MG University : మహాత్మా గాంధీ యూనివర్సిటీలో ఔట్సోర్సింగ్ నియామకాల్లో అక్రమాలు.. విచారణ జరిపించాలని వినతి..!
మహాత్మా గాంధీ యూనివర్సిటీలో ఇటీవల చేపట్టిన ఔట్సోర్సింగ్ నియామకాల్లో భారీ అవినీతి, అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ యూనివర్సిటీ విద్యార్థి సంఘ నాయకులు శుక్రవారం హైదరాబాద్‌లో తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ జిట్టా బాలకృష్ణ రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు.

MG University : మహాత్మా గాంధీ యూనివర్సిటీలో ఔట్సోర్సింగ్ నియామకాల్లో అక్రమాలు.. విచారణ జరిపించాలని వినతి..!
నల్లగొండ, మనసాక్షి
మహాత్మా గాంధీ యూనివర్సిటీలో ఇటీవల చేపట్టిన ఔట్సోర్సింగ్ నియామకాల్లో భారీ అవినీతి, అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ యూనివర్సిటీ విద్యార్థి సంఘ నాయకులు శుక్రవారం హైదరాబాద్‌లో తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ జిట్టా బాలకృష్ణ రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా విద్యార్థి సంఘ నాయకులు మాట్లాడుతూ యూనివర్సిటీలో నిర్వహించిన ఔట్సోర్సింగ్ నియామకాలు పూర్తిగా నిబంధనలకు విరుద్ధంగా జరిగాయని తెలిపారు. రోస్టర్ రిజర్వేషన్ విధానం పాటించకుండా, పత్రిక ప్రకటనలు సరైన విధంగా ఇవ్వకుండా, అర్హులైన నిరుద్యోగులకు అవకాశం లేకుండా నియామకాలు చేపట్టారని ఆరోపించారు.
ఇప్పటికే ఈ అంశంపై యూనివర్సిటీ వీసీ రిజిస్ట్రార్కుపలుమార్లు వినతిపత్రాలు అందజేసినా అధికారులు స్పందించక పోవడంతో ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ను కలిసి పూర్తి వివరాలు తెలియజేసినట్లు పేర్కొన్నారు. విద్యార్థి సంఘ నాయకుడు వాడపల్లి నవీన్ మాట్లాడుతూ గతంలో నవీన్ మిట్టల్ వైస్ ఛాన్సలర్‌గా ఉన్న సమయంలో కూడా 33 మంది డైలీ వేజ్ ఉద్యోగులను రోస్టర్ రిజర్వేషన్ పత్రిక ప్రకటనలు లేకుండా అక్రమంగా నియమించారని తెలిపారు.
ప్రస్తుతం చేపట్టిన నియామకాలలో కూడా నిరుద్యోగుల వద్ద లక్షల రూపాయలు వసూలు చేసి 100కు పైగా అక్రమ నియామకాలు జరిగాయని ఆరోపించారు. అక్రమాలకు పాల్పడిన ఏజెన్సీపై కఠిన చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో ఆ ఏజెన్సీకి యూనివర్సిటీ లేదా ఇతర ప్రభుత్వ సంస్థల్లో పనులు ఇవ్వకుండా బ్లాక్‌లిస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
అలాగే ప్రస్తుతం జరిగిన నియామకాలను పూర్తిగా రద్దుచేసి, తిరిగి పారదర్శకంగా నోటిఫికేషన్ విడుదల చేసి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు స్వీకరించి నాణ్యత కలిగిన విద్యావంతులను ఎంపిక చేయాలని కోరారు.
ఈ సందర్భంగా తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ జిట్టా బాలకృష్ణ రెడ్డి విద్యార్థుల ఫిర్యాదులను స్వీకరించి, ఈ అంశంపై విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకునేలా యూనివర్సిటీ అధికారులతో చర్చిస్తామని హామీ ఇచ్చినట్లు విద్యార్థి నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘ నాయకులు పోలగొని శివ, రాజేష్, యశ్వంత్, రామ్, జితేందర్, సంజీవ, నిరుద్యోగ యువకులు పాల్గొన్నారు.