Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండవ్యవసాయం

Nagarjunasagar : నాగార్జునసాగర్ డ్యామ్ 16 గేట్ల ఎత్తి నీటి విడుదల.. ఎడమ కాలువకు రెండు పంటలకు నీళ్లు..! 

Nagarjunasagar : నాగార్జునసాగర్ డ్యామ్ 16 గేట్ల ఎత్తి నీటి విడుదల.. ఎడమ కాలువకు రెండు పంటలకు నీళ్లు..! 

నాగార్జునసాగర్ ,ఆగస్టు, 05, మన సాక్షి :

నాగార్జునసాగర్ కు శ్రీశైలం నుండి భారీగా వరద నీరు వచ్చి చేరుకుంటుండడంతో సాగర్ రిజర్వాయర్ నిండుకుండలా మారింది.. సాగర్ నీటిమట్టం గణనీయంగా పెరిగింది.. దీంతో సాగర్ ప్రాజెక్టు గేట్లను సోమవారం ఉదయం 11 గంటలకు సాంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించిన అనంతరం నాగార్జునసాగర్ ప్రాజెక్టు నల్లగొండ ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్ నాగేశ్వరరావు స్విచ్ ఆన్ చేసి గేట్ల నెత్తి దిగువనకు నీటి విడుదల చేశారు . అనంతరం కృష్ణవేణి తల్లికి వాయనం అందజేశారు.
నాగార్జునసాగర్‌కు భారీగా వరద వస్తున్న నేపథ్యంలో మొదట ఆరు గేట్లను ఎత్తి అధికారులు నీటిని విడుదల చేస్తూ క్రమంగా సోమవారం సాయంత్రానికి 16 గేట్లను ఎత్తి దిగులకు భారీగా నెటి విడుదల చేస్తున్నారు.

నాగర్జున సాగర్ ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో లోతట్టు ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.కృష్ణ బేసిన్‌లో అన్ని ప్రాజెక్టులు నిండుకుండల్లా కళకళలాడుతున్నాయి ‌.. ఆల్మట్టి, నారాయణ్‌పూర్ , జూరాల, తుంగభద్ర, శ్రీశైలం.. అన్ని ప్రాజెక్టులు నిండుకుండల్లా మారడంతో అక్కడి నుంచి వరదంతా ఇప్పుడు నాగార్జున సాగర్‌కి వచ్చి చేరుతోంది. దీంతో.. 2 ఏళ్ల తర్వాత నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు గేట్లను ఎత్తారు. చివరి సారిగా.. 2022 ఆగస్ట్‌ 11 న క్రస్ట్‌గేట్లను ఎత్తారు..

గత సంవత్సరం సాగరకు వరద నీరు చేరుకోకపోవడంతో సాగర్ ప్రాజెక్టులో జలకళ కనిపించలేదు వర్షాభావ పరిస్థితులు వచ్చాయి. ఈ సారి వర్షాలు కురవడం, ఎగువనుంచి వరదనీరు పోటెత్తడంతో, అటు శ్రీశైలం, ఇటు నాగార్జునసాగర్‌ నిండుకుండల్లా కనిపిస్తున్నాయి.

ప్రస్తుతం నాగార్జున సాగర్ జలాశయానికి ఎగువ నుండి మూడు లక్షల 24 వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా నాగార్జునసాగర్ 16 క్రస్ట్ గేట్లను ఐదు అడుగుల మేరకు ఎత్తి 1, 20, 000 క్యూసెక్కుల నీటిని, ప్రధాన జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ద్వారా 29 వేల క్యూసెక్కుల నీటిని, కుడి కాలువ ద్వారా 8500 క్యూసెక్కులను, ఎడమ కాలువ ద్వారా 4500 క్యూసెక్కులను, ఎస్ఎల్బీసీ ద్వారా 1800 క్యూసెక్కులను, వరద కాలువ ద్వారా 600 క్యూసెక్కులను మొత్తముగా నాగార్జునసాగర్ జలాశయం నుండి 1, 64 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఎగువ నుండి వస్తున్న వరద నీరు పెరుగుతూ ఉండడంతో సాగర్ డ్యామ్ గేట్లను మరికొన్ని పెంచి దిగువనకు నీటిని విడుదల చేయనున్నారు.

