Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంతెలంగాణహైదరాబాద్

Hyderabad : మత్తు మాఫియాపై ఉక్కుపాదం.. తీగ లాగితే డొంక కదిలింది.. రూ.1.50 కోట్ల విలువైన హషీష్ ఆయిల్ పట్టివేత..!

యువత భవిష్యత్తును చిదిమేస్తూ, కుటుంబాల్లో కన్నీళ్లు నింపుతున్న మత్తు మహమ్మారిపై ఉక్కుపాదం మోపుతామని, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలకు పాల్పడే వారు ఎంతటి వారైనా ఉపేక్షించే ప్రసక్తే లేదని మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ బి. సుమతి, ఐపీఎస్ స్పష్టం చేశారు.

Hyderabad : మత్తు మాఫియాపై ఉక్కుపాదం.. తీగ లాగితే డొంక కదిలింది.. రూ.1.50 కోట్ల విలువైన హషీష్ ఆయిల్ పట్టివేత..!

అంతర్రాష్ట్ర మత్తు సరఫరా గొలుసును ఛేదించిన మల్కాజిగిరి పోలీసులు

ఆరుగురు అదుపులో — సరఫరాదారు, ప్రధాన రిసీవర్ కోసం గాలింపు

యువత జీవితాలతో వ్యాపారం చేస్తే సహించేది లేదు… మత్తు మాఫియా మూలాలను పెకిలిస్తాం

— మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ బి. సుమతి, ఐపీఎస్

హైదరాబాద్, ఆగస్టు 17, మన సాక్షి :

యువత భవిష్యత్తును చిదిమేస్తూ, కుటుంబాల్లో కన్నీళ్లు నింపుతున్న మత్తు మహమ్మారిపై ఉక్కుపాదం మోపుతామని, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలకు పాల్పడే వారు ఎంతటి వారైనా ఉపేక్షించే ప్రసక్తే లేదని మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ బి. సుమతి, ఐపీఎస్ స్పష్టం చేశారు.

సోమవారం ఉదయం ఎల్‌బీనగర్ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, ఎస్‌ఓటీ ఎల్‌బీనగర్ జోన్, వనస్థలిపురం పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన పక్కా ఆపరేషన్‌లో అంతర్రాష్ట్ర హషీష్ ఆయిల్ సరఫరా గొలుసును ఛేదించి, సుమారు రూ.1.50 కోట్ల విలువైన 12 కిలోల హషీష్ ఆయిల్‌ను స్వాధీనం చేసుకుని ఆరుగురిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. వారి నుంచి ఐదు మొబైల్ ఫోన్లు, రూ.5 వేల నగదును కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లా నుంచి హైదరాబాద్ మీదుగా బెంగళూరుకు భారీ మొత్తంలో హషీష్ ఆయిల్ తరలిస్తున్నట్లు సోమవారం ఉదయం విశ్వసనీయ సమాచారం అందిందని, సమాచారం అందిన వెంటనే ఎస్‌ఓటీ ఎల్‌బీనగర్ జోన్, వనస్థలిపురం పోలీసు బృందాలను అప్రమత్తం చేసి నిఘాను ముమ్మరం చేసినట్లు కమిషనర్ తెలిపారు.

చింతల్‌కుంట–వనస్థలిపురం ప్రాంతంలో పక్కా వ్యూహంతో మాటువేసిన పోలీసు బృందాలు ఆరుగురిని అదుపులోకి తీసుకున్నాయని చెప్పారు. పోలీసుల కళ్లుగప్పేందుకు నిందితులు హషీష్ ఆయిల్‌ను ఒక్కో కిలో చొప్పున ప్యాకెట్లుగా తయారుచేసి బ్రౌన్ అడ్హెసివ్ టేపుతో కాళ్లకు, పొట్ట భాగానికి కట్టుకుని రహస్యంగా తరలిస్తున్నట్లు గుర్తించామని వివరించారు.

నలుగురు క్యారియర్లలో ఒక్కొక్కరు మూడు కిలోల చొప్పున, ఒక్కో కాలికి ఒక్కో కిలో, పొట్ట భాగానికి మరో కిలో కట్టుకుని మొత్తం 12 కిలోల హషీష్ ఆయిల్‌ను బెంగళూరుకు తరలించే ప్రయత్నం చేశారని తెలిపారు. మత్తు మాఫియా పోలీసుల కళ్లుగప్పేందుకు ఎన్ని కొత్త పద్ధతులు అనుసరించినా, ఎన్ని ఎత్తుగడలు వేసినా వారి నిఘా నుంచి తప్పించుకోవడం సాధ్యం కాదని హెచ్చరించారు.

ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న గెమ్మెలి శ్రీను గతంలోనూ గంజాయి, హషీష్ ఆయిల్ అక్రమ రవాణాకు సంబంధించిన కేసుల్లో అరెస్టయినట్లు కమిషనర్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌లోని నర్సీపట్నం, అడవి అన్నవరం పోలీస్ స్టేషన్లలో నమోదైన NDPS కేసుల్లో అతనికి గత నేరచరిత్ర ఉందని తెలిపారు.

జైలు నుంచి విడుదలైన తర్వాత కూడా తన పంథా మార్చుకోకుండా మళ్లీ హషీష్ ఆయిల్ అక్రమ రవాణాలోకి దిగినట్లు దర్యాప్తులో వెల్లడైందన్నారు. తన భార్య నిబియా కె.బి.తో కలిసి ఈ అక్రమ రవాణాను నిర్వహిస్తూ, పరిసర గ్రామాలకు చెందిన నిరుద్యోగ గిరిజన యువకులకు డబ్బు ఆశ చూపి వారిని క్యారియర్లుగా ఉపయోగించుకుంటున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని చెప్పారు.

గతంలోనూ పలుమార్లు హషీష్ ఆయిల్‌ను ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్ మీదుగా బెంగళూరుకు తరలించినట్లు సమాచారం ఉందని, దీనిపై సమగ్ర దర్యాప్తు కొనసాగుతోందన్నారు.

ప్రస్తుత 12 కిలోల హషీష్ ఆయిల్‌ను బెంగళూరుకు చేర్చేందుకు భారీ మొత్తంలో డబ్బు ఆశ చూపినట్లు దర్యాప్తులో వెల్లడైందని బి. సుమతి తెలిపారు. బెంగళూరులో ప్రధాన రిసీవర్‌గా ఉన్న సిజో, ఈ 12 కిలోల హషీష్ ఆయిల్‌ను అక్కడికి చేర్చితే రూ.10 లక్షలు చెల్లించేందుకు ఒప్పందం చేసుకున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందన్నారు.

అందులో భాగంగానే గెమ్మెలి శ్రీను, అతని భార్య నిబియా కె.బి.తో పాటు మరో నలుగురు కలిసి చింతపల్లి ప్రాంతంలో కృష్ణ అనే సరఫరాదారు నుంచి హషీష్ ఆయిల్ తీసుకుని ప్రైవేటు రవాణా ద్వారా అల్లూరి సీతారామరాజు జిల్లా నుంచి హైదరాబాద్ మీదుగా బెంగళూరుకు తీసుకెళ్లేందుకు బయలుదేరినట్లు వివరించారు.

ఆరుగురిని అదుపులోకి తీసుకోవడం, 12 కిలోల హషీష్ ఆయిల్‌ను స్వాధీనం చేసుకోవడంతోనే తమ పని పూర్తయిందని భావించడం లేదని కమిషనర్ స్పష్టం చేశారు. హషీష్ ఆయిల్‌కు మూల సరఫరాదారుగా ఉన్న కృష్ణ, బెంగళూరులో ప్రధాన రిసీవర్‌గా ఉన్న సిజో ప్రస్తుతం పరారీలో ఉన్నారని, వారిని పట్టుకునేందుకు గాలింపు కొనసాగుతోందని తెలిపారు. ఈ మత్తు సరఫరా గొలుసులో ఇంకా ఎవరెవరు ఉన్నారు, మత్తు పదార్థం ఎక్కడి నుంచి వస్తోంది, ఎవరు సరఫరా చేస్తున్నారు, ఎవరు రవాణా చేయిస్తున్నారు, ఎవరికి చేరుతోంది, ఈ అక్రమ వ్యాపారం వెనుక ఇంకా ఎవరెవరి ప్రమేయం ఉందనే ప్రతి కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. క్యారియర్లను పట్టుకోవడంతో సరిపెట్టుకోకుండా సరఫరాదారు నుంచి చివరి రిసీవర్ వరకు మొత్తం నెట్‌వర్క్‌ను గుర్తించి ఛేదించడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.

“మత్తు పదార్థాలను విక్రయించి యువత జీవితాలతో వ్యాపారం చేయాలనుకునే వారికి మల్కాజిగిరి పోలీసుల తరఫున స్పష్టమైన హెచ్చరిక చేస్తున్నాం. డ్రగ్స్ దందా చేసి సులభంగా డబ్బు సంపాదించవచ్చని ఎవరైనా భావిస్తే అది వారి భ్రమ. ఎక్కడ ఉన్నా గుర్తిస్తాం… ఎంత దూరంలో ఉన్నా వెంటాడుతాం… సరఫరా గొలుసు మూలాల వరకు వెళ్తాం… చట్టం ముందు నిలబెడతాం. ఎంత తెలివిగా దాచినా, ఎన్ని మార్గాలు మార్చినా, ఎన్ని రాష్ట్రాల సరిహద్దులు దాటినా పోలీసుల నిఘా నుంచి తప్పించుకోలేరు. యువత భవిష్యత్తును నాశనం చేసే మత్తు వ్యాపారుల విషయంలో రాజీ అనే మాటకు తావులేదు” అని కమిషనర్ బి. సుమతి హెచ్చరించారు.

