బురద గుంతలో దిగబడ్డ స్కూల్ బస్సు..!

బురద గుంతలో దిగబడ్డ స్కూల్ బస్సు..!
కరీంనగర్, మనసాక్షి :
కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలోని రేకుర్తి సమ్మక్క గద్దేల సమీపంలో రహదారుల దుస్థితి అధ్వాన్నంగా మారింది. ఇటీవల కురుస్తున్న వర్షాల కారణంగా ఈ ప్రాంతంలో రహదారులు అధ్వాన్నంగా మారాయి. శుక్రవారం స్కూల్ పిల్లలతో రోడ్డుపై వెళ్తున్న సెయింట్ జార్జ్ ఇంటర్నేషనల్ పాఠశాల బస్సు ఒక్కసారిగా సమ్మక్క గద్దెల సమీపంలోని లోతైన బురద గుంతలో దిగబడింది.
రోడ్డుకు అడ్డంగా బస్సు చిక్కుకుపోవడంతో లోపల ఉన్న విద్యార్థులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. చాలాసేపటి వరకు బస్సు కదలకపోవడంతో, చివరకు స్థానికుల సహాయంతో బస్సును బురద నుండి బయటకు తీశారు. ఈ సంఘటన కారణంగా స్కూల్ పిల్లలు తీవ్ర ఇబ్బంది పడటమే కాకుండా, వారు పాఠశాలకు వెళ్లడానికి చాలా సమయం ఆలస్యం అయింది.
బస్సు రోడ్డుకు అడ్డంగా నిలిచిపోవడంతో ఇతర వాహనదారులు కూడా ఇబ్బంది పడ్డారు. రహదారి నిండా గుంతలు పడి, చెరువులను తలపిస్తున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు మండిపడుతున్నారు. ఈ తీవ్రమైన సమస్యపై ఇటీవలే స్థానిక ప్రజాప్రతినిధులకు, మున్సిపల్ అధికారులకు డివిజన్ ప్రజలు రాతపూర్వకంగా వినతిపత్రం అందించారు.
అయినప్పటికీ, ఇప్పటివరకు అధికారుల నుండి ఎలాంటి స్పందన కానీ, కనీస తాత్కాలిక మరమ్మతు చర్యలు కానీ చేపట్టకపోవడం గమనార్హం. స్మార్ట్ సిటీ నిధుల పేరుతో గొప్పలు చెప్పుకుంటున్న పాలకులు, క్షేత్రస్థాయిలో విద్యార్థులు పడుతున్న ఇబ్బందులను ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
అధికారులు, ప్రజాప్రతినిధులు ఏదైనా పెద్ద ప్రమాదం జరిగే వరకు ఎదురు చూస్తున్నారా? అని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి, రేకుర్తి సమ్మక్క గద్దేల సమీపంలోని రోడ్డుకు శాశ్వత మరమ్మతులు చేపట్టి, ప్రమాదాలు జరగకముందే విద్యార్థులను, స్థానికులను రక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.









