Nalgonda : నల్గొండ జిల్లా ఎస్పీ కీలక ఆదేశాలు.. పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖి..!
పెండింగ్లో ఉన్న కేసులను త్వరితగతిన పూర్తి చేసి బాధితులకు న్యాయం అందించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అధికారులను ఆదేశించారు.

Nalgonda : నల్గొండ జిల్లా ఎస్పీ కీలక ఆదేశాలు.. పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖి..!
మిర్యాలగూడ/వేములపల్లి, మన సాక్షి:
పెండింగ్లో ఉన్న కేసులను త్వరితగతిన పూర్తి చేసి బాధితులకు న్యాయం అందించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడ సబ్ డివిజన్ పరిధిలోని వేములపల్లి పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్లోని వివిధ విభాగాలను పరిశీలించి, రికార్డుల నిర్వహణ, కేసుల దర్యాప్తు పురోగతి, సిబ్బంది పనితీరు తదితర అంశాలను సమగ్రంగా సమీక్షించారు.
తనిఖీలో భాగంగా ఎఫ్ఐఆర్ రిజిస్టర్లు, కేసు డైరీలు, బీట్ బుక్స్, వారెంట్లు, పెండింగ్ కేసులు, కమ్యూనిటీ పోలీసింగ్ రికార్డులను పరిశీలించిన ఎస్పీ, పెండింగ్లో ఉన్న కేసులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల నమోదైన రోడ్డు ప్రమాదాలు, దొంగతనాలు, ఇతర నేరాల వివరాలను సమీక్షించిన ఆయన, వాటి నివారణకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని సూచించారు. జాతీయ, రాష్ట్ర రహదారులపై ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ నియంత్రణ చర్యలు, అవగాహన కార్యక్రమాలు, ప్రమాదకర ప్రాంతాల గుర్తింపు వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు.
గ్రామాలు, ప్రధాన కూడళ్లు, వ్యాపార సముదాయాలు, దేవాలయాలు, ప్రజా రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో సీసీ కెమెరాల ఏర్పాటును మరింత విస్తరించాలని సూచించారు. సీసీ కెమెరాలు నేరాల నియంత్రణతో పాటు నేరస్తులను గుర్తించడంలో కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు.దొంగతనాల నివారణకు రాత్రి వేళల్లో నైట్ బీట్లు, వాహన తనిఖీలు, అనుమానిత వ్యక్తులపై నిఘా చర్యలను మరింత సమర్థవంతంగా నిర్వహించాలని ఆదేశించారు.
గ్రామాల్లో బీట్ అధికారులు ప్రజలతో నిరంతరం మమేకమై స్థానిక సమస్యలను తెలుసుకొని పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. అక్రమ ఇసుక రవాణా, పీడీఎస్ బియ్యం అక్రమ నిల్వలు, పేకాట, గుట్కా విక్రయాలు, ఇతర అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఆదేశించారు. చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు సమాచార సేకరణ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని సూచించారు.
మహిళల భద్రత, సైబర్ నేరాల నివారణ, యువతలో అవగాహన కార్యక్రమాలు, డ్రగ్స్ నిర్మూలన చర్యలు, శాంతిభద్రతల పరిరక్షణ అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఎస్పీ పేర్కొన్నారు. ప్రజలకు సత్వర సేవలు అందించే విధంగా స్టేషన్ సిబ్బంది మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, ప్రతి ఫిర్యాదును బాధ్యతతో స్వీకరించి చట్టపరమైన చర్యలు చేపట్టాలని సూచించారు.పోలీస్ స్టేషన్ పరిసరాల పరిశుభ్రత, సిబ్బంది హాజరు, ఆయుధాల నిర్వహణ, కమ్యూనికేషన్ వ్యవస్థలు, అత్యవసర స్పందన విధానాలను కూడా పరిశీలించి తగిన సూచనలు చేశారు.
ప్రజల సహకారంతోనే నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణ సాధ్యమవుతుందని పేర్కొన్నారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా ఘటనలపై వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు.ఈ తనిఖీ కార్యక్రమంలో ఎస్బీ సీఐ ఆదిరెడ్డి, మిర్యాలగూడ రూరల్ సీఐ పి.ఎన్.డి. ప్రసాద్, వేములపల్లి ఎస్ఐ వెంకటేశ్వర్లు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.










