Karimnagar : వర్షంలోనూ.. తీగలగుట్టపల్లి ఆర్వోబీ పనులపై మేయర్, కమిషనర్ ఆకస్మిక తనిఖీ.. కీలక ఆదేశాలు..!
కరీంనగర్ నగరంలోని తీగలగుట్టపల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్వోబీ) నిర్మాణ పనుల్లో నెలకొన్న జాప్యం, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల నేపథ్యంలో నగర మేయర్ కొలగాని శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ గురువారం ఆకస్మికంగా నిర్మాణ ప్రాంతాన్ని సందర్శించి పరిస్థితిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

Karimnagar : వర్షంలోనూ.. తీగలగుట్టపల్లి ఆర్వోబీ పనులపై మేయర్, కమిషనర్ ఆకస్మిక తనిఖీ.. కీలక ఆదేశాలు..!
కరీంనగర్, మనసాక్షి :
కరీంనగర్ నగరంలోని తీగలగుట్టపల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్వోబీ) నిర్మాణ పనుల్లో నెలకొన్న జాప్యం, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల నేపథ్యంలో నగర మేయర్ కొలగాని శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ గురువారం ఆకస్మికంగా నిర్మాణ ప్రాంతాన్ని సందర్శించి పరిస్థితిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఇటీవల ఆర్వోబీ సమీపంలోని కల్వర్టులో ఓ వృద్ధురాలు పడిపోయిన ఘటనపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ సంబంధిత ఆర్&బీ అధికారులు, కాంట్రాక్టర్లతో మాట్లాడి ప్రజలకు ఇబ్బందులు లేకుండా తక్షణ ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
అనంతరం న్యూఢిల్లీ నుంచి మేయర్ కొలగాని శ్రీనివాస్‌తో ఫోన్లో మాట్లాడి, మున్సిపల్ కార్పొరేషన్ తరఫున అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. దీంతో మేయర్ వెంటనే సంఘటన స్థలాన్ని పరిశీలించి తాత్కాలిక పరిష్కారంగా బారికేడ్లు ఏర్పాటు చేసి ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టారు. అనంతరం మేయర్ కొలగాని శ్రీనివాస్, కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, ఏసీపీ విజయ్ కుమార్ ఆర్వోబీ నిర్మాణ ప్రాంతానికి చేరుకుని బీటీ రోడ్డు, కల్వర్టు పరిస్థితిని పరిశీలించారు.
ప్రజలు ఎదుర్కొంటున్న రాకపోకల ఇబ్బందులను ప్రత్యక్షంగా గమనించిన మేయర్, రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు అందుబాటులో లేకపోయినా కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలోనే బీటీ రోడ్డు, కల్వర్టు నిర్మాణ పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని నిర్ణయించారు. సంబంధిత అధికారులకు వెంటనే పనులు ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆర్&బీ అధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ ఆర్వోబీ నిర్మాణంలో ప్రధాన అడ్డంకి భూసేకరణ జాప్యమేనని వివరించారు. గత ప్రభుత్వ హయాంలో భూసేకరణ పూర్తికాకపోవడంతో పనులు ఆలస్యమయ్యాయని, ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేస్తూ త్వరలో నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు తెలిపారు.
అలాగే ఆర్వోబీ నిర్మాణ సమయంలో ప్రజల రాకపోకలకు ప్రత్యామ్నాయంగా చేపట్టాల్సిన బీటీ రోడ్డు, కల్వర్టు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో ఆ పనులు నిలిచిపోయినట్లు అధికారులు వెల్లడించారు. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వ సేతు బంధన్ పథకం కింద ఆర్వోబీ నిర్మాణానికి అవసరమైన నిధులు పూర్తిగా విడుదల చేసినప్పటికీ పనులు ఎందుకు ఆలస్యం అవుతున్నాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ కాంట్రాక్టర్‌ను ప్రశ్నించారు.
దీనికి స్పందించిన నిర్మాణ సంస్థ ప్రతినిధులు భూసేకరణ ప్రక్రియ పూర్తికాగానే పనులు వేగవంతం చేస్తామని, వచ్చే ఆరు నెలల్లో ఒక వైపు ఆర్వోబీ నిర్మాణాన్ని పూర్తి చేసి, ఒప్పందం ప్రకారం వచ్చే ఏడాదిలోపు మొత్తం ఆర్వోబీ నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. అలాగే నగరంలోని పలు డివిజన్లలో వర్షాల ప్రభావానికి గురైన ప్రాంతాలను కూడా మేయర్ పరిశీలించి, అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా మేయర్ కొలగాని శ్రీనివాస్ మాట్లాడుతూ, ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని, ప్రభుత్వాల మధ్య నిధుల అంశం ఎలా ఉన్నప్పటికీ నగర ప్రజలు ఇబ్బందులు పడకుండా మున్సిపల్ కార్పొరేషన్ తరఫున అవసరమైన బీటీ రోడ్డు, కల్వర్టు నిర్మాణ పనులను అత్యవసరంగా చేపడతామని స్పష్టం చేశారు. పనుల పురోగతిపై నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తూ ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ తనిఖీలో మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, ఐఏఎస్, ఏసీపీ విజయ్ కుమార్, సీఐ నిరంజన్ రెడ్డి, ఎస్సై లక్ష్మారెడ్డి, ఆర్ అండ్ బీ అధికారులు, మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.









