Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsజిల్లా వార్తలురాజకీయంసంగారెడ్డి జిల్లా

TRS : కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు.. నన్ను తెల్లాపూర్ శాసనం దగ్గరే కట్టేసి రాళ్లతో కొట్టండి..!

సంగారెడ్డి జిల్లా కేంద్రంలో తెలంగాణ రక్షణ సేన (టిఆర్ఎస్ )పార్టీ ఆధ్వర్యంలో 'జెండా పండుగ' కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు.

TRS : కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు.. నన్ను తెల్లాపూర్ శాసనం దగ్గరే కట్టేసి రాళ్లతో కొట్టండి..!

మన సాక్షి :

సంగారెడ్డి జిల్లా కేంద్రంలో తెలంగాణ రక్షణ సేన (టిఆర్ఎస్ )పార్టీ ఆధ్వర్యంలో ‘జెండా పండుగ’ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పార్టీ కల్వకుంట్ల కవిత పార్టీ జెండాను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆమె స్థానిక రాజకీయాలు, ఉచిత విద్య, వైద్యం మరియు జిల్లా అభివృద్ధిపై గళమెత్తారు, “సంగారెడ్డి జిల్లాకు ఘనమైన చరిత్ర ఉంది. 1969 నాటి తొలిదశ తెలంగాణ ఉద్యమం ఈ గడ్డపైనే రగిలి, రాష్ట్రవ్యాప్తంగా ఊపందుకుంది. నాటి ఉద్యమ చరిత్రను నేటి తరం యువత తప్పకుండా తెలుసుకోవాలి.

ఒకప్పుడు ‘అసలు తెలంగాణ ఎక్కడుంది?’ అని ప్రశ్నించిన వారికి, తెల్లాపూర్ శాసనమే ఒక బలమైన సాక్ష్యంగా, ఆనవాలుగా నిలిచింది” అని గుర్తుచేశారు.రాష్ట్రంలో ఇప్పటికే ఎన్నో పార్టీలు ఉన్నప్పటికీ, కొత్తగా తెలంగాణ రక్షణ సేన (టిఆర్ఎస్) పార్టీని ఎందుకు స్థాపించాల్సి వచ్చిందో ఆమె స్పష్టం చేశారు. పేద, మధ్యతరగతి ప్రజల శ్రేయస్సు, అభివృద్ధి కోసమే ఈ పార్టీ పుట్టిందని తెలిపారు.

“గడిచిన 30 ఏళ్లుగా రాష్ట్రాన్ని ఏలుతున్న మూడు ప్రధాన పార్టీలు ప్రజలకు కనీస నాణ్యమైన విద్యను అందించడంలో ఘోరంగా విఫలమయ్యాయి. నేడు ప్రభుత్వ ఆసుపత్రుల పరిస్థితి దయనీయంగా మారింది. ప్రమాదవశాత్తు ఎవరైనా ఆసుపత్రికి వెళ్తే.. అక్కడ సూది ఉంటే దూది ఉండదు, దూది ఉంటే సూది ఉండని పరిస్థితి నెలకొంది” అని విమర్శించారు.

“పిల్లలకు ఏం కావాలో ఒక తల్లిగా నాకే బాగా తెలుసు. అందుకే ఈ రాష్ట్ర బిడ్డల భవిష్యత్తు కోసం, ఒక మహిళగా నేను ఈ టిఆర్ఎస్ పార్టీని స్థాపించాను. వచ్చే ఎన్నికల్లో మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉచిత విద్య, ఉచిత వైద్యం అందించడాన్ని ప్రజల హక్కుగా మారుస్తాం. ఒకవేళ అధికారంలోకి వచ్చాక నేను మాట తప్పితే.. నన్ను తెల్లాపూర్ శాసనం దగ్గరే కట్టేసి రాళ్లతో కొట్టండి” అని కవిత భావోద్వేగ పూరితమైన సవాల్ విసిరారు.

సంగారెడ్డి జిల్లాలోని పలువురు కీలక నేతల తీరును ఆమె తీవ్రంగా ఎండగట్టారు. “ఈ ప్రాంతంలో జగ్గారెడ్డి, దామోదర్ రాజనర్సింహ, రఘునందన్ రావు, చింతా ప్రభాకర్ లాంటి ఎంతోమంది నాయకులు ఉన్నా.. ఎవరు ప్రజల కోసం ఏం చేస్తున్నారో తెలియని అయోమయ పరిస్థితి ఉంది.
పక్కనే ఉన్న సింగూర్ ప్రాజెక్టును పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. ప్రస్తుతం సింగూర్ కుంగిపోయి తీవ్ర ప్రమాదంలో పడినా పట్టించుకునే నాథుడే లేడు.

జహీరాబాద్‌కు బుల్లెట్ ట్రైన్ సాధిస్తామన్న రఘునందన్ రావు ఇప్పుడు దానిపై నోరు మెదపడం లేదు.ఆందోల్ పరిధిలో ఒక మంత్రి బావమరిది ఏకంగా 200 ఎకరాల భూమిని కబ్జా పెట్టినా అడిగే దిక్కు లేదు.ఇక పటాన్‌చెరు ఎమ్మెల్యే అసలు ఏ పార్టీలో ఉన్నారో కూడా ప్రజలకు అర్థం కావడం లేదు” అని కవిత ధ్వజమెత్తారు.

మన ప్రాంతాన్ని, మన మట్టిని ప్రేమించే ఒక ప్రాంతీయ పార్టీ ద్వారానే అభివృద్ధి సాధ్యమని ఆమె పునరుద్ఘాటించారు. ‘పాంచజన్యం’ సిద్ధాంతమే పరమావధిగా తెలంగాణ రక్షణ సేన పనిచేస్తుందని, కాబట్టి టిఆర్ఎస్ పార్టీని ప్రజలంతా తమ సొంత ఇంటి పార్టీగా ఆదరించి, బలోపేతం చేయాలని కల్వకుంట్ల కవిత పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు మరియు మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

By : Jaleel, Journalist

మరిన్ని వార్తలు