కరీంనగర్ యువ సమరభేరిలో రేవంత్ పై కేటీఆర్ ధ్వజం..!
యువతరం పోరాటానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీనే వణికిపోయారని, అలాంటిది ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎంత అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు.

కరీంనగర్ యువ సమరభేరిలో రేవంత్ పై కేటీఆర్ ధ్వజం..!
యువతరం పోరాటానికి మోదీనే వణికిపోయారు.. రేవంత్ ఎంత..?
వెయ్యి రోజుల్లో కాంగ్రెస్ ఇచ్చిన ఉద్యోగాలపై చర్చకు సిద్ధమా అంటూ సవాల్
కరీంనగర్ బ్యూరో, మనసాక్షి :
యువతరం పోరాటానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీనే వణికిపోయారని, అలాంటిది ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎంత అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. యువతను నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలనకు నిరసనగా శనివారం కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో నిర్వహించిన యువ సమరభేరి సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు.
నిరుద్యోగుల సమస్యలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ఇప్పుడు ఎందుకు స్పందించడం లేదని కేటీఆర్ ప్రశ్నించారు. నిరుద్యోగ సమస్యలు, ఉద్యోగాల భర్తీ అంశంపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని స్పష్టం చేశారు. తెలంగాణను దశాబ్దాలపాటు కాంగ్రెస్ మోసం చేసిందని, ఆ పార్టీని నమ్మి తెలంగాణ ప్రజలు మరోసారి మోసపోయారని విమర్శించారు.
ఎన్నికల సమయంలో యువత కోసం ప్రకటించిన యూత్ డిక్లరేషన్ ఇప్పుడు ‘బూతు డిక్లరేషన్’గా మారిందని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఇంజినీరింగ్ విద్యార్థులకు నైపుణ్యం లేదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అంటున్నారని, అసలు సీఎంకు ఏం నైపుణ్యం ఉందని విద్యార్థులే ప్రశ్నిస్తున్నారని పేర్కొన్నారు. కేసీఆర్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారని, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ రాజీనామా చేయాలా? లేక వంద రోజుల్లో హామీలు అమలు చేస్తామని చెప్పి ప్రజలను మోసం చేసిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాజీనామా చేయాలా? అని కేటీఆర్ ప్రశ్నించారు.
ఒక్క మంత్రిని బర్తరఫ్ చేయడం కాదని, కాంగ్రెస్ ప్రభుత్వాన్నే బర్తరఫ్ చేసే రోజులు దగ్గరలో ఉన్నాయని హెచ్చరించారు. వెయ్యి రోజుల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం 16 వేల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చిందని, రీ-నోటిఫికేషన్లను తీసేస్తే 10 వేల ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేదని ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో ఉద్యోగాల్లో స్థానికులకు 95 శాతం రిజర్వేషన్లు కల్పించామని, పదేళ్లలో 2.32 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశామని కేటీఆర్ లెక్కలు వివరించారు.
ఈ అంశంపై బహిరంగ చర్చకు కాంగ్రెస్ సిద్ధమా అని సవాల్ విసిరారు. ఉద్యోగాల భర్తీ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రులు తలోమాట మాట్లాడుతున్నారని ఆరోపించారు. యువతకు ఇచ్చిన హామీల అమలుపై కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టమైన సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
MOST VIEWS :










