District Collector : జిల్లా కలెక్టర్ రైతులకు సూచన.. ఎల్ నినో ఎఫెక్ట్.. ఇలా చేయండి..!
జిల్లాలో రైతులు సంప్రదాయ వరి సాగుకే పరిమితం కాకుండా, మారుతున్న కాలానికి అనుగుణంగా పంటల వైవిధ్యం వైపు మొగ్గు చూపాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ పిలుపునిచ్చారు.

District Collector : జిల్లా కలెక్టర్ రైతులకు సూచన.. ఎల్ నినో ఎఫెక్ట్.. ఇలా చేయండి..!
సూర్యాపేట, మనసాక్షి :
జిల్లాలో రైతులు సంప్రదాయ వరి సాగుకే పరిమితం కాకుండా, మారుతున్న కాలానికి అనుగుణంగా పంటల వైవిధ్యం వైపు మొగ్గు చూపాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ పిలుపునిచ్చారు. బుధవారం కలెక్టరేట్లో వ్యవసాయ, ఉద్యానవన, నాబార్డ్, బ్యాంకింగ్, పరిశ్రమలు, డీఆర్డీఓ మరియు సహకార శాఖల అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. క్షేత్రస్థాయిలో అమలవుతున్న పథకాలు, రైతులకు అందుతున్న సేవలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ఈ ఏడాది ఎలినినో ప్రభావం ఉండే అవకాశం ఉన్నందున, రైతులు వరికి బదులుగా తక్కువ నీటితో పండే ఆరుతడి పంటలను సాగు చేసేలా ప్రోత్సహించాలని కలెక్టర్ ఆదేశించారు. ఇందుకోసం మండలాల వారీగా ప్రత్యేక యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలన్నారు. విత్తనాలు, ఎరువులను ముందస్తుగానే అందుబాటులో ఉంచాలని, ముఖ్యంగా యూరియా వాడకాన్ని తగ్గించి, ‘నానో యూరియా’ వినియోగంపై రైతులకు అవగాహన కల్పించాలని ఎరువుల కంపెనీలకు సూచించారు.
వ్యవసాయంలో ఆధునిక సాంకేతికతను జోడించాలని కలెక్టర్ పేర్కొన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వాతావరణ సమాచారాన్ని రైతులకు ఎప్పటికప్పుడు చేరవేసేలా ప్లానింగ్ చేయాలన్నారు. అలాగే, పొలాల్లో మిగిలిపోయే వ్యవసాయ వ్యర్థాల ద్వారా బై-ప్రొడక్ట్స్ తయారు చేసి అదనపు ఆదాయం పొందే మార్గాలను రైతులకు వివరించాలన్నారు.
సబ్సిడీ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి :
నీటి నిల్వ సామర్థ్యం పెంచేందుకు డీఆర్డీఓ ఆధ్వర్యంలో ఫామ్ పాండ్స్, పర్కోలేషన్ ట్యాంక్స్, మినీ ట్యాంక్స్, ఓపెన్ వెల్స్ నిర్మాణానికి రైతులను ప్రోత్సహించాలన్నారు. కూరగాయల సాగు చేసే వారికి పందిళ్ల ఏర్పాటుకు సబ్సిడీలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పీఎం కిసాన్, ఫార్మర్ రిజిస్ట్రీ, రైతు బీమా వంటి పథకాల్లో ఏ ఒక్క రైతుకూ అన్యాయం జరగకూడదని కలెక్టర్ స్పష్టం చేశారు.
క్షేత్రస్థాయిలో మట్టి నమూనాల సేకరణ వేగవంతం చేసి, భూసార కార్డుల ప్రాముఖ్యతను రైతులకు వివరించాలన్నారు. రైతులు అధిక దిగుబడులు సాధించేలా వ్యవసాయ అనుబంధ శాఖలు సమన్వయంతో పనిచేసి, సూర్యాపేట జిల్లాను ఆదర్శంగా నిలపాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీధర్ రెడ్డి, డిఆర్డిఓ సన్యాసయ్య, జిల్లాఉద్యాన శాఖ అధికారి తీగల నాగయ్య, పెర్టిలైజర్స్ వ్యవసాయ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు









