరకు మహా పాదయాత్ర సాగింది.
దారి పొడవునా ప్రజలు, బీజేపీ కార్యకర్తలు భారీగా తరలివచ్చి జై శ్రీరాం, జై మోదీ, జై నితిన్ నబిన్, జై బండి సంజయ్ అంటూ నినాదాలతో ఉత్సాహాన్ని నింపారు. ఇసుకేస్తే రాలనంత జనసందోహం కనిపించిందని పార్టీ వర్గాలు తెలిపాయి. నితిన్ నబిన్ ప్రజలతో కలిసి అడుగులో అడుగు వేస్తూ సుమారు 1 గంట 45 నిమిషాల పాటు దాదాపు రెండు కిలోమీటర్ల మేర నడిచారు. ఆయనకు అడుగడుగునా కార్యకర్తలు, అభిమానులు పూల వర్షం కురిపించారు.
ఇళ్లపై, భవనాలపై, వ్యాపార సముదాయాలపై నిలబడి ప్రజలు పాదయాత్రను వీక్షించారు. డప్పు చప్పుళ్లు, ఆటపాటలు, నృత్యాలతో యువత సందడి చేయగా.. మహిళలు సైతం పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సాహంగా ముందుకు సాగారు. కొందరు జాతీయ జెండాలు, మరికొందరు కాషాయ జెండాలు చేతబట్టి నినాదాలు చేశారు. దేశవ్యాప్తంగా ‘సర్’కు మద్దతుగా 40 ప్రాంతాల్లో మహా పాదయాత్రలు నిర్వహించాలని బీజేపీ జాతీయ నాయకత్వం నిర్ణయించిన నేపథ్యంలో హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ క్రమంలో కరీంనగర్లో నిర్వహించిన పాదయాత్రకు వచ్చిన స్పందన ఇప్పటివరకు జరిగిన కార్యక్రమాల్లో అత్యంత భారీగా ఉందని పార్టీ నాయకులు, పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. మూడు రోజుల ముందే కార్యక్రమం ఖరారైనప్పటికీ, తక్కువ సమయంలోనే భారీగా జన సమీకరణ జరగడం పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. పాదయాత్రలో ప్రజల స్పందన, కార్యకర్తల జోష్‌ను చూసి నితిన్ నబిన్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి బండి సంజయ్‌ను ఆలింగనం చేసుకోవడం కార్యకర్తల్లో మరింత ఉత్సాహాన్ని కలిగించింది. చివరగా కమాన్ చౌరస్తా వద్ద జాతీయ జెండాను ఎగురవేసి మహా పాదయాత్రను ముగించారు. కార్యక్రమానికి భారీగా తరలివచ్చిన కార్యకర్తలు, ప్రజలకు బండి సంజయ్ ధన్యవాదాలు తెలిపారు.
‘కరీంనగర్ కాషాయ అడ్డా.. ప్రభంజనాన్ని చూసి మనసు పులకరిస్తోంది’
మహా పాదయాత్రలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రసంగిస్తూ.. కరీంనగర్లో కాషాయ దళ ప్రభంజనాన్ని చూసి తన మనసు పులకరిస్తోందన్నారు. “నన్ను కన్న ఈ కరీంనగర్ గడ్డ ఉరకలేస్తోంది. నితిన్ నబిన్ కరీంనగర్ గడ్డపై అడుగు పెట్టిన తర్వాత నా గుండె ఉప్పొంగుతోంది. కరీంనగర్ నా కాషాయ అడ్డా అని తొడగొట్టి సవాల్ విసరాలని ఉంది” అంటూ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపారు. తెలంగాణలో బీజేపీ ఎక్కడ ఉందని ప్రశ్నించే కాంగ్రెస్ నేతలు కరీంనగర్లో కనిపించిన ప్రభంజనాన్ని చూడాలని అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలను రాజకీయంగా ఎదుర్కొనేందుకు కాషాయ దళం సిద్ధంగా ఉందని వ్యాఖ్యానించారు. నమ్మిన సిద్ధాంతం కోసం, భుజంపై ఉన్న కాషాయ జెండా కోసం తెగించి పోరాడతానని పేర్కొన్నారు.
‘నితిన్ నబిన్ కొదమ సింహం’
బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్‌ను బండి సంజయ్ ప్రశంసలతో ముంచెత్తారు. నితిన్ నబిన్ ఆషామాషీ నాయకుడు కాదని, 25 ఏళ్లకే ఎమ్మెల్యేగా ఎన్నికై, ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అనుభవం ఆయనకు ఉందన్నారు. 45 ఏళ్లకే ప్రపంచంలోనే అతిపెద్ద జాతీయ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడం గొప్ప విషయమన్నారు. నితిన్ అంటే నిజాయితీ, నైతికత.. నబిన్ అంటే నూతనత్వం. నిజాయితీతో కష్టపడుతూ, నూతనత్వంతో పార్టీని ముందుకు నడిపిస్తున్న నాయకుడు. ఆయన చూపుల్లో వాడి ఉంది.. పక్కన నిలబడితే వేడి తగులుతోంది. ఒక సామాన్య కార్యకర్త నేడు బీజేపీని నడిపిస్తున్నాడంటే అది మామూలు విషయం కాదు అని అన్నారు.
