TOP STORIESBreaking Newsతెలంగాణరాజకీయం

రేవంత్ సర్కార్‌ది ప్రజా ప్రభుత్వం కాదు, ప్రజా వ్యతిరేక ప్రభుత్వం..!

రియల్ ఎస్టేట్ వ్యాపారుల ప్రయోజనాల కోసమే రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదల ఇళ్లను దౌర్జన్యంగా కూల్చివేసిందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు నారపురాజు రామచంద్రరావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

రేవంత్ సర్కార్‌ది ప్రజా ప్రభుత్వం కాదు, ప్రజా వ్యతిరేక ప్రభుత్వం..!

కోర్టు ఆదేశాలు బేఖాతరు.. 4000 మంది పోలీసులతో పేదల గుడిసెలపై దౌర్జన్యం.

మీడియా సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు ధ్వజం.

ఖమ్మం, మన సాక్షి:-

రియల్ ఎస్టేట్ వ్యాపారుల ప్రయోజనాల కోసమే రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదల ఇళ్లను దౌర్జన్యంగా కూల్చివేసిందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు నారపురాజు రామచంద్రరావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆదివారం ఖమ్మం జిల్లా పర్యటనలో భాగంగా వెలుగుమట్ల ప్రాంతంలో ఆశ్రయం కోల్పోయిన భూదాన బాధితులను ఆయన పరామర్శించారు. న్యాయస్థానం ఆదేశాలను ఖాతరు చేయకుండా తెల్లవారుజామున భారీ బలగాలతో చిన్నారులు, వృద్ధులు అని చూడకుండా పేదలను వీధిన పడేయడం దారుణమని మండిపడ్డారు.

బాధితులందరికీ అక్కడే నివాస స్థలాలు కేటాయించి పక్కా గృహాలు నిర్మించి ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బాధితులు తమ గోడును రామచంద్రరావు ముందు వెళ్లబోసుకున్నారు. గత వారం రోజుల నుంచి ఖమ్మంలో భూదాన యజ్ఞ సంస్థ నిర్వాసితుల ఆక్రందన యావత్తు తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా ప్రతిధ్వనిస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఖమ్మం వెలుగుమట్ల ప్రాంతంలోని భూ కొలత సంఖ్య నూట నలభై ఏడు, నూట నలభై ఎనిమిది, నూట నలభై తొమ్మిది భూముల్లో గత పదిహేను సంవత్సరాలుగా దాదాపు ఆరు వందల పేద కుటుంబాలు నివాసం ఉంటున్నాయి.

పద్దెనిమిది వందల మందికి పైగా నిరుపేదలు కూలి పనులు చేసుకుంటూ పైసా పైసా కూడబెట్టుకుని వంద గజాల చొప్పున స్థలాన్ని ఏర్పాటు చేసుకుని చిన్నపాటి గుడిసెలు నిర్మించుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కనీస కనికరం లేకుండా ఆ ఇళ్లను నేలమట్టం చేసిందని రామచంద్రరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్నత న్యాయస్థానం యథాతథ స్థితి కొనసాగించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఆ ఆదేశాలను ఏమాత్రం ఖాతరు చేయలేదని ఆరోపించారు. ఆ పత్రాలు అసలైనవి కావని కుంటి సాకులు చెబుతూ పేదల ఇళ్లపై భారీ యంత్రాలను ప్రయోగించారని మండిపడ్డారు.

అనంతరం ఖమ్మం నగరంలోని అంబేడ్కర్ భవనంలో తలదాచుకున్న బాధిత కుటుంబాలను భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పరామర్శించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతిలో గునపం పట్టుకుని ఏ ఇల్లు కనిపిస్తే ఆ ఇల్లు కూలగొడుతున్నారని రామచంద్రరావు దుయ్యబట్టారు. ఇది ప్రజల సంక్షేమం కోసం పనిచేసే ప్రభుత్వం ఏమాత్రం కాదని, పూర్తిగా ప్రజా వ్యతిరేక ప్రభుత్వమని ధ్వజమెత్తారు.

ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు , భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కోశాధికారి దేవకి వాసుదేవరావు, జిల్లా ఇంచార్జ్ బద్ద మహిపాల్ రెడ్డి, నాయకులు కొండపల్లి శ్రీధర్ రెడ్డి, ఉప్పర్ల శారద, గల్లా సత్యనారాయణ , శీలం పాపారావు, దొంగల సత్యనారాయణ, మందడపు సుబ్బారావు, గుత్తా వెంకటేశ్వర్లు, వీరవల్లి రాజేష్, బండారు నరేష్, నున్న రవికుమార్, విజయరాజు, దొడ్డ అరుణ, రజినీ రెడ్డి, కుమిలి శ్రీనివాస్, రవి రాథోడ్, శ్యామ్ రాథోడ్, ఏలూరి నాగేశ్వరరావు, నీరుకొండ ఉషారాణి, పమ్మీ అనిత కందుల శ్రీకృష్ణ, మందా సరస్వతి, శ్రీ రామనేని మనీ , నకిరేకంటి వీరభద్రం, తదితరులు పాల్గొన్నారు.

Our YouTube Channel

Rythu Badii YouTube Channel

మరిన్ని వార్తలు