Miryalaguda : మిర్యాలగూడలో ఏఐ ఆధారిత వ్యక్తిగత అభ్యసన విధానం ప్రారంభం..!
Miryalaguda : మిర్యాలగూడలో ఏఐ ఆధారిత వ్యక్తిగత అభ్యసన విధానం ప్రారంభం..!

Miryalaguda : మిర్యాలగూడలో ఏఐ ఆధారిత వ్యక్తిగత అభ్యసన విధానం ప్రారంభం..!
విద్యారంగంలో సాంకేతిక విప్లవానికి నాంది
విద్యార్థుల భవిష్యత్తుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఎంతో అవసరం.. ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి
మిర్యాలగూడ, మన సాక్షి :
మిర్యాలగూడ పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో రోటరీ క్లబ్ ఆఫ్ లేక్ డిస్ట్రిక్ట్ మొయినాబాద్, రోటరీ క్లబ్ ఆఫ్ మిర్యాలగూడ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన TutoriX – AI Based Personalized Learning System కార్యక్రమానికి మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత ప్రపంచంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతిక పరిజ్ఞానం అన్ని రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తోందని, విద్యారంగంలో కూడా ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
ప్రతి విద్యార్థి నేర్చుకునే విధానం, సామర్థ్యం, అభ్యసన వేగం వేర్వేరుగా ఉంటాయని, అలాంటి విద్యార్థులకు వారి అవసరాలకు అనుగుణంగా వ్యక్తిగత అభ్యసనాన్ని అందించడంలో AI ఆధారిత విద్యా విధానాలు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు సైతం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన నాణ్యమైన విద్య అందుబాటులోకి రావాలని, విద్యార్థులు సాంకేతికతను సద్వినియోగం చేసుకుంటూ ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు.
విద్య అనేది కేవలం మార్కులు సాధించడం మాత్రమే కాదని, విద్యార్థుల్లో ఆలోచనా శక్తి, సృజనాత్మకత, ఆత్మవిశ్వాసం పెంపొందించడమే నిజమైన విద్య అని అన్నారు. విద్యారంగ అభివృద్ధికి, విద్యార్థుల భవిష్యత్తుకు ఉపయోగపడే ఇలాంటి వినూత్న కార్యక్రమాలకు తన సంపూర్ణ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు. సమాజ సేవతో పాటు విద్యా అభివృద్ధికి విశేష కృషి చేస్తున్న రోటరీ సంస్థ సేవలను ఎమ్మెల్యే అభినందించారు.
Also Read : Miryalaguda : ఎమ్మెల్యే బిఎల్ఆర్ కీలక ఆదేశాలు.. రైస్ మిల్లుల తనిఖీ, రైతులతో మాట మంతీ..!
మిర్యాలగూడలో AI ఆధారిత వ్యక్తిగత అభ్యసన విధానాన్ని పరిచయం చేస్తున్న రోటరీ క్లబ్ ఆఫ్ లేక్ డిస్ట్రిక్ట్ మొయినాబాద్ మరియు రోటరీ క్లబ్ ఆఫ్ మిర్యాలగూడ ప్రతినిధులకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు ఆధునిక విద్యా సాంకేతికత మరింత చేరువై, వారి విద్యా ప్రగతికి దోహదపడాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ చిలుకూరి సుధా బాలకృష్ణ , కౌన్సిలర్ సోము సుందర్, రోటరీ ఇంటర్నేషనల్ జిల్లా 3150 గవర్నర్ RTN ఉదయ్ పిలానీ , రోటరీ క్లబ్ ఆఫ్ మిర్యాలగూడ అధ్యక్షులు RTN మాసెట్టి శ్రీనివాసు, కార్యదర్శి RTN రేపాల వీరయ్య, రోటరీ సభ్యులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.










