విజయవంతంగా ముగిసిన ఉపాధ్యాయుల ఫిన్లాండ్ విద్యా పర్యటన..!
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా సారధ్యంలో చేపట్టిన టీచర్స్ ఎక్స్ పోసర్స్ విజిట్ అండ్ ఎడ్యుకేషనల్ ఎక్స్ చేంజ్ ప్రోగ్రామ్ టూ ఫిన్లాండ్ పర్యటన విజయవంతంగా ముగిసింది.

విజయవంతంగా ముగిసిన ఉపాధ్యాయుల ఫిన్లాండ్ విద్యా పర్యటన..!
మన సాక్షి, మిర్యాలగూడ :
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా సారధ్యంలో చేపట్టిన టీచర్స్ ఎక్స్ పోసర్స్ విజిట్ అండ్ ఎడ్యుకేషనల్ ఎక్స్ చేంజ్ ప్రోగ్రామ్ టూ ఫిన్లాండ్ పర్యటన విజయవంతంగా ముగిసింది.
తెలంగాణ రాష్ట్ర విద్యార్థులు ప్రపంచంతో పోటీపడాలని, అందుకుగాను ప్రపంచంలో అత్యుత్తమమైన ఫిన్లాండ్ దేశ విద్యా విధానాన్ని అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించగా 40మందితో కూడిన బృందం ఈ నెల ఏప్రిల్ 18 నుండి 26వరకు పర్యటించింది. వీరిలో 28 ఉపాధ్యాయులు కాగా మిగిలిన 12 మంది లో వివిధ హోదాలు గల అధికారులు, సాంకేతిక, వృత్తి విద్యా నిపుణులు ఉన్నారు.
ఈ బృందంలో నల్లగొండ జిల్లాకు చెందిన
ఇద్దరు ఉపాధ్యాయులు ఉన్నారు. పెద్దవూర మండలం ప్రాథమిక పాఠశాల ఏనెమీదిగూడెంకు చెందిన ఉపాధ్యాయుడు తూడి వెంకట్ రెడ్డి , మరొకరు గుర్రంపోడు మండలం ఆదర్శ పాఠశాలకు చెందిన ఉపాధ్యాయురాలు విథాని శీతల్ ఉన్నారు.
ఫిన్లాండ్ కు చెందిన హెల్సింకి యూనివర్సిటీ మరియు టర్కు యూనివర్సిటీల సంయుక్త సహకారంతో ఈ బృందం ఫిన్లాండ్ దేశ విద్యా పద్ధతులు, బోధన శాస్త్రం, పాఠ్య ప్రణాళిక, మూల్యాంకనం మరియు ఐసిటి అనుసంధానం వంటి అంశాలను పరిశీలించడానికి అక్కడి పాఠశాలలను మరియు ఉపాధ్యాయ శిక్షణ సంస్థలను స్వయంగా సందర్శించారు. ఫిన్లాండ్ దేశంలో 98%ప్రభుత్వ పాఠశాలలు ఉండగా కేవలం 2% మాత్రమే ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి.
ఒకటవ తరగతి నుంచి ఉన్నత విద్య వరకు ఉచితంగా అందిస్తారు. ప్రతి 45 నిమిషాల బోధన తర్వాత 15 నిమిషాల విరామం ఉంటుంది. ఈ బృంద సభ్యులు పర్యటనలో తాము పరిశీలించిన అంశాలను క్రోడీకరించి అధికారులతో కలిసి తయారుచేసిన నివేదకను త్వరలో రాష్ట్ర ప్రభుత్వానికి అందచేస్తారు. ఫిన్లాండ్ టర్కు యూనివర్సిటీ నుంచి ఉపాధ్యాయుడు వెంకట్ రెడ్డి సర్టిఫికెట్ అందుకున్నారు.
ఈ సందర్భంగా ఉపాధ్యాయుడు
తూడి.వెంకటరెడ్డి మాట్లాడుతూ
ఫిన్లాండ్ విద్యా వ్యవస్థలో విద్యార్థులు చదువుతో పాటు ఆటలు, కళలు మరియు నైతిక విలువలకు సమాన ప్రాధాన్యత ఇస్తారు. విద్యార్థికి ఎటువంటి ఒత్తిడి ఉండదు. హోమ్ వర్క్ కూడా తక్కువే. విద్యార్థులు ప్రతిదీ ప్రాక్టికల్స్ ద్వారా నేర్చుకుంటారు. విద్యార్థులు తమ సామర్ధ్యాల ఆధారంగానే తగిన కోర్సులను తామే స్వయంగా ఎంచుకుంటారు. ఇతరుల ప్రమేయం ఉండదు అన్నారు.
ఉపాధ్యాయురాలు విథాని శీతల్ మాట్లాడుతూ ఫిన్లాండ్ దేశంలో ఉపాధ్యాయులపై గౌరవం మరియు విశ్వాసం ఎక్కువ. ఉపాధ్యాయులకు బోధనల్లో పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. ఉపాధ్యాయులు తామే స్వయంగా పాఠ్య ప్రణాళికలను రూపొందించుకొని అమలు పరుస్తారన్నారు.









