అర్హతలేని వైద్యం.. కొరవడిన నిఘా..!
నల్లగొండ జిల్లా చింతపల్లి మండల పరిధిలోని పలు గ్రామాల్లో అర్హత లేని వ్యక్తులు ఆర్ఎంపీల అవతారమెత్తి ఇష్టారాజ్యంగా వైద్యం అందిస్తున్నారన్న ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.

అర్హతలేని వైద్యం.. కొరవడిన నిఘా..!
– నిరుపేద ప్రజలతో ఇష్టారాజ్యంగా ప్రాణాలతో చెలగాటమా
– కనీస విద్యార్హత లేకుండానే ఆర్ఎంపీలుగా చెలామణి
– నాటు వైద్యం, తాయితాల పేరుతో మూఢనమ్మకాలకు ప్రోత్సాహం
– తక్షణమే స్పందించి తనిఖీలు చేపట్టాలి
చింతపల్లి, మన సాక్షి:
నల్లగొండ జిల్లా చింతపల్లి మండల పరిధిలోని పలు గ్రామాల్లో అర్హత లేని వ్యక్తులు ఆర్ఎంపీల అవతారమెత్తి ఇష్టారాజ్యంగా వైద్యం అందిస్తున్నారన్న ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ముఖ్యంగా ప్రధాన గ్రామ పంచాయతీల్లో కనీస విద్యార్హత లేని వారు కూడా డాక్టర్లుగా చెలామణి అవుతూ ప్రజారోగ్యంతో చెలగాటమాడుతుంటే, సంబంధిత వైద్య ఆరోగ్య శాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంపై గ్రామీణులు మండిపడుతున్నారు.
అర్హతలేని డాక్టర్ల చేతుల్లో అమయకుల ప్రాణాలు:
వైద్యం అనేది మానవ ప్రాణాలతో ముడిపడి ఉన్న అత్యంత సున్నితమైన అంశం. ప్రాణాలను నిలపాల్సిన వైద్యరంగంలో ఎలాంటి విద్యార్హత, రిజిస్ట్రేషన్ లేని వ్యక్తులు తిష్టవేసి ఇష్టారాజ్యంగా మందులు, ఇంజెక్షన్లు ఇస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మండలంలోని కొన్ని ప్రాంతాల్లో పదో తరగతి కూడా దాటని వ్యక్తులు క్లినిక్లు తెరిచి అర్హతకు మించిన చికిత్సలు చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీనిపై అధికారులు వెంటనే స్పందించి క్షేత్రస్థాయి పరిశీలన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
నాటు వైద్యం, మూఢనమ్మకాల వ్యాపారం:
ఆర్ఎంపీల ముసుగులో కొందరు నాటు వైద్యం పేరుతో అశాస్త్రీయ చికిత్సలు అందిస్తూ అమాయక ప్రజలను మోసం చేస్తున్నట్లు సమాచారం. ప్రజల అనారోగ్యాన్ని,అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని తాయితాలు, మంత్రాలు-తంత్రాలు, మూఢనమ్మకాల పేరుతో దందాలు నడుపుతున్నారని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సకాలంలో సరైన శాస్త్రీయ వైద్యం అందక రోగుల ఆరోగ్య పరిస్థితి విషమించడంతో పాటు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నారని వాపోతున్నారు.
అధికారుల పర్యవేక్షణ శూన్యం:
చింతపల్లి మండలంలో వెలసిన ఈ కేంద్రాలపై ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అధికారులు గానీ, జిల్లా అధికారులు గానీ ఎందుకు దృష్టి సారించడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.చికిత్సలు అందిస్తున్న వ్యక్తుల అసలు విద్యార్హత ఏమిటి వారి వద్ద చెల్లుబాటు అయ్యే సర్టిఫికెట్లు, అనుమతులు ఉన్నాయా? ఎలాంటి మందులు, హై డోస్ ఇంజెక్షన్లు వాడుతున్నారు? మూఢనమ్మకాలు, నాటు వైద్యం పేరుతో చట్టవిరుద్ధ కార్యకలాపాలు సాగిస్తున్నారా? ఇలాంటి కీలక అంశాలపై సమగ్ర విచారణ జరిపి నివేదిక సేకరించాలని మండల ప్రజలు కోరుతున్నారు.
డీఎంహెచ్‌ఓ తక్షణమే చర్యలు తీసుకోవాలి:
ఈ వ్యవహారంపై నల్లగొండ జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి (డీఎంహెచ్‌ఓ) తక్షణమే స్పందించాలని చింతపల్లి మండల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ప్రత్యేకాధికారుల బృందంతో అన్ని మేజర్ పంచాయతీల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి, అర్హత లేకుండా వైద్యం చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే నాటు వైద్యులకు అడ్డుకట్ట వేసి, గ్రామీణ ప్రాంతాల్లో సరైన వైద్య సేవలు అందేలా పర్యవేక్షణ పెంచాలని స్థానికులు గట్టిగా కోరుతున్నారు.
MOST READ
- Hyderabad : హైదరాబాదులోని బాలాపూర్ లో దారుణం.. ప్రియురాలిని హత్య చేసి గోనె సంచిలో తరలిస్తుండగా..!
- Hyderabad : మత్తు మాఫియాపై ఉక్కుపాదం.. తీగ లాగితే డొంక కదిలింది.. రూ.1.50 కోట్ల విలువైన హషీష్ ఆయిల్ పట్టివేత..!
- బోనాల పండుగలో అపశృతి.. ట్రాక్టర్ పల్టీ కొట్టడంతో ఒకవ్యక్తి మృతి..!
- Srisailam : శ్రీశైలంకు వరద బంద్.. మూసుకుపోయిన ఆల్మట్టి గేట్లు, సాగర్ లో నీటిమట్టం ఎంతంటే..!









