ప్రపంచ కాలేయ దినోత్సవం 2026 సందర్భంగా గ్లెనెగల్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ
లక్డీకాపూల్‌లో ఉన్న గ్లెనెగల్స్ హాస్పిటల్ (ఫోర్టిస్ హెల్త్‌కేర్ నెట్‌వర్క్‌లో భాగం) వరల్డ్ లివర్ డే 2026 సందర్భంగా రైడ్ ఫర్ ఏ కాజ్ పేరుతో ఒక భారీ బైక్ ర్యాలీని నిర్వహించింది

హైదరాబాద్: లక్డీకాపూల్‌లో ఉన్న గ్లెనెగల్స్ హాస్పిటల్ (ఫోర్టిస్ హెల్త్‌కేర్ నెట్‌వర్క్‌లో భాగం) వరల్డ్ లివర్ డే 2026 సందర్భంగా రైడ్ ఫర్ ఏ కాజ్ పేరుతో ఒక భారీ బైక్ ర్యాలీని నిర్వహించింది. కాలేయ ఆరోగ్యం కాలేయ వ్యాధులను ముందుగానే గుర్తించడంపై ప్రజల్లో అవగాహన పెంచడానికి ఏటా ఏప్రిల్ 19న నిర్వహించే వరల్డ్ లివర్ డేను పురస్కరించుకుని ఈ కార్యక్రమం జరిగింది. ఈ ఏడాది సాలిడ్ హ్యాబిట్స్, స్ట్రాంగ్ లివర్ (“Solid Habits, Strong Liver”) అనే థీమ్‌తో రోజువారీ జీవనశైలి అలవాట్లు కాలేయ వ్యాధులను ఎలా అరికడతాయనే అంశంపై ఈ ర్యాలీ దృష్టి సారించింది.
ఈ కార్యక్రమంలో హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్న బైక్ క్లబ్‌లు, ఆసుపత్రి ఉద్యోగులు ఆరోగ్య సిబ్బందితో సహా మొత్తం 500 మందికి పైగా బైకర్లు పాల్గొన్నారు. లక్డీకాపూల్‌లోని గ్లెనెగల్స్ హాస్పిటల్‌కు చెందిన సీనియర్ కాలేయ వ్యాధి నిపుణులు, సర్జన్లు నిర్వాహకుల సమక్షంలో హైదరాబాద్ సైఫాబాద్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆర్. సంజయ్ కుమార్ ఈ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. లక్డీకాపూల్ నుండి ప్రారంభమైన ఈ బైక్ ర్యాలీ నగరంలోని ప్రధాన రహదారుల గుండా సాగి తిరిగి హాస్పిటల్‌కు చేరుకుంది. దారి పొడవునా బైక్ రైడర్లు కాలేయ ఆరోగ్యంపై సందేశాలు ఉన్న జెండాలను పట్టుకుని, హెల్మెట్లను ధరించి ప్రజలను ఆకర్షించారు. రోడ్డు భద్రతతో పాటు సమతుల ఆహారం, రోజూ వ్యాయామం, మద్యపానానికి దూరం క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం వంటి అంశాలపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా గ్లెనెగల్స్ లివర్ కేర్ బృందం బైకింగ్ కమ్యూనిటీతో మమేకమై వ్యాధులను ముందుగానే గుర్తించడం ఎంత ముఖ్యమో వివరించారు. లీడ్ హెపటాలజిస్ట్ డాక్టర్ కావ్య హారిక దెందుకూరి, సీనియర్ సర్జన్ డాక్టర్ తరుణ్ గట్టు, డాక్టర్ మణికంటేశ్వర రావు డాక్టర్ జి విక్టర్ వినోద్ బాబు మాట్లాడుతూ.. క్రమం తప్పకుండా స్క్రీనింగ్ చేయించుకోవడం ద్వారా పెరుగుతున్న కాలేయ వ్యాధులను అరికట్టవచ్చని నొక్కి చెప్పారు. రీజినల్ సీఈఓ భరత్ కాంత్ రెడ్డి మాట్లాడుతూ, ప్రజలు ఆరోగ్యకరమైన అలవాట్లను అలవర్చుకునేలా ప్రోత్సహించడానికి తాము కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు. చీఫ్ అడ్మినిస్ట్రేటర్ భరత్ ఎం మాట్లాడుతూ, పని చేసే వయసులో ఉన్న వారిలో ఈ సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయని, యువతను కాలేయ ఆరోగ్యానికి అంబాసిడర్లుగా మార్చడమే తమ లక్ష్యమని వివరించారు. చివరగా మార్కెటింగ్ జీఎం కూర మురళీధర్ మాట్లాడుతూ, ఇలాంటి రైడ్స్ ప్రజల్లోకి సందేశాన్ని బలంగా తీసుకువెళ్తాయని అన్నారు.









