Karimnagar : అధికార బలం.. అక్రమ రవాణా..!
కరీంనగర్ నగర శివార్లలోని చింతకుంట పరిధిలో గల మానేరు వాగులో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. ఎటువంటి అనుమతులు లేకుండా రాత్రింబవళ్లు యథేచ్ఛగా మట్టి తవ్వకాలు జరుపుతూ సహజ వనరులను కొల్లగొడుతున్నారు.

Karimnagar : అధికార బలం.. అక్రమ రవాణా..!
మానేరు వాగును కాపాడండి బాబోయ్..
కరీంనగర్, మనసాక్షి :
కరీంనగర్ నగర శివార్లలోని చింతకుంట పరిధిలో గల మానేరు వాగులో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. ఎటువంటి అనుమతులు లేకుండా రాత్రింబవళ్లు యథేచ్ఛగా మట్టి తవ్వకాలు జరుపుతూ సహజ వనరులను కొల్లగొడుతున్నారు. ప్రతిరోజూ పదుల సంఖ్యలో ట్రాక్టర్ల ద్వారా ఈ అక్రమ రవాణా సాగుతోంది. మానేరు వాగులో జేసీబీల సహాయంతో పెద్ద ఎత్తున మట్టిని తవ్వి ట్రాక్టర్లలో నింపుతున్నారు.
ఒక్కో ట్రాక్టర్ ట్రిప్పును రూ. 900 నుండి రూ. 1,000 వరకు విక్రయిస్తూ అక్రమార్కులు లక్షల రూపాయలు గడిస్తున్నారు. ఈ అక్రమ మట్టి దందా వెనుక స్థానిక కార్పొరేటర్‌కు చెందిన జేసీబీ వాహనం ప్రమేయం ఉందనే బలమైన ఆరోపణలు వినిపిస్తున్నాయి.
రాజకీయ నాయకుల అండదండలు ఉండటం వల్లే మట్టి మాఫియా బరితెగించి ప్రవర్తిస్తోందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కళ్లెదుటే ఇంత పెద్ద ఎత్తున సహజ సంపద దోపిడీకి గురవుతున్నా, సంబంధిత మైనింగ్, రెవెన్యూ మరియు పోలీస్ అధికారులు కనీసం అటువైపు కన్నెత్తి చూడటం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
అధికారుల ఉదాసీనత వల్లే వాగులు గుల్లవుతున్నాయని పర్యావరణ ప్రేమికులు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి, మానేరు వాగులో మట్టి అక్రమ తవ్వకాలను అరికట్టాలని మరియు బాధ్యులపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.









