మిషన్ భగీరథ తాగునీటికి అక్రమ కనెక్షన్లు.. పంట పొలాలకు మళ్లింపు..!
ప్రజల దాహార్తిని తీర్చాల్సిన మిషన్ భగీరథ తాగునీరు కొందరు వ్యక్తుల స్వార్థం వల్ల పంట పొలాలకు మళ్లుతోంది.

మిషన్ భగీరథ తాగునీటికి అక్రమ కనెక్షన్లు.. పంట పొలాలకు మళ్లింపు..!
ఫిర్యాదు చేసినా పట్టించుకోని సంబంధిత అధికారులు
తక్షణమే చర్యలు తీసుకోవాలని గ్రామస్తుల డిమాండ్
(గుర్రంపోడు, మన సాక్షి – యాలాద్రి)
ప్రజల దాహార్తిని తీర్చాల్సిన మిషన్ భగీరథ తాగునీరు కొందరు వ్యక్తుల స్వార్థం వల్ల పంట పొలాలకు మళ్లుతోంది. మక్కపల్లి, పార్లపల్లి, వీటి నగర్ గ్రామాలకు సరఫరా అయ్యే మిషన్ భగీరథ ప్రధాన పైప్‌లైన్లకు కొందరు రైతులు వీటి నగర్ సమీపంలో మధ్యలోనే అక్రమంగా కనెక్షన్లు ఇచ్చుకుని, ఆ నీటిని తమ వ్యవసాయ పొలాలకు వాడుకుంటున్నారని స్థానిక గ్రామస్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రధాన పైప్‌లైన్ల నుండి నీటిని అక్రమంగా తోడేస్తుండటంతో, చివరి గ్రామాలైన మక్కపల్లి, పార్లపల్లి, వీటి నగర్ ప్రాంతాలకు తాగునీరు సరిగ్గా అందడం లేదు. ఫలితంగా గ్రామస్తులు గుక్కెడు మంచినీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒకవైపు తాగడానికి నీళ్లు లేక ప్రజలు అల్లాడుతుంటే, మరోవైపు తాగునీటిని వ్యవసాయానికి వాడుకోవడం ఎంతవరకు సమంజసమని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు.
Also Read : 8 నెలల పసికందును గొంతు నులిమి చంపి, తాను ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన తల్లి..!
పైప్‌లైన్లకు అక్రమ కనెక్షన్లు వేసి నీటిని మళ్లిస్తున్న విషయాన్ని ఇప్పటికే పలుమార్లు సంబంధిత మిషన్ భగీరథ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా వారు ఏమాత్రం పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే అక్రమార్కులు మరింత రెచ్చిపోతున్నారని మండిపడుతున్నారు. ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి, అక్రమ కనెక్షన్లను తొలగించాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుని తమ గ్రామాలకు సక్రమంగా తాగునీరు అందేలా చూడాలని గ్రామస్తులు కోరుతున్నారు.
పైపులైన్లకు అక్రమంగా రంధ్రాలు చేసి, నీటిని లీక్ చేస్తూ వ్యవసాయ అవసరాలకు వాడుకుంటున్నారు. ఈ అక్రమ చర్యల వల్ల చివరి గ్రామాలకు తాగునీటి సరఫరా నిలిచిపోయి సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రజా ఆస్తిని ధ్వంసం చేస్తూ, తాగునీటిని అక్రమంగా మళ్లిస్తున్న వారిపై అధికారులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.









