Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsకరీంనగర్జిల్లా వార్తలుతెలంగాణరాజకీయం

Karimnagar : కరీంనగర్ చింతకుంట కెనాల్ వద్ద ఉద్రిక్తత..!

గణేశ్ నిమజ్జనానికి చింతకుంట కెనాల్‌కు ఎస్సారెస్పీ నుంచి నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ చేపట్టిన ధర్నా ఉద్రిక్తతకు దారితీసింది. చింతకుంట కెనాల్ వద్ద ధర్నాకు దిగిన బీజేపీ కార్యకర్తలు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

Karimnagar : కరీంనగర్ చింతకుంట కెనాల్ వద్ద ఉద్రిక్తత..!

బీజేపీ ధర్నా.. పోలీసులతో వాగ్వాదం

కార్యకర్తల అరెస్టు.. లాఠీఛార్జ్‌

కరీంనగర్ బ్యూరో, మనసాక్షి :

గణేశ్ నిమజ్జనానికి చింతకుంట కెనాల్‌కు ఎస్సారెస్పీ నుంచి నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ చేపట్టిన ధర్నా ఉద్రిక్తతకు దారితీసింది. చింతకుంట కెనాల్ వద్ద ధర్నాకు దిగిన బీజేపీ కార్యకర్తలు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు పలువురు కార్యకర్తలను అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు.

ధర్నా చేస్తున్న కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకునే క్రమంలో తోపులాట చోటుచేసుకుంది. పోలీసులు లాఠీఛార్జ్ చేశారని బీజేపీ నాయకులు ఆరోపించారు. ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు ఆకుల రాజేందర్‌పై పోలీసులు దాడి చేశారని, పలువురు కార్యకర్తలను గల్లా పట్టుకుని లాగి పడేశారని వారు ఆరోపించారు. ఏసీపీ విజయ్‌కుమార్, కొత్తపల్లి సీఐ కోటేశ్వర్ తీరుపై కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా కరీంనగర్ డిప్యూటీ మేయర్ సునీల్‌రావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు సాయిని మల్లేశం, కరీంనగర్ పార్లమెంట్ కన్వీనర్ బోయినిపల్లి ప్రవీణ్‌రావును పోలీసులు అరెస్టు చేసి బలవంతంగా స్టేషన్‌కు తరలించారు. గణేశ్ నిమజ్జనానికి నీటిని విడుదల చేయాలని కోరితే లాఠీలతో కొట్టడం ఏమిటని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సాయిని మల్లేశం ప్రశ్నించారు.

హిందూ పండుగలంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎందుకు అంత చులకన భావన అని నిలదీశారు. నీటిని విడుదల చేసే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. నిమజ్జనానికి నీటిని అడిగినందుకు బీజేపీ కార్యకర్తలపై లాఠీఛార్జ్ చేయడం హేయమని బీజేపీ కరీంనగర్ పార్లమెంట్ కన్వీనర్ బోయినిపల్లి ప్రవీణ్‌రావు అన్నారు. కార్యకర్తలు తలచుకుంటే కాంగ్రెస్ నేతలు రోడ్లపై తిరగలేరంటూ ఆయన వ్యాఖ్యానించారు.

నీటిని విడుదల చేసే వరకు పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. గణేశ్ నిమజ్జనం కోసం అర టీఎంసీ నీటిని అడిగితే ప్రభుత్వం స్పందించకపోవడం దుర్మార్గమని డిప్యూటీ మేయర్ సునీల్‌రావు అన్నారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కోదాడ, హుజూర్‌నగర్ ప్రాంతాలకు నీటిని తరలించుకుపోతున్నారని ఆరోపించారు.

ఆయన రాష్ట్ర మంత్రిగా ఉన్నారా? లేక కోదాడ, హుజూర్‌నగర్ మంత్రిగా ఉన్నారా? అని ప్రశ్నించారు. నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తిచేసినప్పటికీ నీటిని విడుదల చేయకపోవడం దారుణమన్నారు. నిమజ్జనానికి తక్షణమే నీటిని విడుదల చేయాలని, లేకుంటే పోరాటాన్ని కొనసాగిస్తామని తెలిపారు.

ప్రభుత్వం నీటి విడుదలకు నిర్ణయం

బీజేపీ ఆందోళన నేపథ్యంలో గణేశ్ నిమజ్జనానికి చింతకుంట కెనాల్‌కు ఎస్సారెస్పీ నుంచి నీటిని విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. తొలుత 500 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి. సాయంత్రం మరో 3 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయనున్నట్లు అధికారులు వెల్లడించినట్లు పేర్కొన్నారు.

విడుదలైన ఎస్సారెస్పీ జలాలు రేపు రాత్రిలోపు చింతకుంట కెనాల్‌కు చేరుకునే అవకాశం ఉందని తెలిపారు. దీంతో గణేశ్ నిమజ్జనానికి నీటి సమస్యపై బీజేపీ చేపట్టిన ఆందోళనకు ప్రభుత్వం నుంచి స్పందన లభించినట్లైంది.

మరిన్ని వార్తలు