Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsకరీంనగర్జిల్లా వార్తలుతెలంగాణరాజకీయం

Karimnagar : సీఎం తీరుపై మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఫైర్..!

రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులను ఆదుకోవాలంటే కాళేశ్వరం ప్రాజెక్టులోని కన్నెపల్లి పంప్‌హౌస్ మోటార్లను వెంటనే ప్రారంభించి గోదావరి జలాలను రిజర్వాయర్లకు తరలించాలని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Karimnagar : సీఎం తీరుపై మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఫైర్..!

మేడిగడ్డ బ్యారేజ్ రిపేర్ చేయకుండానే నీటి ఎత్తిపోతలు నిర్వహించవచ్చు …

– కక్ష సాధింపు చర్యలు మానుకొని .. రైతుల కోసం వెంటనే కన్నెపల్లి మోటార్లు ఆన్ చేయాలి..

– రిటైర్డ్ ఇంజనీర్లను అవమానించడం సరికాదు: మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్

కరీంనగర్ మనసాక్షి :

రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులను ఆదుకోవాలంటే కాళేశ్వరం ప్రాజెక్టులోని కన్నెపల్లి పంప్‌హౌస్ మోటార్లను వెంటనే ప్రారంభించి గోదావరి జలాలను రిజర్వాయర్లకు తరలించాలని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కరీంనగర్ నగరంలోని తారక హోటల్లో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

తెలంగాణలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని, రైతులు పంటలు వేయాలా వద్దా అనే సందిగ్ధంలో ఉన్నారని ఆయన అన్నారు. ఇలాంటి సమయంలో రాజకీయాలకు అతీతంగా రైతులకు నీటి భరోసా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. కన్నెపల్లి పంప్‌హౌస్ మోటార్లను ప్రారంభించాలని కోరుతూ రిటైర్డ్ ఇంజనీర్ల సంఘం, ముఖ్యంగా రిటైర్డ్ ఇంజనీర్ శ్యాంప్రసాద్ రెడ్డి ప్రభుత్వానికి లేఖ రాయడం సమంజసమైన సూచన అని పేర్కొన్నారు. రాష్ట్ర పరిస్థితులపై పూర్తి అవగాహన ఉన్న మాజీ ఇంజనీర్లు రైతుల ప్రయోజనాల కోసం ఇచ్చిన సలహాలను ప్రభుత్వం గౌరవించాల్సిందిపోయి, వారిని జైలుకు పంపాలంటూ ముఖ్యమంత్రి మాట్లాడడం బాధ్యతారాహిత్యమని విమర్శించారు.

ఒక బాధ్యత గల ప్రభుత్వం అయితే కన్నెపల్లి నుంచి నీటిని ఎత్తిపోసే అంశంపై సాంకేతికంగా సాధ్యాసాధ్యాలను ప్రజలకు వివరించాలని, సంబంధిత అధికారులతో వివరణ ఇప్పించాలని, కానీ సలహాలు ఇచ్చిన వారిపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం ముఖ్యమంత్రి అహంకారానికి నిదర్శనమని అన్నారు. ప్రస్తుతం గోదావరిలో భారీగా నీరు దిగువకు వృథాగా వెళ్తోందని పేర్కొంటూ, మేడిగడ్డ వద్ద నీటిని నిల్వ చేయకుండానే, అక్కడికి సుమారు 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న కన్నెపల్లి పంప్‌హౌస్ ద్వారా నీటిని ఎత్తిపోసే అవకాశం ఉందని వివరించారు.

దీని ద్వారా ఎల్లంపల్లి, మానేరు వంటి రిజర్వాయర్లకు నీటిని తరలించి రైతులకు ఉపయోగపడేలా చేయవచ్చని చెప్పారు. గతంలో కాళేశ్వరం ప్రాజెక్టుపై తీవ్ర విమర్శలు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడు అదే ప్రాజెక్టు ద్వారా నీటిని ఎత్తిపోస్తే గత ఆరోపణలు అసత్యమని తేలిపోతాయనే ఉద్దేశంతోనే పంపులను ప్రారంభించడంలో ఆసక్తి చూపడం లేదని ఆరోపించారు. ఏడు జిల్లాల్లోని దాదాపు 40 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతోనే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మేడిగడ్డ బ్యారేజీని నిర్మించారని గుర్తు చేశారు.

గోదావరి–ప్రాణహిత సంగమ ప్రాంతంలో నిర్మించిన ఈ బ్యారేజీ ద్వారా ఎప్పటికప్పుడు నీటిని నిల్వ చేసుకునే అవకాశం ఉందన్నారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్.డి.ఎస్.ఏ) నివేదిక ప్రకారం మేడిగడ్డ బ్యారేజీకి మరమ్మతులు చేయవచ్చని, కుంగిన ఒక పిల్లర్‌కు సంబంధించిన బ్లాక్‌ను పునర్నిర్మించడానికి సుమారు రూ.300–400 కోట్లు మాత్రమే అవసరమని తెలిపారు.

నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టి కూడా మరమ్మతులు చేసేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ ప్రభుత్వం స్పందించడం లేదని విమర్శించారు. తెలంగాణ ఉద్యమంలో ఇరిగేషన్ ఇంజనీర్లు, జర్నలిస్టులు కీలక పాత్ర పోషించారని, అలాంటి వారిని గౌరవించాల్సింది పోయి అవమానించడం సరికాదన్నారు. రైతుల ఆందోళనలను దృష్టిలో ఉంచుకుని వెంటనే కన్నెపల్లి పంప్‌హౌస్ మోటార్లను ప్రారంభించి జలాశయాలను నింపి ఖరీఫ్ సాగుకు నీరు అందించాలని ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ డిమాండ్ చేశారు.

ఈ సమావేశంలో మాజీ మేయర్, రాష్ట్ర సివిల్ సప్లయ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ సర్ధార్ రవీందర్ సింగ్, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్ సింగ్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఓరుగంటి రమణారావు, ముత్యాల బలరాం రెడ్డి, ఏలేటి కృష్ణారెడ్డి పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు