తీవ్ర విషాదం.. ఇద్దరు పిల్లలతో సహా చెరువులో దూకి భార్య ఆత్మహత్య..!
భర్త వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని ఆవేదనతో ఇద్దరు పిల్లలతో సహా చెరువులో దూకి భార్య ఆత్మహత్య చేసుకుంది.

తీవ్ర విషాదం.. ఇద్దరు పిల్లలతో సహా చెరువులో దూకి భార్య ఆత్మహత్య..!
మన సాక్షి, వెబ్ డెస్క్ :
భర్త వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని ఆవేదనతో ఇద్దరు పిల్లలతో సహా చెరువులో దూకి భార్య ఆత్మహత్య చేసుకుంది. వివరాల ప్రకారం.. వరంగల్ జిల్లా ఎలుకుర్తి హవేలీ గ్రామంలో ఉంటూ, హన్మకొండ జిల్లా బైరాన్పల్లి గ్రామానికి చెందిన మమత (30) అనే యువతిని ఆరేళ్ల క్రితం ఈరెల్లి సుమన్ అనే వ్యక్తి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.
సుమన్ ఊరిలో కూలీ పనులు చేస్తూ, మమత నర్సంపేటలోని ప్రైవేట్ కంటి ఆసుపత్రిలో ఉద్యోగం చేస్తూ, ఇద్దరు పిల్లలు హరిణి (4), కావ్యశ్రీ (3)తో కలిసి నివాసం ఉంటున్నారు.
కొంతకాలంగా అదే గ్రామానికి చెందిన పెళ్లయిన మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని, 20 రోజుల క్రితం ఆమెతో కలిసి సుమన్ వెళ్లిపోయాడు. పెద్దమనుషుల సమక్షంలో పంచాయతీ పెట్టగా, సుమన్ భార్యతోనే ఉండాలని తీర్మానించడంతో కొన్ని రోజులుగా నర్సంపేట మండలం ముగ్ధుంపురంలోని బంధువుల ఇంట్లో నివాసం ఉంటున్నారు.
Also Read : రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి.. ఏడుగురికి గాయాలు.. మానవత్వంతో స్పందించిన ఎమ్మెల్సీ శంకర్ నాయక్..!
అయితే, సుమన్ మరోసారి సదరు వివాహితతో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోవడంతో తిరిగి ఎలుకుర్తి హవేలీకి మమత వచ్చేసింది. సదరు వివాహిత బంధువులతో కలిసి ఇంటికి వచ్చి దారుణంగా దూషించడంతో అవమానం తట్టుకోలేక, ఉద్యోగానికి వెళ్తున్నానని చెప్పి మమత పిల్లలతో సహా బయలుదేరింది. పాకాల చెరువు వద్దకు చేరుకుని, హైదరాబాద్లో ఉండే బంధువులకు చనిపోతున్నానని చెప్పి లొకేషన్ షేర్ చేసి, పిల్లలను నడుముకు కట్టుకుని చెరువులోకి దూకింది.
బంధువులు మమత ఫోన్కు పదే పదే ఫోన్ చేయడంతో, చెరువు వద్ద సిబ్బంది ఫోన్ లిఫ్ట్ చేశారు. దాంతో వారికి విషయం చెప్పారు.
చెరువులో గాలించి ముగ్గురి మృతదేహాలను వెలికితీశారు. అయితే, కూతురు, మనవరాళ్లు చనిపోయారని తెలిసినా మమత తల్లిదండ్రులు అక్కడికి రాలేదు. దాంతో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.








