Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండరాజకీయం

Union Minister : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి కీలక ప్రకటన.. 80 కోట్ల మంది పేద ప్రజలకు ఉచిత బియ్యం పంపిణీ..!

Union Minister : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి కీలక ప్రకటన.. 80 కోట్ల మంది పేద ప్రజలకు ఉచిత బియ్యం పంపిణీ..!

నల్లగొండ, మన సాక్షి :

ఆహార భద్రతలో భాగంగా దేశంలోని 80 కోట్ల మంది పేద ప్రజలకు ప్రతినెల 5 కిలోల ఉచిత బియ్యాన్ని ఇస్తున్నట్లు కేంద్ర ఆహార, పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాలు, ప్రజా పంపిణీ శాఖల మంత్రి ప్రహ్లాద్ జోషి చెప్పారు. గురువారం అయన నల్గొండ జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన భారత ఆహార సంస్థ డివిజనల్ కార్యాలయాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన సమావేశంలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ కోవిడ్ మహా విపత్తులో ఏ ఒక్కరూ ఆకలితో చనిపోకూడదన్న ఉద్దేశంతో ఆహార భద్రత కింద పేదలందరికి 5 కిలోల చొప్పున 80 కోట్ల మందికి ఉచిత బియ్యం ఇస్తున్నామని, ఇది 2030 వరకు ఇది కొనసాగించాలని దేశ ప్రధాని నరేంద్ర మోడీ నిర్ణయించినట్లు తెలిపారు.

ప్రపంచంలో ఏ దేశంలో ఇంత పెద్ద మొత్తంలో పేదలకు ప్రతినెల 5 కిలోల బియ్యం ఇవ్వటం లేదని అన్నారు. ఆస్ట్రేలియా, జర్మనీ యూరోపియన్ దేశాలలో సైతం ఇలాంటి పద్ధతి లేదని, భారత ప్రజా పంపిణీ వ్యవస్థను చూసి ఇతర దేశాలు ఆశ్చర్యపోతున్నాయని, ప్రపంచంలోనే భారత ఆహార భద్రత పథకం మోడల్ గా తీసుకురావడం జరిగిందని ఆయన వెల్లడించారు.

ప్రపంచ బ్యాంకు సైతం ఇటీవల నివేదికలో భారత దేశంలో అత్యంత ఎక్కువ మందికి ఆహార భద్రత కింద ఉచిత ఆహారం పంపిణీ చేస్తున్న విషయాన్ని పేర్కొన్నట్లు వెల్లడించారు. ధాన్యం సేకరణ పై కేంద్ర మంత్రి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా వ్యాప్తంగా రెండు కోట్ల 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరిస్తున్నామని, ప్రస్తుతం 915 లక్షల మెట్రిక్ టన్నుల నిలువ సామర్థ్యం దేశంలో ఉందని, తెలంగాణతో కలిపి 2023- 24 సంవత్సరంలో 2.25 లక్షల కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం నేరుగా రైతుల ఖాతాలలో జమ చేసిందని తెలిపారు.

ప్రతినెల తెలంగాణకు 1.11 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలను కేటాయిస్తున్నామని, 1 లక్ష మెట్రిక్ టన్నుల బియ్యం, 3370 మెట్రిక్ టన్నుల గోధుమలను కేటాయిస్తున్నట్లు తెలిపారు. ఆహార భద్రత వ్యవస్థను పటిష్టం చేసేందుకు రేషన్ కార్డులన్నిటిని డిజిటలైట్ చేయడం జరిగిందని తెలిపారు.

నల్గొండ జిల్లా ధాన్యం ఉత్పత్తి, ధాన్యం సేకరణలో తెలంగాణ రాష్ట్రంలోనే ప్రముఖ పాత్ర పోషిస్తున్నదని, ప్రస్తుతం నూతనంగా ప్రారంభించిన ఎఫ్ సి ఐ డివిజనల్ కార్యాలయ ఆవరణలో ఉన్న గోదాంలో 62 వేల మెట్రిక్ టన్నుల నిలువ సామర్థ్యం ఉందని, ప్రభుత్వం భూమి ఇస్తే మరో ఎఫ్సిఐ గోదామును నల్గొండ జిల్లాలో ప్రారంభించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు.

2014 -15 నుండి తెలంగాణలో ధాన్యం సేకరణను 600% పెంచినట్లు చెప్పారు . ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నీ ద్రవ్యవల్బణంతో బాధపడుతున్నాయని, ఇండియాలో కేవలం .25 శాతం మాత్రమే ఉందని, పి యం సూర్య ఘర్ ముక్త్ బిజిలి పథకం కింద 20175 ఇండ్లకు 20 వేల కోట్లరాయితీ తో పథకాన్ని అమలు చేయడం జరిగిందని తెలిపారు.

రైతులు వరి వైపే కాకుండా ఆయిల్ సీడ్స్ ,వాణిజ్య పంటలు పండించాలని కోరారు . కోవిడ్ సమయంలో ప్రజా పంపిణీ వ్యవస్థకు సంబంధించి తెలంగాణకు రావాల్సిన సబ్సిడీ 343 కోట్ల రూపాయల బకాయిలను వెంటనే విడుదల చేస్తామని చెప్పారు.

అలాగే సిఎంఆర్ డెలివరీకి సంబంధించి 10 సంవత్సరాల నుండి పెండింగ్లో ఉన్న 1400 కోట్ల రూపాయల మంజూరుకు సరైన రికార్డులు సమర్పిస్తే పరిశీలించి వాటిని కూడా మంజూరు చేస్తామని తెలిపారు.

రాష్ట్ర పౌరసరఫరాలు, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రానికి 2024- 25 సంవత్సరానికి సంబంధించి బాయిల్డ్ రైస్ లక్ష్యాన్ని పెంచాలని, పదేళ్ల నుండి పెండింగ్లో ఉన్న 1400 కోట్ల రూపాయలను సీఎంఆర్ బకాయిలు చెల్లించాలని, ప్రజా పంపిణీ వ్యవస్థకు సంబంధించి సబ్సిడీ 343 కోట్ల రూపాయలు వెంటనే విడుదల చేయాలని,

2024- 25 ఖరీఫ్ సీఎంఆర్ డెలివరీ కాలపరిమితిని 60 రోజులు పెంచాలని, 24 -25 సంబంధించి యసంగి 120 రోజులకు పెంచాలని, తెలంగాణకు అదనపు రేక్ ల సౌకర్యాన్ని కల్పించాలని, దీనివల్ల రైసు మూమెంట్ కు సులభం అవుతుందని, 2025- 26 కు సంబంధించి ధాన్యం సేకరణ టార్గెట్ ను 80 లక్షల మెట్రిక్ టన్నుల నుండి పెంచాలని, ప్రస్తుత ఎఫ్సిఐ గోదాంలో లక్ష మెట్రిక్ టన్నుల సామర్థ్యం వరకు పెంచాలని కోరారు.

దేశంలో తెలంగాణ ఖరీఫ్లో 150 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పండించిందని, 80 లక్షల మెట్రిక్ టన్నులు రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరిస్తున్నదని, ఇదివరకే 29 వేల కోట్ల రూపాయలను ధాన్యం కొనుగోలుపై ఖర్చు చేయడం జరిగిందని , రైతులు పండించిన చివరి గింజ వరకు కొనుగోలు చేసేందుకు రాష్ట్రంలో 8800 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామని, ఆహార భద్రత కింద ప్రతి ఒక్కరికి 6 కిలోల నాణ్యమైన సన్నబియాన్ని ఇస్తున్నామని తెలిపారు.

రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ నల్గొండ జిల్లా బత్తాయి పంటకు ప్రసిద్ధి చెందిందని, అందువల్ల జిల్లాలో 2500 మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన బత్తాయి కోల్డ్ స్టోరేజ్ మంజూరు చేయాలని, ధాన్యానికి సంబంధించి ప్రైవేటు ప్రభుత్వ భాగస్వామ్యంలో లక్ష మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన గోదామును మంజూరు చేయాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు.

నల్గొండ పార్లమెంట్ సభ్యులు కుందూరు రఘువీర్ రెడ్డి , భారత ఆహార సంస్థ ఈ డి వనిత శర్మ మాట్లాడారు. ఎమ్మెల్సీ శంకర్ నాయక్ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, భారత ఆహార సంస్థ జిల్లా మేనేజర్ రాజు, ఎఫ్సిఐ అధికారులు, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

MOST READ : 

  1. District collector : జిల్లా కలెక్టర్ కీలక ఆదేశాలు.. ధాన్యం కొనుగోలు సెంటర్ల ఆకస్మిక తనిఖీ..!

  2. Khammam : ఖమ్మంలో దారుణం.. భార్యను హత్య చేసిన భర్త.. కూతురుపై కూడా..!

  3. Gold Price : బంగారం ధర ఒకేరోజు భారీగా రూ.17 వేలకు పైగా తగ్గింది.. కొనుగోళ్లకు ఇదే మంచి సమయం..!

  4. ACB : లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ కి చిక్కిన ఎస్సై రాజేష్..!

మరిన్ని వార్తలు