సాగర్ ఎడమ కాలువ ఆయకట్టుకు రెండు పంటలకు నీరు : జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి 

నాగార్జునసాగర్ ప్రాజెక్టు పరిధిలోని ఎడమ కాలువ ఆయకట్టుకు ఈ ఏటా రెండు పంటలకు గాను పూర్తిస్థాయిలో సాగునీరు అందిస్తామని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి తెలిపారు. నాగార్జునసాగర్ జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకోవడంతో సోమవారం ఆయన కృష్ణవేణికి పూజలు నిర్వహించిన అనంతరం నాగార్జున సాగర్ ప్రాజక్ట్ క్రెస్ట్ గేట్లను తెరిచి నీటిని దిగువకు విడుదల చేశారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ప్రస్తుతం ప్రాజక్ట్ 8 గేట్లును 5 ఫీట్ల ఎత్తు తెరవడం జరిగిందని, సాయంత్రం వరకు మొత్తం 16 గేట్లను తెరవనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఇదివరకే నాగార్జున సాగర్ ప్రాజక్ట్ ఎడమ కాలువ ద్వారా పూర్తిగా సాగు కోసం నీటీని వదలడం జరిగిందని, గత సంవత్సరం సాగునీరు లేనందున నీటిని వదలలేదని ,ఈసారి సాగునీటిని వదిలినందున ఆయకట్టు రైతులందరూ సంతోషంగా ఉన్నారని,

ప్రస్తుతం రిజర్వాయర్లో ఉన్న నీటి సామర్థ్యం ఆధారంగా ఈ సంవత్సరం పంటలకు పూర్తిస్థాయిలో నీటిని అందించనున్నట్లు తెలిపారు. కాలువలకు సాగునీటిని కొంచెం కొంచెంగా విడుదల చేస్తున్నామని, ఎక్కడైనా కాలువలు బలహీనంగా ఉన్నచోట గుర్తించి వాటికి మరమ్మతులు చేస్తూ మూడు, నాలుగు రోజుల్లో పూర్తిస్థాయిలో సాగునీటిని వదలనున్నట్లు ఆయన చెప్పారు. అలాగే చేరువులన్ని నింపుతామన్నారు. ఆయకట్టు రైతులందరూ సాగునీటిని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు.

ప్రస్తుతం సాగర్లో 584 అడుగుల మేర నీరు ఉందని, 16 గేట్ల ద్వారా రెండు లక్షల క్యూసెక్కుల పైగా నీటిని కిందికి వదిలేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకోవడం జరిగిందని, శ్రీశైలం ప్రాజెక్టు నుండి వచ్చే వరద ఆధారంగా నీటి విడుదలను పెంచడం ,తగ్గించడం జరుగుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు. నాగార్జునసాగర్ క్రెస్ట్ గేట్లను ఎత్తివేసినందున నది పరివాహక ప్రాంతంలోని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా నదిలోకి స్థానానికి గాని, ఈతకు వెళ్లవద్దని, మత్స్యకారులు చేపలు పట్టేందుకు నది లోకి వెళ్ళవద్దని ,పశువులు ,గేదేలు, మేకల వంటి వాటిని నదిలోకి తీసుకువెళ్లకూడదని ఆయన హెచ్చరించారు.

నాగార్జునసాగర్ కు పై నుండి వస్తున్న వరదను దృష్టిలో ఉంచుకొని గేట్లు ఎత్తే విషయాన్ని ముందుగానే ఆదివారం నుండి ప్రజలను అప్రమత్తం చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు. ఆయన వెంట నాగార్జున సాగర్ ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ నాగేశ్వరరావు ,ఈఈ మల్లికార్జునరావు, తదితరులు ఉన్నారు .

మరిన్ని వార్తలు