మాదకద్రవ్యాల అక్రమ వ్యాపారాన్ని కేవలం ఒక నేరంగా మాత్రమే చూడలేమని, అది సమాజ భవిష్యత్తుపై జరుగుతున్న దాడిగా భావించాల్సిన అవసరం ఉందని ఆమె పేర్కొన్నారు. మత్తు పదార్థాల ద్వారా సంపాదించే ప్రతి అక్రమ రూపాయి వెనుక ఏదో ఒక కుటుంబం కన్నీరు ఉంటుందని, ఒక యువకుడు మత్తుకు బానిసైతే అతనితో పాటు తల్లిదండ్రులు, కుటుంబం మొత్తం తీవ్రమైన క్షోభను అనుభవించాల్సి వస్తుందని అన్నారు.

యువతను మత్తుకు బానిసలుగా మార్చి వారి బలహీనతను వ్యాపారంగా మార్చుకునే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని, మత్తు పదార్థాల సరఫరా వ్యవస్థను మూలాల నుంచి విచ్ఛిన్నం చేసేందుకు నిరంతర నిఘా కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

డ్రగ్స్ మహమ్మారిని అరికట్టడం పోలీసుల బాధ్యత మాత్రమే కాదని, తల్లిదండ్రులు, విద్యాసంస్థలు, యువత, ప్రజలు పోలీసులతో కలిసి నడవాలని కమిషనర్ పిలుపునిచ్చారు. తమ పరిసరాల్లో మాదకద్రవ్యాల విక్రయం, రవాణా, వినియోగానికి సంబంధించిన అనుమానాస్పద కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. మత్తు పదార్థాల సరఫరా గొలుసులను ఛేదించడం, డ్రగ్ పెడ్లర్లు, వినియోగదారులను గుర్తించడం, యువతలో మాదకద్రవ్యాల దుష్పరిణామాలపై అవగాహన కల్పించడం మల్కాజిగిరి పోలీసుల అత్యున్నత ప్రాధాన్యతగా కొనసాగుతుందని చెప్పారు.

ఈ కేసులో మొత్తం 12 కిలోల హషీష్ ఆయిల్, ఐదు మొబైల్ ఫోన్లు, రూ.5 వేల నగదు స్వాధీనం చేసుకున్నామని, పట్టుబడిన హషీష్ ఆయిల్ మార్కెట్ విలువ సుమారు రూ.1.50 కోట్లు ఉంటుందని కమిషనర్ తెలిపారు. వనస్థలిపురం పోలీస్ స్టేషన్‌లో Cr.No.1537/2026 కింద NDPS Actలోని సంబంధిత సెక్షన్ల మేరకు కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు.

ఈ అంతర్రాష్ట్ర మత్తు సరఫరా గొలుసును ఛేదించడంలో సమర్థంగా వ్యవహరించిన డీసీపీ ఎల్‌బీనగర్ జోన్ బి. అనురాధ, ఐపీఎస్, డీసీపీ–ఎస్‌ఓటీ కె. మనోహర్, అదనపు డీసీపీ–ఎస్‌ఓటీ ఎండీ షాకీర్ హుస్సేన్, వనస్థలిపురం ఏసీపీ పి. కాశిరెడ్డి, వనస్థలిపురం ఇన్‌స్పెక్టర్ ఎస్. రవిబాబు, ఎస్‌ఓటీ ఎల్‌బీనగర్ జోన్ ఇన్‌స్పెక్టర్ కె. ప్రతాప్ రెడ్డి, ఎస్‌ఓటీ బృందం, వనస్థలిపురం పోలీసు సిబ్బందిని కమిషనర్ ప్రత్యేకంగా అభినందించారు.

“మత్తు రహిత సమాజమే మా లక్ష్యమని, మత్తు మాఫియా ఎంతటి బలమైనదైనా చట్టం కంటే బలమైనది కాదని, యువత జీవితాలను కబళించే డ్రగ్స్‌పై మల్కాజిగిరి పోలీసుల పోరాటం ఆగదని మత్తు సరఫరా గొలుసులను మూలాల నుంచి ఛేదిస్తామని ఆమె పేర్కొన్నారు.

మత్తు వ్యాపారులకు మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో చోటు లేకుండా చేస్తాంమని” పోలీస్ కమిషనర్ బి. సుమతి స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు