TDP : టీడీపీలో ఐవీఆర్‌ఎస్‌ రగడ..!

టీడీపీలో ఐవీఆర్‌ఎస్‌ రగడ మొదలైంది. నియోజకవర్గంలోని ప్రజల ఫోన్లకు.... మదనపల్లె నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా మీరు ఎవరిని కోరుకుంటున్నారు.? జయరామనాయుడు అయితే..1 నొక్కండి.. నోటా అయితే రెండు నొక్కండి అంటూ.. రెండు వేర్వేరు నంబర్ల నుంచి ఫోన్లు వచ్చాయి.

TDP : టీడీపీలో ఐవీఆర్‌ఎస్‌ రగడ..!
అభ్యర్థి మార్పు దిశగా ప్రజాభిప్రాయసేకరణ
– కమ్మ సామాజికవర్గానికే కేటాయించేందుకు సన్నాహాలు
– తంబళ్లపల్లె, మదనపల్లెలో మార్పు తథ్యమంటున్న తమ్ముళ్లు

మదనపల్లె టౌన్, మనసాక్షి :

టీడీపీలో ఐవీఆర్‌ఎస్‌ రగడ మొదలైంది. నియోజకవర్గంలోని ప్రజల ఫోన్లకు…. మదనపల్లె నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా మీరు ఎవరిని కోరుకుంటున్నారు.? జయరామనాయుడు అయితే..1 నొక్కండి.. నోటా అయితే రెండు నొక్కండి అంటూ.. రెండు వేర్వేరు నంబర్ల నుంచి ఫోన్లు వచ్చాయి. దీంతో…ఇప్పటివరకు మదనపల్లె టీడీపీ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే షాజహాన్‌బాషానే అనుకుంటున్న తమ్ముళ్లు సందిగ్ధంలో పడ్డారు. ఇప్పటికే తంబళ్లపల్లెలో టీడీపీ అభ్యర్థిని మార్చే దిశగా ఆ పార్టీ తీవ్ర కసరత్తు చేస్తూ, అభ్యర్థుల అన్వేషణలో ఉన్న విషయం తెలిసిందే.

 

ఈ దరిమిలా మదనపల్లెలో టీడీపీ అభ్యర్థి షాజహాన్‌బాషాకు పార్టీ సీనియర్లు, ముఖ్యంగా కమ్మ సామాజిక వర్గానికి చెందిన నాయకులు సహకరించేది లేదని ఖరాఖండిగా చెప్పడంతో పాటు ఆయనకు వ్యతిరేకంగా పనిచేసేందుకు జట్టు కడుతున్నారు. మదనపల్లె ఎమ్మెల్యే సీటు ఒకసారి మైనారిటీ అభ్యర్థి దక్కించుకుంటే….భవిష్యత్తులో ఇక ఎప్పటికీ ఆ వర్గానికే రిజర్వ్‌ అవుతుందని, అదే జరిగితే…ఇక తమకు జీవితంలో పోటీ చేసే అవకాశం ఉండదని భావిస్తున్న కమ్మ టీడీపీ నాయకులు…ఎలాగైనా షాజహాన్‌బాషాను అభ్యర్థిత్వం నుంచి తప్పించేందుకు శతవిధాలుగా ప్రయత్నిస్తున్నారు.

 

ఇందులో భాగంగా ఇప్పటికే పలు సామాజిక మాథ్యమాల్లో, యూట్యూబ్, కొన్ని ఛానళ్లలో..మదనపల్లె టీడీపీ అభ్యర్థి మన్మథలీలలు పేరుతో కథనాలను ప్రచారం చేయించారు. ఇవిలా జరుగుతుండగానే, బుధవారం ఉదయం రెండు వేర్వేరు ఫోన్‌ నంబర్ల నుంచి కమ్మ సామాజికవర్గానికి చెందిన టీడీపీ నాయకులు జయరామనాయుడు పేరుపై ఐవీఆర్‌ఎస్‌ ప్రజాభిప్రాయ సేకరణ జరపడంతో….షాజహాన్‌బాషాను మార్చేస్తున్నారన్న ప్రచారం పట్టణంలో ఊపందుకుంది. ఏ ఇద్దరు కలిసినా ఇదే విషయమై చర్చించుకుంటున్నారు. తంబళ్లపల్లె, మదనపల్లె టీడీపీ అభ్యర్థులకు ప్రజాక్షేత్రంలో ఓటమి తప్పదని పార్టీ పలుమార్లు జరిపిన సర్వేల్లో తేలిపోవడంతో, అభ్యర్థుల మార్పు దిశగా చర్యలు తీసుకుంటోందన్నారు.

 

వైఎస్సార్‌ సీపీ తరపున మైనారిటీ అభ్యర్థి నిసార్‌అహ్మద్‌ పోటీలో ఉన్నందున, టీడీపీ నుంచి మైనారిటీ వ్యక్తికి కాకుండా వేరెవరికైనా సీటు కేటాయిస్తే గెలుపు తప్పదనే ధీమా టీడీపీ నాయకులు, కార్యకర్తలు పదే పదే చంద్రబాబు, లోకేష్‌ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వారు…సీటు ఆశించి భంగపడ్డ కమ్మ సామాజికవర్గానికి చెందిన నాయకులకు ఇండిపెండెంట్‌గా నామినేషన్‌ వేయమని లోపాయికారీగా చెప్పినట్లు తెలిసింది.

 

చివరినిమిషంలో బి–ఫారం ఇచ్చేటప్పుడు మీకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం. అందుకే…అసంతృప్తనాయకులు కొన్నాళ్లుగా స్తబ్దుగా ఉంటూ..లోలోపల తమ సన్నాహాలు సాగిస్తున్నారు. అన్నీ కలిసివస్తే మదనపల్లె టీడీపీ అభ్యర్థి మార్పు తథ్యమని తమ్ముళ్లు భావిస్తున్నారు.

ALSO READ : 

Revanth Reddy : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇంటికి సీఎం రేవంత్ రెడ్డి.. ప్రాధాన్యత సంతరించుకోనున్న ఇరువురి భేటీ..!

Telangana : తెలంగాణలో ఇందిరమ్మ కమిటీలు.. రూ. 6 వేల వేతనంతో నియామకం..!