District collector : జిల్లా కలెక్టర్ కీలక ఆదేశాలు.. ఏప్రిల్ ఒకటి నుండి ఈ ఆఫీస్ ద్వారా మాత్రమే ఫైళ్లను నిర్వహించాలి..!
నల్గొండ జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఏప్రిల్ ఒకటి నుండి ఈ- ఆఫీస్ ద్వారా మాత్రమే ఫైళ్లను నిర్వహించాలని ఆదేశించారు.

District collector : జిల్లా కలెక్టర్ కీలక ఆదేశాలు.. ఏప్రిల్ ఒకటి నుండి ఈ ఆఫీస్ ద్వారా మాత్రమే ఫైళ్లను నిర్వహించాలి..!
నల్లగొండ, మనసాక్షి :
నల్గొండ జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఏప్రిల్ ఒకటి నుండి ఈ- ఆఫీస్ ద్వారా మాత్రమే ఫైళ్లను నిర్వహించాలని ఆదేశించారు. ఈ- ఆఫీస్ ద్వారా ఫైళ్ళ నిర్వహణ విషయమై ఇదివరకే జిల్లా అధికారులు, వారి సిబ్బందికి శిక్షణ ఇచ్చినట్లు ఆయన చెప్పారు .అందువల్ల జిల్లా అధికారులందరూ ఈ- ఆఫీస్ ద్వారా మాత్రమే ఫైళ్ళ నిర్వహణకు సంసిద్ధం కావాలని ఆయన కోరారు.
సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించిన అనంతరం జిల్లా కలెక్టర్ అధికారులతో వివిధ అంశాలపై సమీక్ష నిర్వహించారు.ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమం సందర్భంగా ఏప్రిల్ 2 న గ్రామసభలు నిర్వహించాలని, అలాగే మున్సిపాలిటీలలో మున్సిపల్ వార్డు సభలు నిర్వహించాలని, ప్రభుత్వం జారీ చేసే సూచనల ప్రకారం గ్రామ, వార్డు సభలు నిర్వహించాలని చెప్పారు. ఇదివరకు ఆదేశించినట్లు వివిధ పథకాల ద్వారా లబ్ధి పొందిన లబ్ధి దారుల వివరాలను గ్రామసభలలో చదివి వినిపించాలని, గ్రామసభల్లో ప్రజలకు అర్థమయ్యే విధంగా ఫోటోలు, వీడియోలతో ప్రజెంటేషన్ ఇవ్వాలని, ఎంపీడీవోలు, పంచాయతీ కార్యదర్శులు సమావేశాల మినిట్స్‌ను సక్రమంగా నమోదు చేయాలని తెలిపారు.
ప్రజా పాలన పరిధిలోకి రాని పథకాల ద్వారా లబ్ధి పొందిన వారి వివరాలను ఉదాహరణకు వివిధ సంక్షేమ శాఖల ద్వారా విద్యార్థులు పొందిన ఉపకార వేతనాల లబ్ది, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధి, 6 గ్యారంటీ ల ద్వారా పొందిన లబ్ది అలాగే ధరణి కింద తిరుమలగిరి సాగర్ మండలాన్ని, భూభారతి కింద దేవరకొండ మండలంలో తీసుకున్న పైలెట్ ప్రాజెక్టును, కనగల్ మండలంలో పైలెట్ ప్రాజెక్టు కింద సోలార్ రూఫ్ టాప్ ద్వారా లబ్ధి పొందుతున్న లబ్ధిదారుల వివరాలను సైతం ప్రజలకు తెలియజేయాలని, అందువల్ల గ్రామం, మండలం, నియోజకవర్గం, జిల్లా వారీగా రూపొందించి వెంటనే సిపిఓ కు సమర్పించాలని ఆదేశించారు.
అలాగే ఈ- వేస్ట్ నిర్వహణ వివరాలు ఇవ్వాలన్నారు. పెండింగ్ ప్రజావాణి దరఖాస్తులను తక్షణమే పరిష్కరించి పెండెన్సీ ని తగ్గించాలన్నారు. రబీ ధాన్యం కొనుగోలు ప్రారంభమైన దృష్ట్యా రానున్న రెండున్నర నెలలు అత్యంత కీలకమని, అలాగే జూన్ వరకు ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక, జనగణన, ధాన్యం కొనుగోలు, వంటి ముఖ్యమైన పథకాలను అమలు చేయాల్సి ఉందని, జిల్లా అధికారులు వీటిపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని, అత్యవసరమైతే తప్ప, ఎవరికి సెలవులు ఉండవని స్పష్టం చేశారు. మండల ప్రత్యేక అధికారులు వారి మండలాలలో టెన్త్ పూర్తిచేసిన విద్యార్థులు ఎట్టి పరిస్థితులలో ఖాళీగా ఉండరాదని, ఇంటర్మీడియట్, ఐటీఐ, పాలిటెక్నిక్ వంటి కోర్సుల్లో తప్పనిసరిగా చేరేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ముఖ్యంగా ఆడపిల్లలు చదువు మధ్యలో నిలిపి పెళ్లిళ్ల వైపు వెళ్లకుండా ప్రోత్సహించాలని చెప్పారు. ధాన్యం కొనుగోలు సమయంలో రవాణా సౌకర్యాలను మెరుగుపరచాలని, డీఆర్‌డీఏ, మెప్మా తదితర శాఖలు ధాన్యం కొనుగోలుకు ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. రాబోయే ఎండాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని తాగునీటి సమస్యలు రాకుండా అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని ,
అన్ని శాఖలలో పెండింగ్లో ఉన్న ఫైల్స్ వెంటనే క్లియర్ చేయాలని అన్నారు.
అనంతరం మార్కెటింగ్ శాఖ ద్వారా 2025 -2026 రబీ ధాన్యం కొనుగోలుపై రూపొందించిన గోడపత్రికను ఆవిష్కరించారు. జిల్లా ముస్లిం ఉద్యోగుల టేబుల్ క్యాలెండర్ ను ఆవిష్కరించారు.27 వ జాతీయ సీనియర్ చెవిటి క్రీడల ఛాంపియన్షిప్ పోటీలలో మెడల్స్ పొందిన జిల్లా క్రీడాకారులను కలెక్టర్ అభినందించారు.కాగా సోమవారం నాటి ప్రజావాణికి మొత్తం 126 ఫిర్యాదులు రాగా,రెవెన్యూ శాఖకు 69,ఇతర శాఖలకు 57 ఫిర్యాదులు వచ్చాయి.
ప్రజావాణి కార్యక్రమానికి రెవిన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు కలెక్టర్ వై. అశోక్ రెడ్డి, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శేఖర్ రెడ్డి , చండూర్ ఆర్డిఓ శ్రీదేవి, దేవరకొండ ఆర్డిఓ రమణారెడ్డి ,జిల్లా అధికారులు హాజరయ్యారు.



