కారు ఢీకొని వ్యక్తి మృతి.. మృతదేహంతో కుటుంబ సభ్యుల ఆందోళన..!
రామడుగు మండలం కొరటపల్లి గ్రామానికి చెందిన నెల్లి తిరుపతి (35) అనే వ్యక్తి బుధవారం రోడ్డు ప్రమాదంలో గాయపడి, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించడంతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

కారు ఢీకొని వ్యక్తి మృతి.. మృతదేహంతో కుటుంబ సభ్యుల ఆందోళన..!
కరీంనగర్, మనసాక్షి :
రామడుగు మండలం కొరటపల్లి గ్రామానికి చెందిన నెల్లి తిరుపతి (35) అనే వ్యక్తి బుధవారం రోడ్డు ప్రమాదంలో గాయపడి, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించడంతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నెల్లి తిరుపతి తన కుమారుడిని పాఠశాల నుంచి తీసుకుని వచ్చేందుకు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న క్రమంలో శానగర్ చౌరస్తా వద్ద ఈ ప్రమాదం జరిగింది.
కొరటపల్లి సర్పంచ్ భర్త మేకల ప్రభాకర్ యాదవ్ తన కారుతో ఎదురుగా వచ్చి తిరుపతి బైక్‌ను బలంగా ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన తిరుపతిని స్థానికులు 108 అంబులెన్స్ సహాయంతో కరీంనగర్‌లోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ మూడు రోజులుగా చికిత్స పొందుతూ ఆదివారం నాడు తిరుపతి ప్రాణాలు విడిచారు. తిరుపతి మరణంతో ఆగ్రహించిన కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ఆయన మృతదేహంతో కొరటపల్లి గ్రామపంచాయతీ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు.
తిరుపతి మృతికి కారణమైన సర్పంచ్ భర్త మేకల ప్రభాకర్ యాదవ్‌పై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని మరియు బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని, నిరసనకారులను శాంతింపజేస్తూ పరిస్థితిని అదుపు చేస్తున్నారు.









