Narayanpet : ధాన్యం కొనుగోళ్లలో వ్యవసాయాధికారులదే కీలక పాత్ర.. జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్..!
Narayanpet : ధాన్యం కొనుగోళ్లలో వ్యవసాయాధికారులదే కీలక పాత్ర.. జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్..!
నారాయణపేట టౌన్, మనసాక్షి :
వరి ధాన్యం కొనుగోళ్లలో వ్యవసాయ శాఖ అధికారులే కీలక పాత్ర పోషించాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. జిల్లాలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలకు రైతులు ధాన్యం తీసుకువచ్చి విక్రయించేలా ఏఈఓ లు రైతులకు క్షేత్ర స్థాయిలో అవగాహన కల్పించాలని ఆమె తెలిపారు.
మంగళవారం జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో వ్యవసాయ శాఖ ఎవోలు, ఏఈఓ లతో నిర్వహించిన సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడారు. క్లస్టర్ల వారీగా కొనుగోలు కేంద్రాల పరిధి లో ఎన్ని క్వింటాళ్ల ధాన్యం అమ్మకానికి వస్తుందనే సమాచారాన్ని ఏఈఓ లు నమోదు చేసుకుని ఉంచుకోవాలన్నారు.
ప్రభుత్వం సూచించిన సన్న రకం ధాన్యాన్ని ఏఈఓ లు నిర్ధారించి రైతులకు టోకన్లు ఇవ్వాలని ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లో సన్న రకానికి బదులు దొడ్డు రకం ధాన్యo కొనుగోలు జరగకుండా పర్యవేక్షించాలన్నారు. గతేడాది కొనుగోళ్లలో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు.
వాతావరణ పరిస్థితులను బట్టి రైతులకు టోకన్లు ఇవ్వాలని, వర్షానికి ధాన్యం తడిసిపోకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలన్నారు. ప్రభుత్వం జిల్లాకు నిర్దేశించిన లక్ష్యం మేరకు ధాన్యాన్ని కొనుగోలు చేసి రాష్ట్రంలోనే జిల్లాను ముందు వరుసలో ఉంచాలని ఆమె కోరారు.
ఈ సమావేశంలో ట్రైనీ కలెక్టర్ గరీమా నరుల, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జాన్ సుధాకర్, సివిల్ సప్లై డి ఎం దేవదాస్, సహాయ వ్యవసాయ శాఖ అధికారులు, మండల వ్యవసాయ శాఖ అధికారులు, ఏ ఈ ఓ లు పాల్గొన్నారు.
MOST READ :









