పిడుగుపాటుకు గురై 11 ఏళ్ల బాలుడు మృతి..!
కరీంనగర్ లోని లోయర్ మానేరు డ్యాం సమీపంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మేకలు కాస్తున్న ఓ బాలుడు పిడుగుపాటుకు గురై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

పిడుగుపాటుకు గురై 11 ఏళ్ల బాలుడు మృతి..!
కరీంనగర్,, మనసాక్షి :
కరీంనగర్ లోని లోయర్ మానేరు డ్యాం సమీపంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మేకలు కాస్తున్న ఓ బాలుడు పిడుగుపాటుకు గురై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. కొత్తపల్లి సీఐ బిల్ల కోటేష్ తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్ గోదాంగడ్డకు చెందిన పోతు ప్రణీత్ (11) అనే బాలుడు తన తాత అయిన ముత్తయ్యతో కలిసి మానేరు డ్యాం పరిసర ప్రాంతాల్లో మేకలను మేపడానికి వెళ్లాడు.
ఆ సమయంలో అకస్మాత్తుగా వాతావరణం మారిపోయి, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. అదే సమయంలో డ్యాం సమీపంలో ఒక్కసారిగా పెద్ద పిడుగు పడటంతో ప్రణీత్ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు.
గమనించిన బాలుడి తాత స్థానికుల సహాయంతో వెంటనే అత్యవసర చికిత్స నిమిత్తం కరీంనగర్ లోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి తరలించారు. అయితే, ఆసుపత్రిలో పరీక్షించిన వైద్యులు బాలుడు అప్పటికే మరణించినట్లు ధృవీకరించారు. ఈ ఘటన పై మృతుడి తల్లి సునీత ఇచ్చిన ఫిర్యాదు కొత్తపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
వర్షాలు పడుతున్న సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చెట్ల కిందకు, బహిరంగ ప్రదేశాల్లోకి వెళ్లవద్దని, సురక్షిత ప్రాంతాల్లో ఆశ్రయం పొందాలని అధికారులు ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నారు.










