KCR : బండ్లు ఓడలు.. ఓడలు బండ్లు, ఢిల్లీలో చక్రం తిప్పబోయి.. ఫాఫం కేసిఆర్..!

బండ్లు ఓడలు.. ఓడలు బండ్లు.. ఈ సామెత తెలంగాణ పల్లెల్లో నానుడి. ఒకప్పుడు బాగా బతికిన వాళ్ళు గర్వంతో విర్రవీగితే చివరికి ఏమవుతుందో తెలియ చెబుతుంది ఈ సామెత.

KCR : బండ్లు ఓడలు.. ఓడలు బండ్లు, ఢిల్లీలో చక్రం తిప్పబోయి.. ఫాఫం కేసిఆర్..!

బండ్లు ఓడలు.. ఓడలు బండ్లు.. ఈ సామెత తెలంగాణ పల్లెల్లో నానుడి. ఒకప్పుడు బాగా బతికిన వాళ్ళు గర్వంతో విర్రవీగితే చివరికి ఏమవుతుందో తెలియ చెబుతుంది ఈ సామెత. తెలంగాణ ఉద్యమ సమయంలో అనేక ఒడిదుడుకులను ఎదుర్కొన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్.. తెలంగాణ ఏర్పడిన తర్వాత వరుసగా రెండు పర్యాయాలు.. 9 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు.

టిఆర్ఎస్ గా ఉన్న పార్టీని బీఆర్ఎస్ గా మార్చి జాతీయ పార్టీగా ప్రకటించారు. తెలంగాణనే కాకుండా దేశంలోని పలు రాష్ట్రాలలో పర్యటించి జాతీయస్థాయి పార్టీగా గుర్తింపు తీసుకురావాలని భావించారు. పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణతో పాటు పలు రాష్ట్రాలలో పోటీ చేసి తమ సత్తా నిరూపించాలని, ఢిల్లీలో చక్రం తిప్పుతానని అనేక పర్యాయాలు సభలు, సమావేశాల్లో ప్రకటించారు. కానీ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ బొక్క బోర్లా పడింది. కేవలం 39 మంది మాత్రమే ఎమ్మెల్యేలుగా గెలిచారు. ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కనీవినీ ఎరుగని రీతిలో ఒక్క స్థానం కూడా గెలుచుకోలేకపోయింది.

దాంతో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గజ్వేల్ నియోజకవర్గం లోని ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలోని ఫామ్ హౌస్ కు పరిమితం అయ్యారు. అంతకుముందే జారిపడి కాలు తుంటికి ఆపరేషన్ చేయించుకున్న కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచే కార్యకలాపాలను నడిపించారు. పార్లమెంట్ ఎన్నికల్లో సైతం కర్ర సహాయంతో ప్రచారం నిర్వహించారు.

పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా సాధించలేక బొక్క బోర్ల పడిపోయారు. ఇక తమ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు రోజుకు ఒకరు చొప్పున కాంగ్రెస్ పార్టీలో చేరుతుంటే కెసిఆర్ ఏమి చేయలేని పరిస్థితి ఏర్పడింది. ఇటీవల ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. అయినా కూడా సమావేశాలకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు డుమ్మా కొడుతున్నారు. ఇలాంటి పరిస్థితి వస్తుందని కేసీఆర్ కూడా ఊహించకపోవచ్చు.

ఢిల్లీలో చక్రం తిప్పాలని భావించిన కేసీఆర్ ఫాఫం ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రం చుట్టూ ఓమిని వ్యాన్ చక్రం తిప్పే పరిస్థితి వచ్చింది. గురువారం తన వ్యాన్ ను వ్యవసాయ క్షేత్రం చుట్టూ స్వయంగా నడిపి రైతులు రైతు కూలీలతో ముచ్చటించారు. పార్టీని కార్యకర్తలను, నాయకులను ఎలా కాపాడుకోవాలో అర్థం కాని పరిస్థితి ఉందని పలువురు రాజకీయ ప్రముఖులు పేర్కొంటున్నారు.

కెసిఆర్ కుటుంబం వల్లనే తెలంగాణలో ఆ పార్టీ ఓడిపోయిందని ఆ పార్టీ నాయకులు పలువురు బహిరంగంగా పేర్కొంటూ పార్టీని విడిచి వెళ్ళిపోతున్న విషయం తెలిసిందే. లిక్కర్ కుంభకోణంలో కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవిత జైలులో ఉండడం, ఫోన్ టాపింగ్ కేసు, విద్యుత్ కొనుగోళ్ల కేసు, గొర్రెల కొనుగోళ్ల కుంభకోణం, కాలేశ్వరం పరిస్థితి ఇలా అనేక సంఘటనలు ఆ పార్టీని, కేసీఆర్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.

ఇక రాబోయే రోజుల్లో పార్టీ పరిస్థితి ఎలా ఉంటుందోనని నాయకులు, కార్యకర్తలు కూడా ఆందోళన చెందుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చేనాటికి పార్టీ పరిస్థితి ఎలా ఉంటుందో ఇక మనం కూడా వేచి చూద్దాం..!

ALSO READ : 

WhatsApp : ఆ 35 ఫోన్లకు వాట్సప్ సేవలు బంద్.. జాబితాలో మీ ఫోన్ ఉందా.. చూసుకోండి..!

Job Mela : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 65 కంపెనీలతో మెగా జాబ్ మేళా..!

Success Story : క్యాటరింగ్ వర్కర్ నుంచి.. అసిస్టెంట్ ఇంజనీర్ గా కొలువు, సక్సెస్ కు సింబల్ గా మారిన యువకుడు..!