CM Revanth Reddy : పదేళ్లలో రేషన్ షాపులు తెరవలేదు.. కానీ బెల్ట్ షాపులు తెరిచారు.. సీఎం రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు..!
CM Revanth Reddy : పదేళ్లలో రేషన్ షాపులు తెరవలేదు.. కానీ బెల్ట్ షాపులు తెరిచారు.. సీఎం రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు..!
సూర్యాపేట, మనసాక్షి :
బీఆర్ఎస్ ప్రభుత్వ పదేళ్ల పాలనలో ఒక్కరికి కూడా రేషన్ కార్డు ఇవ్వ లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. పేదవాడికి సన్న బియ్యం ఇచ్చి.. గుక్కెడు ముద్ద పెట్టాలని ఆలోచన సైతం గత ప్రభుత్వంలోని పెద్దలు చేయలేదని మండిపడ్డారు. సోమవారం సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరిలో రేషన్ కార్డుల పంపిణి కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు.
అలాగే పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఆయన.. రూ. 34. 20 కోట్ల విలువైన పనులు సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు.తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ అధ్యక్షతన జరిగిన సభ లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ హయాంలో రేషన్ షాపులు తెరవలేదని.. బెల్ట్ షాపులు తెరిచారంటూ వ్యంగ్యంగా అన్నారు.
రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం ఇస్తుంటే.. ఓర్వ లేక తమ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయంటూ మండిపడ్డారు. రైతు పండించిన పంటను కొనుగోలు చేస్తున్నామని.. రైతు బోనస్ సైతం ఇస్తున్నామని చెప్పారు. రేషన్ కార్డు అంటే పేద వారి ఆత్మగౌరవం.. గుర్తింపు అని ఈ సందర్భంగా ఆయన అభివర్ణించారు. పేదల ఆకలి తీర్చే ఆయుధమే రేషన్ కార్డు అని పేర్కొన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించిన ప్రాజెక్టుల వల్లే నేడు నల్గొండ జిల్లాకు నీళ్లు వస్తున్నాయని గుర్తు చేశారు.
రైతులకు రూ.2 లక్షల రుణ మాఫీ చేస్తామని చెప్పామని.. ఈ హామీని తమ ప్రభుత్వం చేసి చూపించిందన్నారు. అయితే తమ ప్రభుత్వం రైతు భరోసా ఎగ్గొట్టిందంటూ దుష్ప్రచారం చేశారని ప్రతిపక్షాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ కేవలం తొమ్మిది రోజుల్లోనే రైతులకు రైతు భరోసా నగదు అందించామన్నారు. ధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో ఉందని తెలిపారు.
18 నెలల్లో మహాలక్ష్మీ పథకంలో భాగంగా ప్రవేశపెట్టి మహిళల ఉచిత బస్సు ప్రయాణానికి రూ. 6, 500 కోట్లు ఖర్చు అయిందని వివరించారు. తమ ప్రభుత్వం కొలువు తీరి రెండేళ్లు పూర్తయ్యే సరికి 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. కేసీఆర్ కట్టిన కాళేశ్వరం.. ఆయన హయాంలోనే కూలేశ్వరం అయ్యిందని ఎద్దేవా చేశారు. కూలేశ్వరం ప్రాజెక్టు దగ్గరే వారిని ఉరి తీసినా తప్పు లేదన్నారు. ప్రాజెక్టులపై చర్చకు సిద్ధమా? అంటూ బీఆర్ఎస్ నేతలకు ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి సవాల్ విసిరారు.
మూడు అడుగులు ఉన్నడు.. ఎగిరెగిరి పడుతున్నాడు:
మూడు అడుగులున్న స్థానిక నేత ఎగిరెగిరి పడుతున్నారని ఎద్దేవా చేశారు. పదేళ్లు అవకాశం ఇచ్చినా తుంగతుర్తికి నీళ్లు ఎందుకు తేలేదంటూ మాజీ మంత్రి జగదీష్ రెడ్డిని సీఎం సూటిగా ప్రశ్నించారు. తుంగతుర్తికి నీరు తేవడమంటే.. గ్లాస్లో సోడా పోసినట్లు కాదంటూ బీఆర్ఎస్ నేతకు ఈ సందర్భంగా చురకలంటించారు. దొర ముందు చేతులు కట్టుకుని గ్లాస్లో సోడా పోయడమే నీకు తెలుసంటూ మాజీ మంత్రి జగదీష్ రెడ్డిపై మండిపడ్డారు.
సొంత మండలానికి ఎమ్మార్వో, ఎంపీడీవో ఆఫీస్లే కాదు.. పోలీస్ స్టేషన్ సైతం తెచ్చుకోలేని ఘనత బీఆర్ఎన్ నేతలదంటూ వ్యంగ్యంగా అన్నారు. పోరాట యోధులను అందించిన గడ్డ నల్గొండ అని ఈ సందర్బంగా సీఎం రేవంత్ రెడ్డి అభివర్ణించారు. నాడు గంజికి లేని మూడు అడుగుల నాయకుడు.. నేడు బెంజి కార్లలో తిరుగుతున్నారంటూ జగదీశ్వర్ రెడ్డిపై వ్యంగ్య బాణాన్ని సీఎం రేవంత్ రెడ్డి సంధించారు.
తెలంగాణలో కొత్తగా 3. 58 లక్షల రేషన్ కార్డుల పంపిణీ పంపిణి చేస్తున్నట్లు వివరించారు. కొత్త రేషన్ కార్డుల ద్వారా 11.3 లక్షల మందికి లబ్ధి చేకూరతుందన్నారు. తెలంగాణలో మొత్తం 95. 56 లక్షల మంది రేషన్ కార్డులు అందుకున్నారని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి వివరించారు.
MOST READ :
-
Nalgonda : ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు ఫుడ్ పాయిజన్.. చికిత్స పొందుతున్న 45 మంది విద్యార్థులు..!
-
Jeera water : జీలకర నీరు తాగితే ఏమవుతుందో తెలుసా.. వెంటనే తెలుసుకోండి..!
-
UPI : ఫోన్ పే, గూగుల్ పే లో బ్యాలెన్స్ చెక్ చేస్తున్నారా.. అయితే ఇది తెలుసుకోవాల్సిందే..!
-
Viral Video : రెండు నెలల క్రితం వివాహం.. సెల్ఫీ దిగుదామని భర్తను నది ఒడ్డుకు తీసుకెళ్లిన భార్య.. (వీడియో)
-
Vaccine : మహిళలకు భారీ శుభవార్త.. ఆ వ్యాక్సిన్‌తో గర్భాశయ క్యాన్సర్‌కు చెక్.. అందరికి మేలు..!










