అకాల వర్షం.. కల్లాల్లోనే తడిసిన ధాన్యం..!
కంగ్టి మండల దమరగిద్ద (పీఎం)లో కురిసిన అకాల వర్షం రైతులకు తీవ్ర నష్టాన్ని కలిగించింది.

అకాల వర్షం.. కల్లాల్లోనే తడిసిన ధాన్యం..!
BY : JALEEL, KANGTI
కంగ్టి : కంగ్టి మండల దమరగిద్ద (పీఎం)లో కురిసిన అకాల వర్షం రైతులకు తీవ్ర నష్టాన్ని కలిగించింది. ఒక్కసారిగా వర్షం పడటంతో కల్లాల్లో ఆరబోసిన ధాన్యం తడిసిపోయింది. వరద నీటిలో వరి ధాన్యం కొట్టుకు పోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.రైతు సాయిలు 12 ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని సాగు చేసిన వరి ధాన్యం, గురువారం కురిసిన అకాల వర్షానికి వరద ఉధృతికి కొట్టుకుపోయింది. రెండు ట్రాక్టర్ ట్రాలీలకు సరిపడా ఉన్న వరి ధాన్యం నీటిలో కొట్టుకపోవడంతో రైతు కుటుంబం తీవ్ర ఆవేదనలో మునిగిపోయింది.
కష్టపడి, అప్పులు చేసి, పెట్టుబడులు పెట్టి పండించిన పంట కళ్లముందే వరదలో కొట్టుకుపోవడంతో రైతు గుండెలవిసేలా విలపిస్తున్నాడు. ఇప్పటికే వ్యవసాయ పెట్టుబడులు,కౌలు ఖర్చులతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతుకు ఈ ఘటన తీరని నష్టాన్ని మిగిల్చింది.
“అధికారుల నిర్లక్ష్యమే కారణమా”
అధికారులు ముందస్తు చర్యలు తీసుకుని ఉంటే ఈ నష్టాన్ని కొంతవరకైనా నివారించగలిగేవారని రైతు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ జరిపి నష్టాన్ని అంచనా వేయాలని కోరుతున్నారు.
” ప్రభుత్వం రైతుకు ఆదుకోవాలి “
రెండు ట్రాక్టర్ ట్రాలీల వరి ధాన్యం కోల్పోయిన రైతు కొత్త గైని సాయిలుకు ప్రభుత్వం తక్షణమే నష్టపరిహారం అందించాలని, వ్యవసాయ శాఖ అధికారులు వెంటనే స్పందించి పంట నష్టాన్ని నమోదు చేయాలని స్థానికులు కోరుతున్నారు.









