Suryapet : 12 గంటల్లో హత్య కేసు ఛేదించిన సూర్యాపేట పోలీసులు..!
సూర్యాపేట జిల్లా రూరల్ పరిధిలోని సోలిపేట గ్రామంలో జరిగిన మేకల జయరాములు హత్య కేసును పోలీసులు కేవలం 12 గంటల్లోనే ఛేదించి ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ నరసింహ తెలిపారు.

Suryapet : 12 గంటల్లో హత్య కేసు ఛేదించిన సూర్యాపేట పోలీసులు..!
వివరాలు వెల్లడించిన ఎస్పీ నరసింహ
సూర్యాపేట, మనసాక్షి :
సూర్యాపేట జిల్లా రూరల్ పరిధిలోని సోలిపేట గ్రామంలో జరిగిన మేకల జయరాములు హత్య కేసును పోలీసులు కేవలం 12 గంటల్లోనే ఛేదించి ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ నరసింహ తెలిపారు. మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన కేసు వివరాలను వెల్లడించారు.ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం..
మృతుడు జయరాములు తనకు వారసత్వంగా వచ్చిన మూడు ఎకరాల భూమిని గతంలో తన తమ్ముడు కృష్ణయ్యకు కౌలుకు ఇచ్చాడని, అనంతరం తిరిగి స్వయంగా సాగు చేసుకోవడం ప్రారంభించడంతో కుటుంబ సభ్యుల మధ్య భూమి, గెట్టు, ఇంటి హద్దుల విషయంలో తరచూ వివాదాలు నెలకొన్నాయని తెలిపారు.ఈ క్రమంలో నిందితులు మేకల కిరణ్, అతని భార్య మౌనిక, కిరణ్ తల్లిదండ్రులు కృష్ణయ్య, లక్ష్మమ్మ, మరో వ్యక్తి రామచంద్రు కలిసి జయరాములను హత్య చేయాలని ముందుగానే పథకం రచించినట్లు ఎస్పీ వెల్లడించారు.
సోమవారం సాయంత్రం జయరాములు పొలం వద్దకు వచ్చిన సమయంలో గ్రామ ఆర్చ్ సమీపంలో అడ్డగించి గొడ్డలితో దాడి చేసి హత్య చేసినట్లు తెలిపారు.హత్య అనంతరం నిందితులు గ్రామం విడిచి పారిపోయారని, కేసు నమోదు చేసిన వెంటనే ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి సూర్యాపేట హైటెక్ బస్ స్టాండ్ వద్ద నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు. విచారణలో నిందితులు నేరాన్ని అంగీకరించినట్లు తెలిపారు.
వారి వద్ద నుంచి హత్యకు ఉపయోగించిన గొడ్డలి, నాలుగు సెల్ ఫోన్లు, ఒక స్కూటర్‌ను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. నిందితులకు గతంలో ఎలాంటి నేర చరిత్ర లేదన్నారు.భూమి, ఆస్తి తగాదాలను చట్టపరంగా పరిష్కరించుకోవాలని, ఓర్పు కోల్పోయి హత్యలకు పాల్పడితే కఠిన శిక్షలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు.
భూమి వివాదాల కేసుల్లో నిందితులకు జీవిత ఖైదు శిక్షలు కూడా పడుతున్నాయని గుర్తుచేశారు.కేసును వేగంగా ఛేదించిన డీఎస్పీ ప్రసన్నకుమార్, రూరల్ సీఐ రాజశేఖర్, ఎస్సై బాలు నాయక్ పోలీసు సిబ్బందిని ఎస్పీ అభినందించారు.









