Karimnagar : కరీంనగర్ లో ఉద్రిక్తత.. డిఈఓ కార్యాలయం ముట్టడి..!
రాష్ట్ర ప్రభుత్వం 23 వేల ప్రభుత్వ పాఠశాలలను మూసివేయాలనే ఆలోచనను తక్షణమే విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) కరీంనగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో గురువారం జిల్లా విద్యాధికారి (డి.ఈ.ఓ) కార్యాలయాన్ని ముట్టడించారు.

Karimnagar : కరీంనగర్ లో ఉద్రిక్తత.. డిఈఓ కార్యాలయం ముట్టడి..!
-
డీఈఓ కార్యాలయం ఎదుట ఏబీవీపీ భారీ ముట్టడి
-
ముట్టడి ఉద్రిక్తం.. ఏబీవీపీ నాయకులను అరెస్ట్ చేసిన పోలీసులు
-
ఫీజుల నియంత్రణ చట్టాన్ని తక్షణమే అమలు చేయాలని పూసాల విష్ణు డిమాండ్
కరీంనగర్, మనసాక్షి :
రాష్ట్ర ప్రభుత్వం 23 వేల ప్రభుత్వ పాఠశాలలను మూసివేయాలనే ఆలోచనను తక్షణమే విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) కరీంనగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో గురువారం జిల్లా విద్యాధికారి (డి.ఈ.ఓ) కార్యాలయాన్ని ముట్టడించారు. రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా చేపట్టిన ఈ నిరసన కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో విద్యార్థులు, ఏబీవీపీ నాయకులు తరలివచ్చారు. కార్యాలయంలోకి చొచ్చుకుపోయేందుకు ప్రయత్నించిన ఏబీవీపీ నాయకులను పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
ఈ క్రమంలో పోలీసులు ఏబీవీపీ నాయకులను, కార్యకర్తలను బలవంతంగా ఈడ్చుకెళ్లి అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. అరెస్టులకు ముందు ఏబీవీపీ కరీంనగర్ జిల్లా కన్వీనర్ పూసాల విష్ణు మాట్లాడుతూ తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో కనీస మౌలిక వసతులు కరువయ్యాయని మండిపడ్డారు. ఉపాధ్యాయుల ఖాళీలు, తాగునీటి సమస్య, మరుగుదొడ్లు, బెంచీల కొరతతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. నూతన విద్యా సంవత్సరం ప్రారంభమైనందున విద్యార్థులందరికీ పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్లు సకాలంలో అందేలా విద్యాశాఖ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
మరోవైపు ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలు ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తూ విద్యా వ్యాపారానికి పాల్పడుతున్నాయని, తల్లిదండ్రులపై మోయలేని భారం మోపుతున్నాయని విమర్శించారు. ప్రభుత్వం తక్షణమే ఫీజు నియంత్రణ చట్టాన్ని కఠినంగా అమలు చేసి, నిబంధనలు ఉల్లంఘించే పాఠశాలలపై చర్యలు తీసుకోవాలన్నారు. విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రైవేట్ స్కూళ్లలో పేద విద్యార్థులకు 25 శాతం ఉచిత సీట్ల కేటాయింపును విధిగా అమలు చేయాలన్నారు.
పోలీసులను అడ్డుపెట్టుకొని విద్యార్థి ఉద్యమాలను అణచివేయలేరని, డీఈఓ వెంటనే స్పందించకపోతే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. ఈ ముట్టడి కార్యక్రమంలో అరెస్ట్ అయిన వారిలో ఏబీవీపీ రాష్ట్ర హాస్టల్స్ కో-కన్వీనర్ బామాండ్ల నందు, రాష్ట్ర ఎస్.ఎఫ్.డి కో-కన్వీనర్ గోసుకుల అజయ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ముసరి మురళి, నగర కార్యదర్శి చిప్ప యోగేష్, జిల్లా ఎస్.ఎఫ్.డి ఇంచార్జ్ వంశీ, జిల్లా హాస్టల్స్ ఇంచార్జ్ విగ్నేష్, జిల్లా ఖేల్ ఇంచార్జ్ విష్ణు, నాయకులు ఆకాష్, శేఖర్, యశ్వంత్, సాయిరాజ్ తదితరులు ఉన్నారు.











