Karimnagar : పోలీసు పహారాలో సమావేశాలా.. రాష్ట్ర కమిటీ సమావేశం వద్ద ఉద్రిక్తత..!
తెలంగాణ రాష్ట్ర ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ల సంక్షేమ సంఘం (టీజీపీవిడబ్లూఏ) ప్రస్తుత నాయకత్వంపై అవినీతి, నియంతృత్వ ఆరోపణలు వెల్లువెత్తాయి.

Karimnagar : పోలీసు పహారాలో సమావేశాలా.. రాష్ట్ర కమిటీ సమావేశం వద్ద ఉద్రిక్తత..!
కోట్ల రూపాయల నిధులకు లెక్కలు చెప్పాల్సిందే
టీజీపీవిడబ్లూఏ ప్రస్తుత నాయకత్వంపై మాజీ ప్రధాన కార్యదర్శి తీవ్ర ఆగ్రహం
కరీంనగర్, జూలై 28, మనసాక్షి:
తెలంగాణ రాష్ట్ర ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ల సంక్షేమ సంఘం (టీజీపీవిడబ్లూఏ) ప్రస్తుత నాయకత్వంపై అవినీతి, నియంతృత్వ ఆరోపణలు వెల్లువెత్తాయి. మంగళవారం కరీంనగర్ లో జరుగుతున్న సంఘం రాష్ట్ర కమిటీ సమావేశం తీవ్ర వివాదాల మధ్య సాగుతోంది. సంఘంలో జరుగుతున్న అవకతవకలపై రాష్ట్ర నాయకులు వివరణ ఇస్తారన్న ప్రచారంతో, వాస్తవాలు తెలుసుకునేందుకు వివిధ జిల్లాల నుండి నాయకులు, కమిటీ సభ్యులు భారీగా తరలివచ్చారు. కుటుంబ భరోసా నిధులు మాయం, సంఘం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘కుటుంబ భరోసా’ పథకంలో భారీ ఎత్తున నిధులు మాయమయ్యాయని మాజీ ప్రధాన కార్యదర్శి ఆరోపించారు.
ఎలాంటి రికార్డులు, కనీస వివరాలు లేకుండా కోట్ల రూపాయల ఫండ్‌ను దారిమళ్లించారని మండిపడ్డారు. సంఘం పేరుతో కొనుగోలు చేసిన స్థలాల వ్యవహారంలోనూ పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని, సంఘం స్థాపించిన నాటి నుండి ఇప్పటి వరకు ఎలాంటి ఆడిట్ లెక్కలను సభ్యుల ముందు ఉంచలేదని ధ్వజమెత్తారు. అంతే కాకుండా సభ్యులకు అందించాల్సిన యూనియన్ ఐడి కార్డులు సుమారు రెండు వందల మందికి ఇప్పటి వరకు అందించకుండా ప్రస్తుత నాయకులు విభజించి పాలిస్తున్నారని ఆరోపించారు.
రాపర్తి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ప్రస్తుత నాయకత్వం చేస్తున్న అక్రమాలను ప్రశ్నించడానికి రాష్ట్రం నలుమూలల నుండి ఫోటోగ్రాఫర్లు, జిల్లా నాయకులు ఈ సమావేశానికి తరలి వచ్చి బాధ్యులను నిలదీశారు. దింతో అక్కడ ఇరువర్గాల మధ్య వాగ్వదం చోటు చేసుకుని ఉద్రిక్తతకు దారితీసింది. కోట్ల రూపాయల నిధులకు లెక్కలు అడిగితే సభ్యులను పోలీసు కేసులతో బెదిరిస్తున్నారని మాజీ ప్రధాన కార్యదర్శి ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రశ్నించే నాయకులు ఎవరూ మీటింగ్‌కు రాకుండా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం ప్రస్తుత నాయకుల నియంతృత్వానికి నిదర్శనమన్నారు. సభ్యుల చెమటోడ్చిన సొమ్ముకు ప్రస్తుత నాయకత్వం తక్షణమే బాధ్యత వహించాలని, ప్రతి పైసాకు బహిరంగంగా లెక్కలు చెప్పేవరకు పోరాటం ఆగదని ఆయన స్పష్టం చేస్తూ.. సమావేశం బైకట్ చేసి బైటయించి ఆందోళనకు దిగారు.










