Karimnagar : జిల్లా కలెక్టర్ కీలక నిర్ణయం.. రోడ్డు ప్రమాదాల అవగాహనపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్..!

Karimnagar : జిల్లా కలెక్టర్ కీలక నిర్ణయం.. రోడ్డు ప్రమాదాల అవగాహనపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్..!
కరీంనగర్, మనసాక్షి :
రోడ్డు ప్రమాదాలు జరగకుండా ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలని, అవగాహనతోనే ప్రమాదాలకు అడ్డుకట్ట వేయొచ్చని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పేర్కొన్నారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఆధ్వర్యంలో రోడ్ సేఫ్టీ కమిటీ మీటింగ్ నిర్వహించారు. ఇందులో పోలీస్ కమిషనర్ సిపి గౌష్ ఆలం పాల్గొన్నారు.
ఈ సమావేశంలో నేషనల్ హైవే అథారిటీ అధికారులు, ఆర్ అండ్ బి, రవాణా శాఖ, ఆర్టీసీ పంచాయతీ రాజ్ శాఖ అధికారులతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. ఇందులో ప్రధానంగా రోడ్డు ప్రమాదాల నివారణ.. భద్రత చర్యలు అనే అంశంపై పూర్తిస్థాయిలో సమీక్ష నిర్వహించారు. పవర్ ప్రజెంటేషన్ ద్వారా రోడ్డు ప్రమాదాలు అధికంగా అవుతున్న ప్రాంతాలపై అవగాహన కల్పించారు. ప్రమాదాలను పూర్తిస్థాయిలో నియంత్రించేందుకు చేపట్టాల్సిన చర్యలపై జిల్లా కలెక్టర్ సి పి చర్చించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారించేందుకు పోలీస్ మున్సిపల్ నేషనల్ హైవే ఆర్ అండ్ బి ఆర్ టి సి అధికారులంతా సమిష్టిగా కృషి చేయాలన్నారు. ఇందులో ప్రజలు కూడా సహకరించాలన్నారు. వాహనదారులు ప్రజలు ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటిస్తే రోడ్డు ప్రమాదాలను అరికట్టవచ్చని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు డిఫెన్సివ్ డ్రైవింగ్ తారకమంత్రమని, పరిసరాలను గమనిస్తూ డ్రైవింగ్ చేయడం వల్ల రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చన్నారు.
రోడ్డు ప్రమాదాలు అత్యధికంగా జరుగుతున్న ప్రాంతాల్లో వాటి నియంత్రణకు భద్రత చర్యలు చేపడతామన్నారు. ఇందుకు అవసరమైన చోట ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని అధికారులు ఆదేశించారు. ఈ సంవత్సరం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు.
రోడ్డు ప్రమాదాల నివారణకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలనీ, అందుకు అవసరమైన పనులు చేపట్టేందుకు అనుమతిస్తామని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. మొత్తానికి రోడ్డు ప్రమాదాలు లేని జిల్లాగా కరీంనగర్ జిల్లాను అధికారులంతా సమిష్టిగా తీర్చిదిద్దాలని సూచించారు.
రోడ్డు ప్రమాదాల నివారణకు
బహుముఖ వ్యూహం :
జిల్లాలో ఆయా రహదారులపై రోడ్డు ప్రమాదాలను పూర్తిగా నియంత్రించేందుకు పోలీస్ శాఖ తరఫున బహుముఖ వ్యూహం అమలు చేస్తున్నామని, ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకుంటున్నామని కరీంనగర్ సిపి గౌష్ ఆలం పేర్కొన్నారు. కరీంనగర్ టు హైదరాబాద్ వరంగల్ రూటు జగిత్యాల సిరిసిల్ల చొప్పదండి రూట్ లో రహదారులపై ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించామని తెలిపారు.
ఆయా రహదారుల్లో బ్లాక్ స్పాట్లను గుర్తించామని రోడ్డు ప్రమాదాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. పోలీస్ శాఖ నుంచి పకడ్బందీగా వ్యవహరిస్తున్నామని దీనివల్ల కొంతవరకు రోడ్డు ప్రమాదాలు నివారణకు కృషి చేశామని చెప్పారు. ఈ ప్రమాదాలకు ముఖ్య కారణం అతివేగం నిర్లక్ష్యంగా మద్యం తాగి డ్రైవింగ్ చేయడమేనని తెలిపారు.
కరీంనగర్లో ట్రాఫిక్ సిగ్నల్స్ అన్ని పనిచేసేలా అధికారులు ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ఎక్కడ ఏం అవసరం ఉన్నా అధికారులు భద్రత చర్యలు చేపట్టాలన్నారు. కళాశాల విద్యార్థులు స్కూల్ పిల్లలు ఎవరైనా రోడ్డు దాటేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని తెలిపారు.
.అదేవిధంగా అనుమతించ బడిన వేగం వరకే వాహనాలు నడపాలని అతివేగంగా, రాంగ్ రూట్లో వాహనాన్ని నడిపి ప్రమాదాలను కొని తెచ్చుకోవద్దని సూచించారు. వాహనాలు నడిపేటప్పుడు ట్రాఫిక్ రూల్స్ ను తప్పకుండా పాటించాలని హెల్మెట్ ను ధరించాలని తెలియజేశారు. ప్రతిరోజు వెహికల్ చెకింగ్ లో భాగంగా డ్రంక్ అండ్ డ్రైవ్, రాంగ్ రూట్ డ్రైవింగ్ వంటి వాటిని గుర్తించి వారికి ఫైన్ విధిస్తున్నామని తెలిపారు.
అదే విధంగా రోడ్డుపైన వాహనాలను పార్కింగ్ చేయకుండా నిర్దేశించిన ప్రదేశంలో పార్కింగ్ చేయడం ద్వారా ట్రాఫిక్కు అంతరాయం ఉండదని తెలిపారు. రోడ్డు ప్రమాదాలు నివారణకే డిజిపి శివదర్ రెడ్డి అరైవ్ అలైవ్ కార్యక్రమాన్ని ప్రారంభించారని ఈ కార్యక్రమాన్ని జిల్లాలో విస్తృతంగా చేపడుతున్నామని సిపి తెలిపారు.
జాతీయ రహదారిపై పరిమితికి లోబడి వాహనం వేగం ఉండాలని పరిమితికి మించి వాహనాన్ని నడిపినట్లయితే స్పీడ్ గన్ ద్వారా గుర్తించి సిబ్బంది జరిమానా వేస్తామని చెప్పారు. వాహన దారులు కచ్చితంగా వాహనానికి సంబంధించిన కాగితాలతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని తెలియజేశారు.
ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ ఆర్టీవో శ్రీకాంత్ చక్రవర్తి ఏసీపీలు విజయకుమార్, వెంకటస్వామి శ్రీనివాస్ జి, యాదగిరి స్వామి, పలువురు సిఐలు ఎస్సైలు అధికారులు తదితరులు పాల్గొన్నారు.
MOST READ NEWS :









