సాగర్ ఆయకట్టులో జోరుగా వరి కోతలు.. అమాంతం తగ్గిన ధాన్యం ధరలు

MIRYALAGUDA : సాగర్ ఆయకట్టులో జోరుగా వరి కోతలు.. అమాంతం తగ్గిన ధాన్యం ధరలు

మిర్యాలగూడ, మనసాక్షి : నాగార్జునసాగర్ ఎడమ కాలువ ఆయకట్టు పరిధిలో వానాకాలం వరి కోతలు జోరుగా సాగుతున్నాయి. సాగర్ ఎడమ కాలువ ఆయకట్టుకు పూర్తిస్థాయిలో నీటిని విడుదల చేయడం వల్ల వానాకాలం వరి నాట్లు పూర్తిస్థాయిలో వేశారు. కాగా ఇటీవల వరి కోతలు హార్వెస్టర్లతో జోరుగా సాగుతున్నాయి. సాగర్ ఎడమ కాలువ పరిధిలో ఆరు లక్షల ఎకరాల ఆయకట్టు (నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, కృష్ణ జిల్లాల్లో) ఉంది. కాగా నల్గొండ, సూర్యాపేట జిల్లాలో వరి కోతలు కోస్తున్నారు.

అంతా సన్నధాన్యమే :

నల్గొండ, సూర్యాపేట జిల్లాలో ఆయకట్టు పరిధిలో రైతులు అంత సన్నధాన్యమే సాగు చేశారు. ఎక్కువగా పూజలు, హెచ్ఎంటి లు, చింట్లు రకాలకు సంబంధించిన సన్నధాన్యం సాగు చేశారు.

అమాంతం తగ్గిన ధాన్యం ధరలు :

ఆయకట్టులో వరి కోతలు జోరుగా సాగుతుండగా సన్నధాన్యంకు మిల్లర్లు ఒకేసారి ధర తగ్గించారు. వారం రోజుల క్రితం సన్నధాన్యం చింట్లు, పూజలు, హెచ్ఎంటి లకు క్వింటా 2300 రూపాయలకు పైగా ఉండగా ప్రస్తుతం క్వింటా 2000 రూపాయలకే మిల్లర్లు కొనుగోలు చేస్తున్నారు. దాంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. ఆరుగాలం కష్టపడిన పంటను తక్కువ ధరకు విక్రయించుకోవలసి వస్తుందని రైతులు వాపోతున్నారు.