Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Uncategorized

Nalgonda : ధాన్యం సేకరణలో రైస్ మిల్లర్లు పూర్తి సహకారం అందించాలి.. రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి ఆదేశం..!

రబీ ధాన్యం సేకరణ మార్గదర్శకాలను పాటించడంలో రైస్ మిల్లర్లు పూర్తి సహకారం అందించాల్సిన అవసరం ఉందని రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ ఎం. కోదండ రెడ్డి అన్నారు.

Nalgonda : ధాన్యం సేకరణలో రైస్ మిల్లర్లు పూర్తి సహకారం అందించాలి.. రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి ఆదేశం..!

నల్లగొండ, మనసాక్షి :

రబీ ధాన్యం సేకరణ మార్గదర్శకాలను పాటించడంలో రైస్ మిల్లర్లు పూర్తి సహకారం అందించాల్సిన అవసరం ఉందని రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ ఎం. కోదండ రెడ్డి అన్నారు. శనివారం ఆయన నల్గొండ కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో రైస్ మిల్లర్లు, రైతు సంఘాల ప్రతినిధులు , ధాన్యం సేకరణ అధికారులతో సమీక్ష నిర్వహించారు.

రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడా లేని విధంగా రైతులకు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నదని, రైతుబంధు, రైతు బీమా తో పాటు, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నదని, అందువల్ల ధాన్యం కొనుగోలులో ఎట్టి పరిస్థితులలో రైతుని ఇబ్బంది పెట్టడానికి వీలు లేదని అన్నారు . అధికారులు,ప్రజా ప్రతినిధులు,మిల్లర్లు అందరూ రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉందని, ఈ విషయంలో పూర్తి సహకారం అందించాలని కోరారు. ఎఫ్ సి ఐ నిబంధనల ప్రకారమే ధాన్యం కొనుగోలు నిర్వహించడం జరుగుతున్నదని, అయితే రైతుకు, మిల్లర్లకు ఎలాంటి సంబంధం ఉండదని, కొనుగోలు కేంద్రానికి రైతుకు మాత్రమే సంబంధం ఉంటుందని, ఈ విషయంలో రైస్ మిల్లర్లు రైతులను ఇబ్బంది పెట్టకూడదని కోరారు.

తాలు, తరుగు వంటి సమస్యలు ఉంటే సంబంధిత అధికారుల ద్వారా చర్చించి పరిష్కరించుకోవాలని ఆయన మిల్లర్ల కు సూచించారు. ధాన్యం సేకరణ కేవలం సీజన్లో మాత్రమే ఉంటుందని, ఇది అందరి బాధ్యత అని, ధాన్యం కొనుగోలు జరిగినన్ని రోజులు అధికారులు క్షేత్రస్థాయిలో ఉండాలని, ధాన్యం కొనుగోలు కేంద్రాలలో అన్ని సౌకర్యాలు కల్పించాలని చెప్పారు.రైస్ మిల్లర్లకు సంబంధించి ఏమైనా సమస్యలు ఉంటే ప్రభుత్వ దృష్టికి తీసుకు వెళ్తామన్నారు. రైతులు కూడా నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని చెప్పారు. హరిత విప్లవం తర్వాత పెద్ద ఎత్తున ధాన్యం వస్తున్నందున ప్రతి సంవత్సరం సమస్యలు పెరుగుతున్నాయని, దీనిని దృష్టిలో ఉంచుకొని రైతులు సంప్రదాయ పంటల వైపు మల్లాల్సిన అవసరం ఉందని అన్నారు.

ఒకప్పుడు నల్గొండ జిల్లాలో 4 లక్షలు ఎకరాలలో బత్తాయి పండించగా, అది ఇప్పుడు 40 వేల ఎకరాలకు పడిపోయిందని, తిరిగి బత్తాయి పండించాలని, రైతులు సంఘటితంగా ఉండేందుకు రైతు ఉత్పాదక సంస్థలను ఏర్పాటు చేయాలని, రైతు ఎప్పుడు ఒంటరివాడిగా ఉండకూడదని అన్నారు. రైతాంగం కష్టాలలో ఉన్నప్పుడు వారి కష్టాలను దూరం చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందని, ఇందుకు అందరూ కృషి చేయాలన్నారు.ధాన్యం సేకరణలో రైతులు, అధికారులు, మిల్లర్ల మధ్య సమన్వయం ఉండాలని, అధికారులు వంతుల వారిగా క్షేత్రస్థాయిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి సమస్యలు తెలుసుకొని పరిష్కరించాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు.

