TG News : కంబోడియాలో ఉండి ఇండియాలో డిజిటల్ అరెస్టుల పేరుతో మోసం.. చాకచక్యంగా అరెస్టు చేసిన తెలంగాణ పోలీసులు..!
కంబోడియా లో ఉంటూ ఇండియాలో డిజిటల్ అరెస్టుల పేరుతో మోసం చేస్తున్న వ్యక్తిని తెలంగాణ పోలీసులు అతి చాకచక్యంగా వ్యవహరించి అరెస్టు చేశారు. అతడి నుంచి 12 లక్షల రూపాయలను రికవరీ చేశారు.

TG News : కంబోడియాలో ఉండి ఇండియాలో డిజిటల్ అరెస్టుల పేరుతో మోసం.. చాకచక్యంగా అరెస్టు చేసిన తెలంగాణ పోలీసులు..!
శేరిలింగంపల్లి, మన సాక్షి:
డిజిటల్ అరెస్ట్ పేరుతో సామాన్యులను, ముఖ్యంగా వృద్ధులను భయభ్రాంతులకు గురిచేసి లక్షలాది రూపాయలు కాజేస్తున్న అంతర్జాతీయ సైబర్ ముఠా గుట్టును సైబరాబాద్ పోలీసులు రట్టు చేశారు. కేసుకు సంబంధించిన వివరాలను సైబరాబాద్ సైబర్ క్రైమ్ డీసీపీ సాయి మనోహర్ మీడియా సమావేశంలో వెల్లడించారు..
బాలానగర్‌కు చెందిన సదానందం అనే వృద్ధుడికి నిందితుడు గజర్ల అవినాష్ ఫిబ్రవరిలో ఫోన్ చేశాడు. బాధితుడి మొబైల్ నంబర్‌పై 17 కేసులు ఉన్నాయని, విచారణ నిమిత్తం ఆయన్ని ‘డిజిటల్ అరెస్ట్’ చేస్తున్నామని భయపెట్టాడు. సీనియర్ సిటిజన్ కావడంతో ఇంట్లోనే ఉంచి వీడియో కాల్ ద్వారా విచారణ జరుపుతామని నమ్మబలికారు. ఇలా దాదాపు 15 రోజుల పాటు నిరంతరం పర్యవేక్షణలో ఉంచుతూ, బాధితుడి నుంచి రూ. 42 లక్షలను నాలుగు వేర్వేరు అకౌంట్లలోకి బదిలీ చేయించుకున్నారు.
నిందితుడు అవినాష్ తొలుత డేటా ఎంట్రీ ఉద్యోగం కోసం కంబోడియా వెళ్లాడు. అక్కడ భారతీయులను లక్ష్యంగా చేసుకుని మోసాలు చేసే ముఠాలో చేరి మెళకువలు నేర్చుకున్నాడు. ఆపై స్వయంగా తనే కంబోడియా నుంచి ఏపీ, తెలంగాణలోని మ్యూల్ అకౌంట్లను వాడుకుంటూ నేరాలకు పాల్పడటం మొదలు పెట్టాడు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా గతంలోనే నలుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు, వారిచ్చిన సమాచారంతో మార్చిలో ఇండియాకు వచ్చిన అవినాష్‌ను చాకచక్యంగా పట్టుకున్నారు.
డిజిటల్ అరెస్ట్ కేసుల్లో నిందితుడిని పట్టుకోవడమే కాకుండా, అతను కమీషన్ కింద తీసుకున్న 12 లక్షల రూపాయలను సీజ్ చేయడం ఇదే మొదటిసారి అని డీసీపీ తెలిపారు. అవినాష్‌పై మరికొన్ని కేసులు కూడా నమోదైనట్లు పోలీసులు గుర్తించారు.
చట్టంలో డిజిటల్ అరెస్ట్’ అనే పదమే లేదు. ఏ ప్రభుత్వ సంస్థ లేదా పోలీస్ విభాగం వీడియో కాల్‌లో విచారణ జరిపి డబ్బులు అడగదు. ఇలాంటి కాల్స్ వస్తే భయపడకుండా వెంటనే 1930 నంబర్‌కు ఫోన్ చేయండి లేదా సైబర్ క్రైమ్ పోర్టల్‌లో ఫిర్యాదు చేయండి.










