Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
జిల్లా వార్తలుBreaking Newsకరీంనగర్

దళిత మహిళలపై కుల వివక్ష, దాడి అమానవీయం..!

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని కొత్తపల్లి గ్రామంలో దళిత మహిళలపై జరిగిన కుల వివక్ష, దాడి ఘటనను కరీంనగర్ జిల్లా అంబేద్కర్ యువజన సంఘం తీవ్రంగా ఖండించింది.

దళిత మహిళలపై కుల వివక్ష, దాడి అమానవీయం..!

కరీంనగర్, మనసాక్షి :

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని కొత్తపల్లి గ్రామంలో దళిత మహిళలపై జరిగిన కుల వివక్ష, దాడి ఘటనను కరీంనగర్ జిల్లా అంబేద్కర్ యువజన సంఘం తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు శుక్రవారం జిల్లా కేంద్రంలోని సంఘ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా అంబేద్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు క్యాదాసి ప్రభాకర్ మాట్లాడుతూ.. బోనాల ఉత్సవాల్లో దళిత మహిళలను ఆలయంలోకి రాకుండా అడ్డుకుని, కులం పేరుతో దూషించడం అమానవీయమన్నారు. కొంతమంది తమ రాజకీయ లబ్ధి కోసం, ఎస్సీలు అంటే గిట్టని వారు.. బీసీల నుండి ఎస్సీలను విడగొట్టేందుకు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. దళితులు, వెనుకబడిన వర్గాల వారు అలాంటి వారి ఉచ్చుల నుండి బయటకు రావాలని పిలుపునిచ్చారు.

కొంతమంది రాజకీయ నాయకులు మనలో మనకు చిచ్చులు పెడుతూ రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ నాయకుల ఒత్తిళ్లతోనే పోలీసులు ఇప్పటి వరకు నిందితులను అరెస్ట్ చేయలేదని ఆయన ఆరోపించారు. రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా, ఈ ఘటనపై ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదైన నిందితులను పోలీసులు తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.

దళిత మహిళలను అవమానించిన వారిపై చట్టప్రకారం కఠినమైన సెక్షన్ల కింద చర్యలు తీసుకోవాలన్నారు. హిందువులంతా ఒక్కటే అని చెప్పే ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ నాయకులు ఈ అమానవీయ ఘటనపై ఇప్పటి వరకు ఎందుకు స్పందించలేదని ఆయన ప్రశ్నించారు. భవిష్యత్తులో జిల్లాలో ఎక్కడా ఇలాంటి కుల వివక్ష సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం, పోలీస్ యంత్రాంగం గట్టి చర్యలు చేపట్టాలని కోరారు.

బాధితులకు సంఘం అండగా ఉంటుందని వారు భరోసా ఇచ్చారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుద్దాల లక్ష్మిన్, రాష్ట్ర ప్లానింగ్ కమిటీ చైర్మన్ గజ్జల ఆనంద రావు, రాష్ట్ర కార్యదర్శి గోస్కి శంకర్, జిల్లా ప్రధాన కార్యదర్శి మానాలా నారాయణ, నగర అధ్యక్షులు నక్క అన్వేష్, సంఘం నాయకులు కృష్ణ మురళి తదితరులు పాల్గొని తమ మద్దతును ప్రకటించారు.

మరిన్ని వార్తలు