Talent : ఈ కూలీ బిడ్డల కష్టం ఫలించింది

Talent : ఈ కూలీ బిడ్డల కష్టం ఫలించింది

కంగ్టి,మన సాక్షి :

 

ఈ విద్యార్థులు తల్లిదండ్రుల ఆశలు నెరవేర్చారు. కూలికి వెళ్తేనే పొట్ట నింపుకునే ఆ కుటుంబం బిడ్డల ప్రతిభను చూసి ఆనంద వ్యక్తం చేస్తున్నారు. త్రిబుల్ ఐటీ ఫలితాల్లో సీటు సాధించి ప్రతిభని చాటారు.

 

త్రిబుల్ ఐటీ ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా తమ ప్రతిభను చాటి పాఠశాల ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చి పెట్టారని నోడల్ అధికారి రహీముద్దీన్ విలేకరులతో తెలిపారు.

 

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గ పరిధిలోని కంగ్టి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని విద్యార్థులు ఎన్. పండరి రెడ్డి, పి. యోగిత, తడ్కల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థి సాయి చరణ్ త్రిబుల్ ఐటీకి ఎంపికయ్యారని కంగ్టి పాఠశాల ప్రధానోపాధ్యాయులు విట్టల్ నాయక్ తెలిపారు.

 

నిత్యం వ్యవసాయ కూలీ పనులు చేసుకుంటూ పిల్లలను పోషించుకుంటున్న తల్లిదండ్రుల కష్టాల్ని తమ పిల్లలు వృధా పోనివ్వలేరని సంతోషం వ్యక్తం చేశారు. ప్రైవేట్ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు సవాలుగా త్రిబుల్ ఐటీకి ఎంపికైన విద్యార్థులు స్ఫూర్తిగా నిలిచారని ఉపాధ్యాయులు వారిని అభినందించారు.

 

ఉపాధ్యాయులు ప్రణాళిక బద్ధంగా నేర్పిన పాఠాలే తమని ఈ స్థాయికి ఎదిగేలా చేశాయని త్రిబుల్ ఐటీకి ఎంపికైన విద్యార్థులు తమ గురువులకు కృతజ్ఞతలు తెలిపారు.