Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsకరీంనగర్జిల్లా వార్తలుతెలంగాణ

Karimnagar : ఫుట్‌పాత్‌లన్నీ ఆక్రమణ.. మరి ప్రజలు నడిచేది ఎక్కడ..?

ప్రజలు నడిచేందుకు ఏర్పాటు చేసిన ఫుట్‌పాత్‌లు వ్యాపారాల విస్తరణకు వేదికలుగా మారుతుంటే సంబంధిత అధికారులు ఎందుకు మౌనం వహిస్తున్నారనే ప్రశ్నలు కరీంనగర్‌లో వినిపిస్తున్నాయి. నగరంలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి వెనకాల కరీంనగర్ నగరపాలక సంస్థ నిర్మించిన షెడ్లను వ్యాపార సముదాయాల నిర్వాహకులకు లీజుకు కేటాయించింది.

Karimnagar : ఫుట్‌పాత్‌లన్నీ ఆక్రమణ.. మరి ప్రజలు నడిచేది ఎక్కడ..?

కమిషనర్ గారూ.. ఫుట్‌పాత్‌లు కనిపించడం లేదా..?

కరీంనగర్ లో యథేచ్ఛగా ఫుట్‌పాత్‌ల ఆక్రమణలు..

ప్రత్యేక తనిఖీలు చేపట్టాలని ప్రజల డిమాండ్..

కరీంనగర్ బ్యూరో, మనసాక్షి :

ప్రజలు నడిచేందుకు ఏర్పాటు చేసిన ఫుట్‌పాత్‌లు వ్యాపారాల విస్తరణకు వేదికలుగా మారుతుంటే సంబంధిత అధికారులు ఎందుకు మౌనం వహిస్తున్నారనే ప్రశ్నలు కరీంనగర్‌లో వినిపిస్తున్నాయి. నగరంలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి వెనకాల కరీంనగర్ నగరపాలక సంస్థ నిర్మించిన షెడ్లను వ్యాపార సముదాయాల నిర్వాహకులకు లీజుకు కేటాయించింది.

అయితే వారికి కేటాయించిన షెడ్లకే పరిమితం కాకుండా, పబ్లిక్ కోసం ఏర్పాటు చేసిన ఫుట్‌పాత్‌లను కూడా ఆక్రమించి యథేచ్ఛగా వ్యాపారాలు నిర్వహిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఫుట్‌పాత్‌లపై రేకుల షెడ్లు, తాత్కాలిక పందిర్లు ఏర్పాటు చేయడంతో పాటు దుకాణాలకు సంబంధించిన సామగ్రిని కూడా అక్కడే నిల్వ ఉంచుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. దీంతో పాదచారులకు కేటాయించిన మార్గాలు పూర్తిగా లేదా పాక్షికంగా దిగ్బంధమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇది ఆసుపత్రుల ప్రాంతం కావడంతో నిత్యం రోగులు, వారి సహాయకులు, వృద్ధులు, మహిళలు, చిన్నారులతో పాటు సాధారణ ప్రజల రాకపోకలు అధికంగా ఉంటాయి. అయితే ఫుట్‌పాత్‌లు ఆక్రమణలకు గురికావడంతో ప్రజలు తప్పనిసరి పరిస్థితుల్లో రోడ్డుపైనే నడవాల్సి వస్తోందని పలువురు పేర్కొంటున్నారు. ఇప్పటికే ఈ ప్రాంతంలో వాహనాల రద్దీ అధికంగా ఉండగా, పాదచారులు రోడ్డుపైకి రావడం వల్ల ప్రమాదాల ముప్పు కూడా పెరుగుతోందని ఆందోళన వ్యక్తమవుతోంది.

మరోవైపు పలు ఆసుపత్రులకు సరైన పార్కింగ్ సౌకర్యాలు లేకపోవడంతో ఆసుపత్రి నిర్వాహకులు, సిబ్బంది, చికిత్స కోసం వచ్చే రోగులు, వారి కుటుంబ సభ్యులు తమ వాహనాలను కూడా ఫుట్‌పాత్‌లపైనే నిలుపుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఒకవైపు వ్యాపారుల ఆక్రమణలు, మరోవైపు వాహనాల పార్కింగ్‌తో పాదచారులకు నడిచే అవకాశం లేకుండా పోతోందని స్థానికులు వాపోతున్నారు. ప్రజల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ఫుట్‌పాత్‌లు ఆక్రమణలకు గురవుతున్నప్పటికీ సంబంధిత అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు.

కరీంనగర్ నగరపాలక కమిషనర్ వెంటనే స్పందించి ఆసుపత్రుల ప్రాంతంతో పాటు నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో ఫుట్‌పాత్ ఆక్రమణలపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలని కోరుతున్నారు. అక్రమంగా ఏర్పాటు చేసిన రేకుల షెడ్లు, తాత్కాలిక పందిర్లు తొలగించి ఫుట్‌పాత్‌లను పాదచారులకు అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా పార్కింగ్ సౌకర్యాలు లేకుండా నిర్వహిస్తున్న ఆసుపత్రులను గుర్తించి నిబంధనల మేరకు చర్యలు తీసుకోవాలని, ఫుట్‌పాత్‌లపై వాహనాల పార్కింగ్‌ను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు