జిఎస్బి పరిశ్రమలో కార్మికుడు మృతి.. గేటు వద్ద ఆందోళన..!
సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలోని బొంతపల్లి పారిశ్రామికవాడలో ఉన్న జీఎస్‌బీ పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికుడు రాజు ప్రసాద్ (58) విధులు నిర్వహిస్తుండగా అస్వస్థతకు గురై మృతి చెందిన ఘటన విషాదాన్ని నింపింది.

జిఎస్బి పరిశ్రమలో కార్మికుడు మృతి.. గేటు వద్ద ఆందోళన..!
పటాన్చెరు, (మనసాక్షి) :
సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలోని బొంతపల్లి పారిశ్రామికవాడలో ఉన్న జీఎస్‌బీ పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికుడు రాజు ప్రసాద్ (58) విధులు నిర్వహిస్తుండగా అస్వస్థతకు గురై మృతి చెందిన ఘటన విషాదాన్ని నింపింది. ఆదివారం విధుల్లో ఉండగానే ఒక్కసారిగా కుప్పకూలడంతో పరిశ్రమ యాజమాన్యం ఆయనను సమీప ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
ఈ ఘటనతో కుటుంబ సభ్యులు పలు అనుమానాలు వ్యక్తపరుస్తున్నారు. దీంతో కార్మికులు, స్థానికులు దిగ్భ్రాంతికి గురయ్యారు. మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించిన అనంతరం యాజమాన్యం ఎలాంటి భరోసా ఇవ్వకుండా వెళ్లిపోయిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు.
పరిశ్రమలోని పని పరిస్థితుల కారణంగానే రాజు ప్రసాద్ మృతి చెందారని పేర్కొంటూ, మృతదేహంతో జీఎస్‌బీ పరిశ్రమ ప్రధాన గేటు ఎదుట ఆందోళన చేపట్టారు. మాజీ ఎంపిటిసి గోవర్ధన్ గౌడ్ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబానికి తగిన పరిహారం, న్యాయం అందించాలని డిమాండ్ చేశారు.
స్థానికులు, కార్మిక సంఘాల ప్రతినిధులు కూడా ఆందోళనకు మద్దతు తెలుపుతూ కార్మికుల భద్రతపై ప్రభుత్వం, సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు.









