MIRYALAGUDA : అవి చేస్తే.. బిఆర్ఎస్ కు 100 సీట్లు – సిపిఎం మాజీ ఎమ్మెల్యే జూలకంటి
MIRYALAGUDA : అవి చేస్తే బిఆర్ఎస్ కు 100 సీట్లు – సిపిఎం మాజీ ఎమ్మెల్యే జూలకంటి
మిర్యాలగూడ టౌన్, మన సాక్షి:
ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను పూర్తిగా అమలు చేసినప్పుడే బిఆర్ఎస్ పార్టీకి 100 సీట్లు వస్తాయని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి చెప్పారు. శుక్రవారం నల్గొండ జిల్లా మిర్యాలగూడ లోని సిపిఎం కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను మేనిఫెస్టోను వెంటనే అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.
.ఎన్నికల నోటిఫికేషన్ ఇంకా నాలుగు మాసాలు గడువు ఉందని, ఆలోపు ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. అప్పుడే ప్రజలు బిఆర్ఎస్ పార్టీకి వంద సీట్లు గెలిచే అవకాశం ఇస్తారని జోష్యం చెప్పారు.
డబల్ బెడ్ రూమ్ ఇండ్లు, రేషన్ కార్డులు, అరులైన వారికి ఆసరా పింఛన్లు, స్థలం ఉన్న వారికి 5 లక్షల ఆర్థిక సహాయం, లక్ష రుణమాఫీ, పోడు భూములకు పట్టాలు, పంచాయతీ కార్యదర్శుల క్రమబద్దీకరణ, వివో ఏల సమస్యల పరిష్కారం, రైతులకు కార్మికులకు ఇచ్చిన హామీలను అమలుపరచడం చేయాలన్నారు.
ప్రపంచవ్యాప్తంగా కార్మికులు రైతులు వ్యవసాయ కూలీలు మే డే ఉత్సవాలు జరుపుకుంటారని తమ హక్కుల సాధన, సమస్యల పరిష్కారం కోసం 107 సంవత్సరాల క్రితం జరిపిన పోరాటమే మారదర్శంగా నిలిచిందన్నారు. కార్మికుల పోరాట ఫలితమే నేడు మేడే ఉత్సవాలు జరుపుకుంటున్నారని, ప్రపంచవ్యాప్తంగా వేడుకలు జరుపుకోవడం గొప్ప విషయం అన్నారు.
ఈనెల 1 నుంచి 7వ తేదీ వరకు వారం రోజులపాటు మేడే ఉత్సవాలు జరపాలని పిలుపునిచ్చారు. కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం ఆనాడు కార్మికుల పోరాడి సాధించుకున్న హక్కులను కాలరాస్తుందని విమర్శించారు. 12 గంటల పని విధానం, కనీస వేతనం లేకుండా చేయడం, సంఘాలు పెట్టుకోకుండా నిషేధించడం, కార్మికుల సంక్షేమాన్ని ఎత్తివేయడం చేస్తున్నారని విమర్శించారు.
కేంద్ర ప్రభుత్వ అవలంబిస్తున్న కార్మిక ప్రజావ్యతిరేక విధానాలను తిప్పికొట్టేందుకు బలమైన పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. కార్మికులు రైతులు వ్యవసాయ కూలీలు సంఘటితంగా ఉండి పాలకుల విధానాలను అడ్డుకోవాలన్నారు .మే 1న మిర్యాలగూడలో సాయంత్రం నాలుగు గంటలకు భారీ ర్యాలీ నిర్వహిస్తున్నామని తెలిపారు.
స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో బహిరంగ సభ ఉంటుందని తెలిపారు. ఆ రోజున పల్లె పల్లెలో వాడవాడనా మే డే ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని కోరారు.
ఈ సమావేశంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్ మల్లేష్, జిల్లా కమిటీ సభ్యులు వీరేపల్లి వెంకటేశ్వర్లు మూడవత్ రవి నాయక్ డాక్టర్ మల్లు గౌతమ్ రెడ్డి, భవాండ్ల పాండు, వినోద్ నాయక్, పిలుట్ల సైదులు, బాబు నాయక్,వెంకట్ రెడ్డి, రామరావు తదితరులు పాల్గొన్నారు.









