కరీంనగర్‌లో మాటల యుద్ధం.. బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ..!
కరీంనగర్ నగరపాలక సంస్థలో బిల్లింగ్ అనుమతుల వ్యవహారం బీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య రాజకీయ వివాదానికి దారితీసింది.

కరీంనగర్‌లో మాటల యుద్ధం.. బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ..!
కార్పొరేషన్ కేంద్రంగా ఆరోపణల యుద్ధం.
భవన అనుమతుల వ్యవహారంపై రాజకీయ దుమారం
అవినీతి ఆరోపణలు.. పరస్పర విమర్శలతో వేడెక్కిన నగర రాజకీయాలు
ప్రజలకు కావాల్సింది అభివృద్ధి.. పార్టీలకు కావాల్సింది ఆధిపత్యమా?
(కరీంనగర్ బ్యూరో – నరేష్ , మనసాక్షి)
కరీంనగర్ నగరపాలక సంస్థలో బిల్లింగ్ అనుమతుల వ్యవహారం బీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య రాజకీయ వివాదానికి దారితీసింది. భవన నిర్మాణ అనుమతులు, బిల్లింగ్ వ్యవహారాల్లో డబ్బులు వసూలు చేస్తున్నారంటూ ఒక పార్టీ నేతలు ఆరోపణలు చేయగా.. మరో పార్టీ నేతలు గత పాలనలో జరిగిన వ్యవహారాలను ప్రస్తావిస్తూ కౌంటర్ విమర్శలకు దిగుతున్నారు. దీంతో రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.
ఆరోపణలకు బీజేపీ కౌంటర్..
బీఆర్ఎస్ ఆరోపణలను బీజేపీ కార్పొరేటర్లు బండారి వేణు, సోమిడి వేణు తీవ్రంగా ఖండించారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో కొందరు కార్పొరేటర్లు అవినీతి, భూకబ్జాలు, అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. డబ్బుల కోసం ఇసుక, రాయి, కంకర, నిర్మాణ అనుమతుల పేరుతో ప్రజలను ఇబ్బందులకు గురిచేసిన చరిత్ర గత పాలకులదేనని విమర్శించారు. బీఆర్ఎస్ నేతలు తమ పాలకవర్గంపై నిరాధార ఆరోపణలు చేస్తూ రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని మండిపడ్డారు.
Also Read : చిల్లర కోసం కండక్టర్ ను బస్సు నుంచి కిందికి నెట్టివేసిన ప్యాసింజర్.. చికిత్స పొందుతూ కండక్టర్ మృతి..!
రూ.100 కోట్ల నిధులపై బీఆర్ఎస్ ప్రశ్నలు..
అంతకుముందు బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ మాట్లాడుతూ.. నగరపాలక సంస్థలో జనరల్ ఫండ్, యూఏడీఎఫ్ నిధులు కలిపి సుమారు రూ.100 కోట్లు ఖర్చు చేసినట్లు చెబుతున్నా క్షేత్రస్థాయిలో అభివృద్ధి కనిపించడం లేదని ఆరోపించారు. భవన నిర్మాణ అనుమతుల కోసం కొందరు బీజేపీ కార్పొరేటర్లు డబ్బులు డిమాండ్ చేస్తున్నారనే ఆరోపణలపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. తమ వద్ద ఆడియో, వీడియో ఆధారాలు ఉన్నాయని, భవన నిర్మాణ అనుమతులు పొందిన వారిని విచారిస్తే వాస్తవాలు బయటపడతాయని పేర్కొన్నారు.
రాజకీయ విమర్శల నుంచి విచారణ డిమాండ్ల వరకు..
మరోవైపు కేంద్ర మంత్రి బండి సంజయ్ సైతం అవినీతికి పాల్పడే కార్పొరేటర్లను ఉపేక్షించేది లేదని, డబ్బుల వసూళ్లకు పాల్పడితే బ్లాక్‌లిస్టులో పెడతామని హెచ్చరించిన వ్యాఖ్యలనే ప్రస్తావిస్తూ బీఆర్ఎస్ నేతలు బీజేపీ పాలకవర్గంపై ప్రశ్నలు సంధిస్తున్నారు.
అసలు వాస్తవాలు తేలేదెప్పుడు.?
రెండు పార్టీల నేతలు ఒకరిపై మరొకరు అవినీతి ఆరోపణలు చేసుకుంటుండగా.. ప్రజలకు మాత్రం అసలు వాస్తవాలు ఏమిటన్న ప్రశ్న ఎదురవుతోంది. భవన నిర్మాణ అనుమతుల పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణల్లో నిజమెంత? గత పాలకవర్గంపై చేస్తున్న ఆరోపణలకు ఆధారాలున్నాయా? నగరపాలక సంస్థ నిధుల వినియోగం, పనుల కేటాయింపులు, బిల్లుల చెల్లింపులపై సమగ్ర విచారణ జరిగితేనే వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.









