శిఖం.. ఖతం..!
నల్గొండ జిల్లా గుర్రంపోడు మండల పరిధిలోని తానేదారిపల్లి గ్రామ పెద్ద చెరువు భూములు భారీగా ఆక్రమణకు గురైనట్లు స్థానికుల నుండి తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.

శిఖం.. ఖతం..!
20 ఎకరాల ప్రభుత్వ భూమి మాయం
గుర్రంపోడు, మన సాక్షి :
నల్గొండ జిల్లా గుర్రంపోడు మండల పరిధిలోని తానేదారిపల్లి గ్రామ పెద్ద చెరువు భూములు భారీగా ఆక్రమణకు గురైనట్లు స్థానికుల నుండి తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. దాదాపు 100 ఎకరాల విస్తీర్ణం కలిగిన ఈ చారిత్రక పెద్ద చెరువు పరిధిలో, సుమారు 20 ఎకరాల శిఖం మరియు బఫర్ జోన్ భూమి అక్రమంగా కబ్జాకు గురైందని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.
గ్రామ వ్యవసాయానికి, భూగర్భ జలాల పెంపునకు కీలకమైన ఈ చెరువు పరివాహక ప్రాంతాన్ని కొందరు వ్యక్తులు నిబంధనలకు విరుద్ధంగా ఆక్రమించి, సాగు భూములుగా మార్చడం లేదా ఇతర అక్రమ నిర్మాణాలకు వాడుతున్నట్లు సమాచారం.
Also Read : దొంగతనాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..!
ఈ ఆక్రమణల వల్ల చెరువు ఉనికి ప్రమాదంలో పడటమే కాకుండా, రాబోయే రోజుల్లో నీటి నిల్వ సామర్థ్యం తగ్గి రైతులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంపై రెవెన్యూ మరియు నీటి పారుదల శాఖ అధికారులు తక్షణమే స్పందించి, డిజిటల్ సర్వే నిర్వహించి చెరువు సరిహద్దులను నిర్ణయించాలని గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
Also Read : షటిల్ ఆడుతూ ఆరోగ్యశాఖ ఉద్యోగి మృతి
అక్రమ కబ్జాలను తొలగించి, ప్రభుత్వ ఆస్తులను కాపాడాలని, బాధ్యులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ విషయమై త్వరలోనే జిల్లా కలెక్టర్కు మరియు ‘ప్రజావాణి’ కార్యక్రమంలో అధికారికంగా ఫిర్యాదు చేసేందుకు గ్రామస్థులు సమాయత్తమవుతున్నారు.