నితిన్ నబిన్‌కు పాఠశాల రోజుల నుంచే రాజకీయాలపై ఆసక్తి లేదని, ఉన్నత విద్య చదివి మంచి స్థాయిలో ఉండాలని భావించారని తెలిపారు. అయితే ఆర్ఎస్ఎస్ నేర్పిన క్రమశిక్షణ, నిబద్ధత, నిజాయితీ, దేశం కోసం, ధర్మం కోసం అంకితభావం ఆయనను ఈ స్థాయికి తీసుకొచ్చాయని పేర్కొన్నారు. కాషాయ కండువా కప్పుకున్న ప్రతి కార్యకర్త, నాయకుడు ఇదే సంకల్పంతో పనిచేస్తున్నారని అన్నారు.
కార్యకర్తల పోరాటం.. లాఠీ దెబ్బలైనా వెనక్కి తగ్గలేదు
తెలంగాణలో అధికారంలోకి రావాలనే లక్ష్యంతో బీజేపీ కార్యకర్తలు ఏళ్ల తరబడి చేస్తున్న పోరాటం గొప్పదని బండి సంజయ్ అన్నారు. కాషాయ జెండా మోస్తూ కార్యకర్తల భుజాలు కాయలు కాశాయని, ఉద్యమాలు, ఆందోళనల్లో లాఠీ దెబ్బలు తిన్నా వెనక్కి తగ్గలేదని గుర్తు చేశారు. పార్టీ సిద్ధాంతం కోసం కార్యకర్తలు చేస్తున్న కృషి, త్యాగాలను కొనియాడారు.
‘సర్’పై రాహుల్ విమర్శలకు బండి సంజయ్ ఘాటు సమాధానం
ఓటర్ల జాబితా ప్రక్షాళన, ఎస్ఐఆర్ ప్రక్రియపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేస్తున్న విమర్శలను బండి సంజయ్ ప్రస్తావించారు. చనిపోయిన వారి ఓట్లు తొలగిస్తే తప్పేంటి? శాశ్వతంగా వలస వెళ్లిన వారి పేర్లు, డూప్లికేట్ ఓట్లు తొలగిస్తే అభ్యంతరం ఏమిటని ప్రశ్నించారు. 18 ఏళ్లు నిండిన ప్రతి భారతీయుడికి ఓటు హక్కు కల్పించడమే లక్ష్యమని అన్నారు. బంగ్లాదేశ్, పాకిస్తాన్ నుంచి అక్రమంగా వలస వచ్చిన వారి ఓట్లతో గెలవాలని కాంగ్రెస్ భావిస్తోందా? అంటూ విమర్శించారు. విదేశీ అక్రమ వలసదారులు ఓట్లు, రేషన్ కార్డులు పొందుతూ స్థానిక ప్రజల హక్కులకు భంగం కలిగిస్తుంటే చూస్తూ ఊరుకోవాలా? దేశ ప్రధాని, ముఖ్యమంత్రులను నిర్ణయించే అధికారం అక్రమ చొరబాటుదారులకు ఎవరిచ్చారని ప్రశ్నించారు. రాహుల్ గాంధీపై విమర్శలు చేస్తూ.. ‘పప్పూ.. ఇక మీ పప్పులుడకవ్’ అంటూ వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ నాయకత్వాన్ని ప్రస్తావిస్తూ, దేశానికి వ్యతిరేకంగా ఎన్ని కుట్రలు జరిగినా బీజేపీ వెనక్కి తగ్గదని అన్నారు.
డ్రగ్స్ రహిత సమాజం కోసం నషా ముక్త్ భారత్
డ్రగ్స్ బారిన పడుతున్న యువత పరిస్థితిపై ప్రధాని మోదీ ఆవేదన వ్యక్తం చేస్తున్నారని బండి సంజయ్ పేర్కొన్నారు. నషా ముక్త్ భారత్ లక్ష్యంతో డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. యువతను మత్తు పదార్థాల నుంచి దూరంగా ఉంచేందుకు సమాజం బాధ్యత తీసుకోవాలని అన్నారు.
కాంగ్రెస్ హామీలపై ప్రశ్నలు.. బీజేపీకి అవకాశం ఇవ్వాలని పిలుపు
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయలేదని బండి సంజయ్ విమర్శించారు. ప్రజలకు ఏమి చేశారని కాంగ్రెస్‌కు ఓటేయాలని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటిస్తున్న సీట్లు, ఓట్ల అంచనాలను ప్రస్తావిస్తూ విమర్శలు చేశారు. అందరికీ అవకాశం ఇచ్చారని, ఈసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలని ప్రజలకు పిలుపునిచ్చారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలన్న లక్ష్యంతో కార్యకర్తలు కష్టపడి పనిచేయాలని సూచించారు.










