కొండను తవ్వి ఎలుకను పట్టిన ఏసీబీ అధికారులు..!
అన్నమయ్య జిల్లా మదనపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై కడప ఏసీబీ అధికారులు రెండు రోజుల పాటు దాడులు, తనిఖీలు నిర్వహించారు.

కొండను తవ్వి ఎలుకను పట్టిన ఏసీబీ అధికారులు..!
మదనపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రెండు రోజుల దాడులు..
రూ.82 వేలు అదనంగా ఉన్నట్లు వెల్లడి
మన సాక్షి : (మదనపల్లి – వల్లాల వేణు)
అన్నమయ్య జిల్లా మదనపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై కడప ఏసీబీ అధికారులు రెండు రోజుల పాటు దాడులు, తనిఖీలు నిర్వహించారు. లక్షల్లో అవినీతి సొమ్ము పట్టుబడుతుందని భావించిన అధికారులకు చివరకు మిగిలింది నిరాశే. కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుగా కేవలం రూ.82 వేలు మాత్రమే అవినీతి సొమ్ము స్వాధీనం చేసుకున్నట్లు కడప ఏసీబీ డీఎస్పీ సీతారామరావు తెలిపారు.
సోమవారం సాయంత్రం ఏసీబీ అధికారులు రహస్యంగా కార్యాలయానికి చేరుకుని తనిఖీలు ప్రారంభించారు. అధికారులు, సిబ్బంది, రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన ప్రజలను లోపలే ఉంచి తలుపులు మూయించారు. రిజిస్ట్రేషన్ కోసం వచ్చే ప్రజల నుండి ఎక్కువ మొత్తంలో ఫీజు వసూలు చేస్తున్నారన్న ఫిర్యాదుపై తనిఖీకి వచ్చినట్లు సబ్ రిజిస్ట్రార్ గురుస్వామికి తెలిపారు.
మొత్తం రికార్డులు, రిజిస్ట్రేషన్ పత్రాలు, డాక్యుమెంట్లను క్షుణ్ణంగా పరిశీలించారు.
బీరువాలను తనిఖీ చేసి సిబ్బంది, ప్రైవేటు డాక్యుమెంట్ రైటర్లను విచారించారు. సుమారు నాలుగు గంటల పాటు విచారణ కొనసాగింది. రూ.1.25 లక్షల నగదు అధికంగా ఉన్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
మంగళవారం ఉదయం మళ్లీ తనిఖీలు కొనసాగించి మధ్యాహ్నం వరకు ఏకధాటిగా విచారణ చేశారు. పట్టుబడిన రూ.1.25 లక్షల్లో ప్రభుత్వ సొమ్ము రూ.45 వేలు కాగా, మిగిలిన రూ.82 వేలు అవినీతి సొమ్ముగా గుర్తించినట్లు డీఎస్పీ వెల్లడించారు.
జిల్లా కేంద్రం కావడంతో మదనపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ప్రతిరోజూ వందల సంఖ్యలో రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి.
ఇళ్ల స్థలాలు, గృహాలు, భూముల క్రయవిక్రయాలతో ప్రభుత్వానికి రోజూ లక్షల్లో ఆదాయం వస్తోంది. అన్నమయ్య జిల్లాలో ఆదాయంలో మదనపల్లి కార్యాలయం టాప్ లో ఉంది.
రెండు రోజుల పాటు రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడంతో ప్రజలు, క్రయ విక్రయదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సబ్ రిజిస్ట్రార్ పేరుతో కొంతమంది డాక్యుమెంట్ రైటర్లు అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నారని, వారి వల్లే కార్యాలయంపై అవినీతి ఆరోపణలు వచ్చి ఉంటాయని ప్రజలు భావిస్తున్నారు.