మిల్లర్లకు సంబంధించిన బాయిల్డ్ రైస్ సమస్య ,ఇతర సమస్యలన్నింటిని రాష్ట్రస్థాయిలో చర్చించి అవసరమైతే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. రైతు కమిషన్ సభ్యులు చెవిటి వెంకన్న, నల్గొండ మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్,, రైతు కమిషన్ మెంబర్ సెక్రెటరీ గోపాల్ మాట్లాడారు.

సమావేశం ప్రారంభమైన వెంటనే రెవెన్యూ. అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్ మాట్లాడుతూ నల్గొండ జిల్లాలో ఈ యసంగి లో 5,58,000 ఎకరాలలో వరి పంట సాగు చేయడం జరిగిందని, ఇందులో 3,80,000 ఎకరాలలో దొడ్డు ధాన్యం, లక్ష 70 వేల ఎకరాలలో సన్న ధాన్యం సాగు చేశారని, మొత్తం 14 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మార్కెట్ కు వస్తుందని అంచనా వేయడం జరిగిందని, ఇందుకుగాను జిల్లా వ్యాప్తంగా 439 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకున్నామని, గత సంవత్సరంతో పోలిస్తే 136 కేంద్రాలు అధికంగా ప్రతిపాదించామని, ఇప్పటి వరకు 330 కేంద్రాలు ప్రారంభించి 50 వేల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసినట్లు అయిన వెల్లడించారు.

మిల్లర్లు సమస్య వల్ల అన్లోడ్ కొంచెం ఆలస్యమైందని, శుక్రవారం చర్చల అనంతరం ఈ సమస్య పరిష్కారం అయిందని, ఇక అన్లోడ్ వేగవంతం అయ్యేందుకు ఆస్కారం ఉన్నట్టు ఆయన తెలిపారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో సౌకర్యాలన్ని కల్పించామని ,అవసరమైన లారీలను కూడా ఏర్పాటు చేస్తున్నామని ఆయన చెప్పారు.అనంతరం చైర్మన్ కోదండ రెడ్డి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ధాన్యం సేకరణలో ఎవరు రైతులను ఇబ్బంది పెట్టకూడదు అన్నది తమ ఉద్దేశమని ,అందువల్ల ప్రతి ఒక్కరూ రైతుకు సహకరించి సజావుగా ధాన్యం సేకరణ జరిగేలా చూడాలని కోరారు.

అంతకు ముందు చైర్మన్ సమీక్ష నిర్వహించేందుకు జిల్లా కలెక్టర్ కార్యాలయానికి రాగా జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ చైర్మన్ కు పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా ధాన్యం కొనుగోలు పై చర్చించారు. ప్రభుత్వం ధాన్యం సేకరణ విషయంలో జారీచేసిన నిబంధనలను కచ్చితంగా అమలు చేస్తే భవిష్యత్తులో రైతుకు మేలుకలుగుతుందని, కొనుగోలు కేంద్రాల నిర్వహకులు మిల్లర్లకు సంబంధం లేకుండా చూసుకోవాలని, తరుగు, తేమ పేరిట రైతులకు ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోలు కేంద్రంలోనే నిర్ణయం తీసుకోవాలని చైర్మన్ చెప్పారు .

ఈ సందర్భంగా చైర్మన్ భూభారతి పెండింగ్ దరఖాస్తులు, సాదా బైనామాల వివరాలను జిల్లా కలెక్టర్ ద్వారా అడిగి తెలుసుకున్నారు. జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ మాట్లాడుతూ మార్చి 15 వరకు భూభారతి పెండింగ్ దరఖాస్తులు పరిష్కరించామని మాత్రమే ఉన్నాయని సాదా బై నామ కేసులను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నట్లు తెలిపారు . ఆదర్శ రైతు రామిరెడ్డి ,రైస్ మిల్లర్ల సంఘం మిర్యాలగూడ కార్యదర్శి శ్రీనివాస్, నల్గొండ కార్యదర్శి భద్రాద్రి రాములు, మిల్లర్ల సమస్యలను సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. డిఆర్డిఓ శేఖర్ రెడ్డి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రవణ్ కుమార్, తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు.

మరిన్ని వార్తలు